‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్ర బృందానికి అభినందనలు

గిరిజన దంపతులకీ, ఒక ఏనుగుకీ మధ్య ఏర్పడ్డ అనుబంధాన్ని చూపించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ ఆస్కార్ పురస్కారం దక్కించుకోవడం సంతోషదాయకమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డాక్యుమెంటరీ రూపొందించిన దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. తల్లి నుంచి వేరుపడి దారి తప్పిపోయిన ఏనుగు పి‌ల్లను సంరక్షించిన బొమ్మన్, బెల్లి అనే గిరిజన దంపతులు… ఆ ఏనుగు పిల్లకు రఘు అని పేరు పెట్టి ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్న తీరును హృదయాన్ని హత్తుకొనేలా చూపించారు. ఈ డాక్యుమెంటరీ చూస్తుంటే కళ్ళు చెమర్చాయి. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆలోచింపచేస్తుంది. ఈ భూమి ఉన్నది మన కోసమే అనే భావనను విడిచిపెట్టాల్సిన అవసరాన్ని చెబుతుంది. ఈ ప్రకృతిలో భాగమైన జంతుజాలానికీ ఈ భూమిపై జీవించే హక్కు ఉందనీ, ఈ నేలపై వాటి ఉనికినీ గుర్తించాలని ఈ డాక్యుమెంటరీ మరోసారి మనకు తెలియచేస్తుంది. ఇటువంటి డాక్యుమెంటరీలు మరిన్ని వచ్చేందుకు ది ఎలిఫెంట్ విస్పరర్స్ గెలుచుకున్న ఆస్కార్ స్ఫూర్తిగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.