నాలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ సక్సెస్‌

ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను ఇప్పటికే ప్రారంబించాయి. భారత్ లోనూ చేపట్టిన కరోనా డ్రై రన్ విజయవంతమైంది. భారత్‌లోని నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్‌ను నేడు చేపట్టారు. వచ్చే నెలలో కొవిడ్ 19 వ్యాక్సిన్‌ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, అసోం రాష్ట్రాలలో డ్రై రన్ విజయవంతంగా నిర్వహించినట్లు మంగళవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ జిల్లా, గుజరాత్‌లోని రాజ్కోట్, గాంధీనగర్, లుధియానా, పంజాబ్‌లోని షాహీద్ భగత్ సింగ్ నగర్, అసోంలోని సోనిత్‌పూర్, నల్బరి జిల్లాల్లో రెండు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

సోమవారం పూర్తిగా వాలంటీర్ల మాక్ రిజిస్ట్రేషన్‌పై దృష్టి సారించిన అధికారులు.. మంగళవారం ‘డమ్మీ టీకా’ కు ఏర్పాట్లుచేశారు. నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 125 మంది డమ్మీ టీకాలో పాల్గొన్నారు. అంతకుమందుకు వీరంతా కొవిన్‌ యాప్‌లో వాలంటీర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారు. అనంతరం వారి మొబైల్ ఫోన్లకు వచ్చిన ఎస్‌ఎంఎస్‌ మేరకు వారికి కేటాయించిన ప్రాంతాల్లో షాట్ల కోసం ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో రిపోర్ట్ చేసి డమ్మీ టీకాకు సహకరించారు.

నాలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌-19 టీకా కోసం ఉంచిన యంత్రాంగాలను తనిఖీ చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వాస్తవ టీకా డ్రైవ్ ప్రారంభానికి ముందే ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడానికి సమయం కేటాయించడం ఈ డ్రై రన్‌ లక్ష్యం. డ్రై రన్ సమయంలో కొవిన్‌ కార్యాచరణను తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. కొవిన్ అనేది ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం. ఇది కొవిడ్‌-19 వ్యాక్సిన్ డెలివరీ పర్యవేక్షణ కోసం ప్రభుత్వం అభివృద్ధి చేసింది. డ్రై రన్ జట్టు సభ్యుల మోహరింపు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు, రవాణా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను కూడా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

డ్రై రన్ అంటే, ఇదొక మాక్ డ్రిల్ లాంటిదే టీకా పంపిణీకి అధికార యంత్రగానికి అప్రమత్తం చెయ్యడం.ప్రజల్లో కరోనా వ్యాక్సిన్ విషయంలో ఉన్న అపోహలను పోగొట్టడమే, వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించి ముందుగానే చర్యలు తీసుకోవడం లాంటిది. అందుకు డమ్మీ వ్యాక్సిన్ ను ఇస్తారు.