ఉద్యోగుల కష్టాలు రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు: ఆళ్ళ హరి

జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఉద్యోగుల జీతాల చెల్లింపుల విషయంపై స్పందించి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపించిన ముఖ్యమంత్రి వై యస్ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారు.

గతంలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చకపోగా ఉద్యోగులకు అందాల్సిన లబ్ధిని సైతం సక్రమంగా అంధించటంలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలం చెందారు.

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి.. ప్రజలకు సంక్షేమ పధకాలను అందించటంలో కానీ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో కానీ కీలకపాత్ర వహించే ఉద్యోగుల జీవితాలు ఈ వైసీపీ ప్రభుత్వంలో కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నాయి.

దేశంలో ఏ రాష్ట్రంలో అయినా నెల మొదటి తేదీనే ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు పడతాయి కానీ మన ఆంద్రప్రదేశ్ లో మాత్రం నెలలో ఎప్పుడు పడతాయో తెలియని దుస్థితి నెలకొంది. పదవ తారీఖు వస్తున్నా రాష్ట్రంలో ఇంకా 40 % మంది ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు అంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

సమయానికి జీతాలు పడక సామాన్య ఉద్యోగుల జీవన పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

ఇక పెన్షన్ ల మీదే ఆధారపడి జీవించే పెన్షనర్లకు పెన్షన్లు సైతం అంధించటంలో ప్రభుత్వం పూర్తిగా అలసత్వం ప్రదర్శించటంతో వాళ్ళ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పెన్షన్లు సైతం నెల చివరి వరకు ఇవ్వక పోవడంతో వారు తీవ్ర ఇక్కట్లను ఎదురుకుంటున్నారు. మందులకు, ఇంటి అద్దెలకు, ఇతర ఖర్చులకు పెన్షన్ మీదే ఆధారపడి జీవించే పెన్షన్ దారులు నరకయాతన పడుతున్నారు.

ఇక ఉద్యోగులు భవిష్యత్ అవసరాల దృష్ట్యా దాచిపెట్టుకున్న డబ్బులను సైతం ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకోవడం దారుణం.

ఉద్యోగులు మా జీతాలు మాకు ఇవ్వండి అంటూ రోడ్డెక్కి అడుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వంలో ఉద్యోగుల కష్టాలకు అంతే లేకుండా పోతుంది.

ప్రభుత్వం ఉద్యోగులను సక్రమంగా చేసుకుంటేనే వారు ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందిస్తారు.. అలాంటిది ప్రభుత్వ తీరుతో ఉద్యోగుల జీవితాలే త్రిశంకు స్వర్గంగా మారితే వాళ్ళు ప్రజలకు ఎలా సేవలందిస్తారు?

ఇప్పటికే తమ అవగాహనా రాహిత్య, అరాచక , అసమర్ధ, అనాలోచిత నిర్ణయాలతో ఎన్నో వ్యవస్థలు ఈ రోజున నిర్వీర్యం అయిపోయాయి.

ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగస్తులకు జీతాలను సక్రమంగా చెల్లిస్తూ … వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్లను అందించటంతో పాటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. లేనిపక్షంలో ఉద్యోగ సంఘాలు చేపట్టే ఎలాంటి కార్యాచరణకు అయినా జనసేన పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆళ్ళ హరి తెలిపారు.