అభివృద్ధి… సంక్షేమం… ఉపాధే కూటమి లక్ష్యం

• అణగారిన వర్గాలకు ఆర్థికంగా అండగా నిలబడేలా కూటమి మ్యానిఫెస్టో
• అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గంజాయి మాఫియాపై ఉక్కుపాదం
• అన్నం పెట్టే అన్నదాతలు అప్పుల పాలవుతుంటే … గంజాయి అమ్ముకునే వైసీపీ నేతలు కోట్లు గడించారు
• కులాన్ని వాడుకొని తోట త్రిమూర్తులు వ్యక్తిగతంగా ఎదిగారు
• కాపు కళ్యాణ మండపం కడతానని తక్కువ ధరకు దేవాలయం భూమి తీసుకొని 20 ఏళ్లు అయినా కట్టలేదు
• రాజకీయ అవసరాల కోసమే తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ కలిశారు
• పేదల కడుపుకొట్టి ద్వారంపూడి కుటుంబం వేల కోట్లు దోచుకుంది
• మండపేట వారాహి విజయభేరి యాత్ర బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యాణ్

అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ‘జనసేన-తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టో’ ప్రజల ముందుకు తీసుకొచ్చాం. అణగారిన వర్గాలకు ఆర్థికంగా అండగా నిలుస్తూనే.. రాష్ట్ర భవిష్యత్తుకు మేలు చేసేలా, యువతకు ఉపాధి కల్పించేలా మ్యానిఫెస్టోను రూపొందించామని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు మెగా డీఎస్సీ ప్రకటిస్తామని, వంద రోజుల్లో గంజాయిని ఉక్కు పాదంతో తొక్కేస్తామని, కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా 

నిర్వహిస్తుందని హామీ ఇచ్చారు. నిర్వీర్యమైన ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేసి, శాంతి భద్రతలను గాడిలోపెడతామని చెప్పారు. వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొట్టి, ప్రజలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలన్నదే కూటమి లక్ష్యమని అన్నారు. బుధవారం మండపేటలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. “అన్నం పెట్టే రైతు లేకపోయినా.. ఒళ్ళు వంచి కష్టపడి పని చేసే శ్రామికుడు లేకపోయినా మనం లేము. మే డే సందర్భంగా వారందరికీ నా తరఫున శుభాకాంక్షలు. మీరు పడుతున్న కష్టాలు, బాధలే నన్ను రెండుసార్లు మండపేటకు రప్పించాయి. వరుస తుపాన్ల వల్ల పంట నష్టపోయి వేలాది మంది రైతులు కన్నీరు పెట్టుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 50 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ 50 మంది కౌలు రైతు కుటుంబాలను జనసేన పార్టీ తరఫున ఆర్థికంగా ఆదుకున్నాం. కూటమి ప్రభుత్వంలో కార్మికులు, కర్షకులను గుండెల్లో పెట్టుకుంటాం.
• రాజకీయ అవసరాల కోసం కలిశారు
కులాలను వాడుకొని జగన్ ఎదుగుతున్నాడు. తన స్వార్థం కోసం మనలో మనకి చిచ్చు పెడుతున్నాడు. కోనసీమ అల్లర్లలో అమాయకులైన యువత కేసులు ఎదుర్కొంటోంది. ఆ అల్లర్లకు మూలకారకుడైన వ్యక్తి ఇప్పుడు మంత్రి విశ్వరూప్ వెనకాల తిరుగుతున్నాడు. మనం కులాలను దాటి ఆలోచించకపోతే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఈ ప్రాంతంలో తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ కు పడదు. కానీ రాజకీయ అవసరాల కోసం వారిద్దరు కలిసిపోయారు. వారి కలయిక యానం-రావులపాలెం ఏటిగట్టు రోడ్డును పటిష్టం చేయలేకపోయింది. ప్రజా సమస్యలను తీర్చలేకపోయింది. తోట త్రిమూర్తులు మండపేట నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఓటు అడగడానికి వస్తే ఒకటే ప్రశ్నించండి. కాపు కళ్యాణ మండపం కడతామని ద్రాక్షారామం దేవస్థానం నుంచి వేలం పాట లేకుండా భూమిని తక్కువ ధరకు తీసుకున్నారు. రెండు దశాబ్దాలు అయినా కళ్యాణ మండపం ఎందుకు కట్టలేదని నిలదీయండి. వాళ్లు వ్యక్తిగతంగా ఎదగడానికి కులాన్ని ఎలా వాడుకుంటారో ఇదొక ఉదాహరణ మాత్రమే. పాత తరం వాళ్లలా ఇప్పుడు ఉన్న తరం కూడా వాళ్లు చెప్పిన కల్లబొల్లి మాటలకు మోసపోతే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది.
