శిలాఫలకంతో ప్రజల చెవిలో పువ్వులు!

  • సమర్థత లేని చైర్పర్సన్ పాలనలో మున్సిపాలిటీలో సమస్యలు మోత
  • వరద ముంపు సమయంలో కానరాని మున్సిపల్ చైర్ పర్సన్
  • పుష్కలంగా తాగునీరు ఇవ్వలేని దుస్థితిలో మున్సిపల్ యంత్రాంగం
  • తాగునీటి శిలాఫలకానికి ఏడాదికావస్తున్నా కానరాని పనులు
  • నాలుగైదు రోజులకొకసారి కొళాయిలు.. అది బురద కూడా నీరు సరఫరా
  • రూ 63.63 కోట్లు ఏ ఐ ఐ బి నిధులు, పనులు ఎక్కడ?
  • మున్సిపల్ కార్యాలయం ముందు శిలాఫలకం వద్ద చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపిన జనసేన నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతీపురం మున్సిపాలిటీలో సమగ్ర తాగునీటి సరఫరా అభివృద్ధి పథకం అంటూ ఏడాది క్రితం మున్సిపల్ కార్యాలయం ముందు శిలాఫలకం వేసి పట్టణ ప్రజల చెవిలో పువ్వులు పెట్టారని జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. శనివారం జనసేన నాయకులు వంగల దాలి నాయుడు, అన్నా బత్తుల దుర్గాప్రసాద్, తామరకండి తేజ, కర్రి మణికంఠ, పైల రాజు తదితరులు మున్సిపల్ కార్యాలయం ముందున్న శిలాఫలకం వద్ద చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమర్థతలేని మున్సిపల్ చైర్ పర్సన్ పాలనలో పార్వతీపురం మున్సిపాలిటీలో సమస్యలు మూలుగుతున్నాయన్నారు. ఇటీవల వరద నీటికి పట్టణంలో జనశక్తి కాలనీ, నెల్లిచెరువుగట్టు, సౌందర్య సినిమా హాలు ప్రాంతం, బైపాస్ కాలనీ తదితరవి ముంపుకు గురయ్యాయన్నారు. అక్కడ బాధితులను పరామర్శించేందుకు గాని వారి బాధలను తెలుసుకునేందుకు గాని మున్సిపల్ చైర్ పర్సన్ ప్రయత్నించకపోవడం ప్రజల దౌర్భాగ్యం అన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీ ప్రజలకు నాలుగైదు రోజులకు ఒకసారి కొళాయినీరు ఇస్తున్నారని, అది బురద నీరు ఇస్తున్నారన్నారు. ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజలను ఏమార్చేందుకు 2022 సెప్టెంబర్, 14న మున్సిపల్ కార్యాలయం ముందు పార్వతీపురం పురపాలక సంఘం నందు సమగ్ర తాగునీటి సరఫరా అభివృద్ధి పథకం పేరుతో ఏఐఐబి ఆర్థిక సహాయంతో రూ. 63.63 కోట్ల అంచనాలతో పుష్కలంగా తాగునీరు అందిస్తామంటూ శంకుస్థాపన చేసి శిలాఫలకం ఏర్పాటు చేశారన్నారు. ఇది ముఖ్యమంత్రి జలధార పేరుతో సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర చేతుల మీదుగా జరిగిందన్నారు. శిలాఫలకం వేసాక పండావీధి ప్రాంతంలో మొక్కిబడిగా పనులు చేపట్టి తర్వాత పత్తా లేకుండా చేశారన్నారు. శిలాఫలకం వేసి ఏడాదికావస్తున్నా నిధులు, పనులు ఊసే లేదన్నారు. సంబంధిత పాలకులు, అధికారులు తాగునీటి విషయమై ఎవరు ప్రశ్నించినా ఆ శిలాఫలకం గూర్చే చెబుతూ ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి సంబంధించి ఇటువంటి దుస్థితి లేదన్నారు. ప్రజలకు అవసరమైన తాగునీటిని బురద లేకుండా ప్రతి రోజూ కుళాయిల్లో ఇచ్చే పరిస్థితి లేదన్నారు. సమర్ధతలేని చైర్పర్సన్ పాలనలో తాగునీరు, పారిశుధ్యం, మురుగు కాలువలు, ఆవులు, పందులు, కుక్కలు, చెత్త డంపింగ్ యార్డ్, చేపల మార్కెట్ తదితర పలు సమస్యలు పట్టణ ప్రజలను వేధిస్తున్నాయన్నారు. మున్సిపల్ కార్యాలయం ముందు శిలాఫలకం దిష్టిబొమ్మలా ఎక్కిరిస్తోందన్నారు. తక్షణమే పాలకులు, అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి పట్టణ ప్రజలకు పుష్కలంగా తాగునీరు అందించే పథకాన్ని అమలు చేయాలని కోరారు. దీని విషయమై ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా వారు మున్సిపల్ ప్రజలకు పుష్కలంగా, నిరంతరంగా తాగు ఇవ్వాలని నినాదాలు చేశారు.