భారత పర్యటనకు రానున్నఇంగ్లండ్ జట్టు..
ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. జనవరి 27న భారత్ పర్యటనకు రానున్న ఇంగ్లాండ్ జట్టు.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనుంది. ఫలితంగా చెన్నై వేదికగా ఫిబ్రవరి 5న ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందు.. ప్రత్యర్థి జట్టుకు మూడు రోజులు మాత్రమే శిక్షణ సమయం ఉంటుంది. క్వారంటైన్ కోసం చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో బయోబబుల్ను ఏర్పాటు చేసింది బీసీసీఐ.
ప్రస్తుతం ఇంగ్లాండ్-శ్రీలంక మధ్య సిరీస్ 26న ముగుస్తుంది. అయితే ఈ సిరీస్లో భాగం అవ్వని ఇంగ్లాండ్ క్రికెటర్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రోరీ బర్న్స్ ఇప్పటికే ఆదివారం రాత్రి భారత్కు చేరుకుని క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఫలితంగా.. వీరికి ఆరు రోజుల క్వారంటైన్ను ముగియగానే ప్రాక్టీస్ చేయడానికి ఐదురోజుల సమయం దొరుకుతుంది.
భారత్ ఆటగాళ్లు కూడా ఇంగ్లాండ్ జట్టుకు కేటాయించిన హోటల్లోనే 27వ తేదీన క్వారంటైన్లోకి వెళ్లిపోతారు. ఇరు జట్లకు ఈ ఆరు రోజుల క్వారంటైన్ సమయంలో మూడు సార్లు వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో నెగటివ్గా తేలితేనే ఆటగాళ్లు మ్యాచులో పాల్గొంటారు.
లాక్డౌన్ తర్వాత భారత గడ్డపై జరగనున్న తొలి క్రికెట్ నేపథ్యంలో అనేక జాగ్రత్తల నడుమ సమరానికి రంగం సిద్ధం చేసింది బీసీసీఐ. సిరీస్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తోంది.