• వేల కోట్లు దోచుకున్న కుటుంబం అది
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. పోలీస్, రెవెన్యూ, జల వనరుల శాఖ ఇలా అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా వ్యవస్థలను బలోపేతం చేస్తాం. ఒక్క ద్వారంపూడి ఇంట్లోనే మూడు పదవులు ఉన్నాయి. జగన్ ఆధ్వర్యంలో వీళ్లంతా అన్ని వర్గాల పొట్ట కొట్టి వందల కోట్లు దోచుకున్నారు. మండపేట పబ్లిక్ పాఠశాలలో సమస్య వస్తే తోట త్రిమూర్తులు అనుచరులు 100 మంది వచ్చి పాఠశాల మూసేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే పాఠశాల మూసే సాహసం చేసేవారా..? వైసీపీ నాయకుల రౌడీయిజానికి చరమాంకం పాడాలి అంటే కూటమిని అఖండ మెజార్టీతో గెలిపించాలి. ఈ రోజు రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. అన్నం పెట్టే అన్నదాత అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే… గంజాయి అమ్ముకునే వైసీపీ నాయకులు కోట్లకు పడగలెత్తారు. ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు కానీ… గంజాయికి ఒకటికి పదింతలు రేట్లు పెంచి అమ్ముతున్నారు. సినిమా టికెట్లు అమ్ముడానికి అన్ని వ్యవస్థలను ఉపయోగించిన ప్రభుత్వం… రైతుల కష్టాలు తీర్చడానికి ఏ వ్యవస్థను వినియోగించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా రైతులకు మద్దతు ధర ప్రకటించలేదు. వ్యవసాయ సాగులో ఉన్న అన్ని రాయితీలను తీసేసింది. ఎందుకు తీసేశారు అని అడిగితే రైతులను బూతులు తిడుతున్నారు. ఒక్క నివర్ తుపాన్ వల్ల 17 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 2020లో వచ్చిన మరో తుపాన్ వల్ల దాదాపు 37 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఎకరానికి రూ. 25 వేలు చొప్పున నష్టం అని అనుకున్నా … దాదాపు రూ.9,250 కోట్లు రైతులు నష్టపోయారు. అప్పుల బాధతో రైతు కుటుంబాలు చితికిపోయాయి. ఒకవైపు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరుగుతుంటే… అన్నపూర్ణ లాంటి మన గోదావరి జిల్లాల్లో వరి సాగు క్రమ క్రమంగా తగ్గుతోంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంట సాగు తగ్గింది. మద్దతు ధర లేక, కాలువల్లో పూడికలు తీయక ఇలా రకరకాల కారణాలతో కోనసీమ రైతాంగం క్రాప్ హాలీడే ప్రకటించింది. రైతు కన్నీరు పెట్టని రాజ్యం రావాలంటే వైసీపీకి పొలిటికల్ హాలీడే ప్రకటించడం ఒకటే మార్గం. ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కకుండా ఘోరంగా ఓడించాలి.
• ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై అసెంబ్లీలో చర్చ చేశారా?
జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక దుర్మార్గపు చట్టం. దానిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే కంటే … జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని పిలవాలి. జగన్ కుటుంబంలో వాళ్ల తాతల దగ్గర నుంచి పక్క వాళ్ల ఆస్తిని సొంత ఆస్తిలా భావించి లాక్కుంటారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను బీజేపీ తీసుకొచ్చింది అని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. యాక్ట్ ను పరిశీలించాలని కేంద్రం ముసాయిదాలను మాత్రమే పంపిస్తుంది. రాష్ట్రం దానిపై అసెంబ్లీలో చర్చ పెట్టి చట్టం మంచిదా..? కాదా..? అనేది నిర్ధారించాలి. అసెంబ్లీలో చంద్రబాబు గారి సతీమణిని తిట్టడం తప్ప ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఎప్పుడైనా వైసీపీ చర్చ పెట్టిందా..? భారతదేశపు పాస్ పోర్ట్ మీద ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మ ఉండదు. మన రాజముద్ర ఉంటుంది. అలాగే మన పట్టదారు పాస్ పుస్తకాలపై మన రాష్ట్ర రాజముద్ర ఉండాలి కానీ… జగన్ బొమ్మ ఎందుకు..? కూటమి ప్రభుత్వం రాగానే మన పాస్ పుస్తకాలపై రాష్ట్ర రాజముద్రను వేయిస్తాం.
• అన్యాయాన్ని ఎదిరించడం జనసేన లక్షణం
ఇద్దరు వ్యక్తుల కలయిక రాష్ట్రానికి ఎంత బలం చేకూర్చిందో మీకు తెలుసు. చంద్రబాబు గారితో నాకు రాజకీయంగా, పాలసీల పరంగా విభేదాలు ఉండొచ్చు. కష్టాల్లో సాటి మనిషి ఉన్నప్పుడు అండగా నిలబడటం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, అన్యాయాన్ని ఎదిరించడం జనసేన పార్టీ లక్షణం. ఆ లక్షణంతోనే చంద్రబాబు గారికి, తెలుగుదేశం క్యాడర్ కు అండగా నిలబడ్డాం. కూటమి ప్రజా మ్యానిఫెస్టో తీసుకొచ్చింది. ప్రతి వర్గానికి అండగా నిలబడేలా మ్యానిఫెస్టోని రూపొందించాం. అందులో కొన్ని ముఖ్య హామీలు తీసుకుంటే … 50 ఏళ్లు దాటిన ప్రతి బీసీకి ఒకటో తేదీనే ఇంటి దగ్గర రూ. 4 వేలు ఫించన్ అందిస్తాం. స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 చొప్పున ఎంతమంది స్కూలుకు వెళితే అంతమందికి అందిస్తాం. ప్రతి రైతుకు ఏటా రూ. 20,000 ఆర్థిక సాయం చేస్తాం. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకి నెలకు రూ. 1500 ఇస్తాం. ఆటో డ్రైవర్ల జీవనభృతికి ఇబ్బంది లేకుండా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తాం. మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఏర్పాటు చేస్తాం. ఈద్గాలు, ఖబరస్థాన్ లకు స్థలాలు కేటాయిస్తాం. విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మిస్తాం. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మారుస్తాం. రాయలసీమను ఆటోమొబైల్ హబ్ గా మారుస్తాం. పంచాయితీ రాజ్ డిక్లరేషన్ తీసుకువచ్చి స్థానిక సంస్థలకు పూర్తి అధికారాలు ఇస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. నిరుద్యోగులకు రూ. 3 వేల భృతి అందిస్తాం. కూటమి తరఫున అమలాపురం ఎంపీ అభ్యర్థిగా శ్రీ గంటి హరీష్ మాధుర్ పోటీ చేస్తున్నారు. మండపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ వేగుళ్ళ జోగేశ్వరరావు, అనపర్తి నియోజకవర్గం నుంచి శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రామచంద్రపురం నియోజకవర్గం నుంచి శ్రీ వాసంశెట్టి సుభాష్, కొత్తపేట నుంచి శ్రీ బండారు సత్యానందరావు పోటీ చేస్తున్నారు. వారిని భారీ మెజార్టీతో గెలిపించాల”ని విజ్ఞప్తి చేశారు. ఈ సభలో జనసేన మండపేట ఇంచార్జ్ శ్రీ వేగుళ్ళ లీలాకృష్ణ, కొత్తపేట ఇంచార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్, రామచంద్రపురం ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్, బీజేపీ నాయకుడు శ్రీ సాయిరాం పాల్గొన్నారు.