వ్యవసాయానికి సాయం చేసే రైతును బతికించాలి: వంగల దాలి నాయుడు

  • విత్తు మొదలుకొని విత్తనం వరకు ప్రభుత్వాలు రైతుకు అండగా నిలవాలి
  • అప్పులు ఆకలి బాధలు లేకుండా రైతులను ఆదుకోవాలి
  • ప్రతి ఎకరాకు సాగు నీరందేలా ప్రాజెక్టులు నిర్మించాలి
  • రైతు సంఘాల సమన్వయ కమిటీ సమావేశంలో జనసేన పార్టీ నాయకుడు వంగల దాలి నాయుడు డిమాండ్

పార్వతీపురం: భారతదేశ ప్రజలందరికీ తిండి పెట్టే వ్యవసాయానికి సాయం చేసి రైతును బతికించాలని జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం పార్వతీపురం పట్టణంలోని నవిరి కాలనీలో జరిగిన రైతు సంఘాల సమన్వయ కమిటీ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గా ప్రసాద్, కర్రి మణి, అంబటి బలరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతూ వ్యవసాయం గిట్టుబాటు లేదంటూ సాగు విడిచిపెట్టి పట్టణాలకు వలస వెళ్లి కూలి పనులు, అపార్ట్మెంట్ లలో వాచ్ మెన్ పనులు చేసుకుంటున్నారన్నారు. అలా వేలాదిమంది, లక్షలాది మంది రైతులు వ్యవసాయాన్ని విడిచి పెట్టడం వలన రాబోయే రోజుల్లో తిండి దొరకని పరిస్థితి నెలకొంటుందన్నారు. కాబట్టి ప్రభుత్వాలు రైతులకు సాగు విషయంలో విత్తనాలు వేసినప్పటినుండి ఎరువులు, పురుగుమందులు, ఉబాలు, యంత్ర సామగ్రి, పంట కోతలు, అమ్మకాలు తిరిగి విత్తనం వరకు అడుగడుగునా రైతుకు అండగా నిలవాలన్నారు. సబ్సిడీకి లేదా కుదిరితే ఉచితంగా విత్తనాలు, ఎరువులు, యంత్ర సామాగ్రి తదితరివి అందజేసి వ్యవసాయానికి సాయం చేసి రైతుకు అండగా నిలవాలన్నారు. వ్యవసాయం చేయటం వలన నష్టాలు వచ్చి అప్పులు, ఆకలి బాధలతో మిగులుతున్న రైతులను ఆదుకోవాలన్నారు. వ్యవసాయంలో రైతుకు ముదుపులు పోను లాభాలు వచ్చేలా ప్రణాళికలు రచించాలన్నారు. ఒకవేళ నష్టం వచ్చే దాన్ని పూడ్చాలని లేదా ఆయా కుటుంబాలకు పనులు లేని కాలంలో ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికంగా నదులు, గెడ్డలు, వాగులు, వంకలు తదితర నీటి వనరులు ఉన్నప్పటికీ వాటిపై ప్రాజెక్టులు, ఆనకట్టలు, చెక్ డ్యాములు నిర్మించకపోవడంతో నీరంతా వృధాగా సముద్రంలో కలిసిపోతోందన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిచిపెట్టి, నిల్వచేసి ప్రతి ఎకరాకి సాగు నీరు అందేలా ప్రాజెక్టులు, ఆనకట్టలు నిర్మించాలన్నారు. అలాగే కోల్డ్ స్టోరేజ్ లు నిర్మించి రైతు పంటలు నిల్వ చేసుకునేలా సాయపడాలన్నారు. ఏ రోజైతే రైతు తను పండించిన పంటకు తానే ధర నిర్ణయిస్తాడో ఆ రోజే రైతు రాజ్యం ఉన్నట్లు లెక్కని అన్నారు. ఈ విషయమై పాలకులు, అధికారులు చర్యలు చేపట్టి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి సాయం చేసి రైతును బతికించాలని డిమాండ్ చేశారు.