మహారాష్ట్రలో జూన్ 1 వరకు ఆంక్షలు పొడిగింపు

మహారాష్ట్రలో కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న ఆంక్షలు మరికొన్ని వారాల పాటు కొనసాగనున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ తరహా కఠిన ఆంక్షలు వచ్చే నెల 1 వరకు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో జూన్ 1వ తేదీ ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్ తరహా కఠిన ఆంక్షలు కొనసాగుతాయని ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే రాష్ట్రంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుందని వెల్లడించింది.

దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో గత నెల 5న లాక్‌డౌన్ తరహా ఆంక్షలు విధించారు. 22 రోజులపాటు ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించింది. అవి ఏప్రిల్ 28న ముగియడంతో దానిని మే 15 వరకు పొడిగించింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో.. నిన్న సమావేశమైన మంత్రిమండలి తాజాగా ఆంక్షలను మరోమారు పొడిగించింది.