చేపల మార్కెట్ సమస్యలను పట్టించుకోరా?.. ప్రశ్నించిన జనసేన

  • రహదారి, నీరు, కరెంట్, షేడ్స్ తదితర సదుపాయాలు కల్పించాలి
  • ఒక్కసారి రూ.10లు ఆశీలు పెంచటం సరికాదు
  • సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతాం

పార్వతీపురం: మున్సిపల్ చేపలు, మాంసం మార్కెట్ బాధితులతో మాట్లాడిన జనసేన నాయకులు పార్వతీపురం మున్సిపల్ చేపలు, మాంసం మార్కెట్ సమస్యలు పట్టించుకోరా..? అని ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ నాయకులు గొర్లి చంటి, వంగల దాలినాయుడు, బాలు, సతీష్, హేమంత్, లంక సతీష్, శివ తదితరులు పార్వతీపురం మున్సిపల్ చేపలు, మాంసపు మార్కెట్ ను పరిశీలించి అక్కడ వ్యాపారులతో మార్కెట్ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా అక్కడి వ్యాపారులు పలు సమస్యలను జనసేన నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. మార్కెట్లో దాదాపు 60 కుటుంబాలు జీవిస్తున్నాయని, మార్కెట్ కు రాకపోకలు సాగించేందుకు రహదారి సదుపాయం లేదని, రేకు షెడ్ లు లేవని, ఉన్న రేకులు శిథిలావస్థకు చేరి రేకులు ఎగిరిపోయాయని, నీటి సదుపాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఇంతవరకు రోజువారి ఆశీస్సులు 15 రూపాయలు ఉండగా, ఇప్పుడు 25 రూపాయలకు పెంచారన్నారు. రూ.10లు ఒకసారిగా పెంచడం తమకు ఇబ్బందిగా ఉందన్నారు. మార్కెట్లో సదుపాయాల లేకపోవడంతో దాదాపు వ్యాపారాలు జరగటం లేదన్నారు. ఈ విషయమై పలుమార్లు సంబంధిత అధికారుల వద్ద మొరపెట్టుకున్న చర్యలు శూన్యం అన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయానికి పక్కనే ఉన్న చేపలు మార్కెట్ ను పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. మున్సిపాలిటీ పాలన మార్కెట్ ను చూస్తే స్పష్టం అవుతుందన్నారు. తక్షణమే అధికారులు స్పందించి మున్సిపల్ మార్కెట్లో సమస్యలు పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.