రాష్ట్ర రాజకీయాల దశదిశ మార్చే సభగా ఆవిర్భావ సభ

• రాజకీయాల్లో నీతి, నిజాయతీ అవసరమనే సభా ప్రాంగణానికి సంజీవయ్య పేరు పెట్టాం
• సీఎంకు లేని కోవిడ్ నిబంధనలు సామాన్యుడికి ఎందుకు?
• రాజకీయ నినాదాలు, ప్రసంగాలు లేకుండా సభ సాధ్యమా?
• ఎన్ని అడ్డంకులు ఎదురైనా జనసైనికులు సభకు తరలిరండి
• ఈ సభ సీఎం అహంకారానికి.. సామాన్యుడి ఆత్మగౌరవానికి మధ్య పోరాటం
• ఇప్పటం మీడియా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన పార్టీ ఏ విధంగా పయనించబోతోంది.. రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్లబోతోంది అనే అంశాలను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శ్రేణులకు పూర్తిస్థాయిలో దిశా నిర్దేశం చేస్తారని, దీనిని ప్రతి ఒక్క జన సైనికుడు వారి పరిధిలోని గ్రామాల్లో, ప్రాంతాల్లో వివరించే ప్రయత్నం చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్న తరుణంలో ఆదివారం సాయంత్రం ఇప్పటం గ్రామంలోని సభాస్థలిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “జన సైనికులని సభకు రానియ్యకుండా అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ రోజు ఉదయం కూడా కనకదుర్గ వారధిపై జెండాలు కట్టకుండా అడ్డంకులు సృష్టించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జన సైనికులు ఐక్యంగా ముందుకు కదిలి సభాస్థలికి చేరుకోవాలి. జనసేన ఆవిర్భావ సభను నిర్వీర్యం చేయడానికి చాలా శక్తుల పని చేస్తాయి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని దాటుకొని సభను విజయవంతం చేయాలి. దీని కోసం ప్రతి ఒక్క జన సైనికుడు సంసిద్ధం కావాలి.
* జిల్లాలవారీగా పంపిన రూట్ మ్యాప్ ను అనుసరించండి
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సభకు తరలివచ్చే జనసైనికులు, వీరమహిళల కోసం సభా ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే అన్ని జిల్లాలకు ప్రత్యేక రూట్ మ్యాప్ లను సిద్ధం చేసి పంపించాం. దాన్ని అనుసరించి సభా స్థలికి చేరుకోవాలి. ఏ ప్రాంతం నుంచి వచ్చే వారికి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించాం. పార్కింగ్ ప్రాంతాల నుంచి సభాస్థలికి ఎలా చేరుకోవాలో కూడా నిర్దేశించాం. దానిని కచ్చితంగా అందరూ పాటించాలి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే జనసైనికులకు ఎటువంటి అసౌర్యం కలగకుండా చూసుకునేందుకు 12 కమిటీలకు సంబంధించిన వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. వారి సేవలను సమయానుగుణంగా వినియోగించుకోవాలి. మంచి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లు తగినన్ని సిద్ధంగా ఉన్నాయని, ఇప్పటం గ్రామస్థులు దీనికి అందిస్తున్న సహకారం ఎనలేనిది. ఎవరు ఎంతలా జనసైనికుల్ని రెచ్చగొట్టాలని చూసినా, వారిని పట్టించుకోవద్దు. ఎంత జాగ్రత్తగా సభకు వచ్చారో… అంతే జాగ్రత్తగా తిరిగి వెళ్లాలి. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిబద్ధత ఎంతో అవసరం. అలాంటి అద్భుతమైన రాజకీయాలు చేసి, ముఖ్యమంత్రిగా ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్న శ్రీ దామోదరం సంజీవయ్య ఎన్నో తరాలకు ఆదర్శం. ఆయనను జనసేన పార్టీ వినమ్రంగా గౌరవించుకుంటుంది. ఆయన పేరును సభాస్థలికి అందుకే పెట్టాం. నీతితో నిజాయతీతో ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన శ్రీ దామోదరం సంజీవయ్య ఎప్పటికీ ఒక సజీవ స్ఫూర్తి. ఆయన స్ఫూర్తిని ప్రజల్లోకి జనసేన పార్టీ తీసుకెళ్తుంది.
* సామాన్యుడి ఆత్మగౌరవ సభ ఇది
ముఖ్యమంత్రి అహంకారానికి సామాన్యుడి ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటమే ఈ సభ. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క సామాన్యుడు కదిలి రావాలి. అనేక నిబంధనలతో పోలీసులు ఈ సభకు అనుమతించారు. కోవిడ్ లేకపోయినా కోవిడ్ పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు. మాస్క్ లేకపోతే రూ.100 ఫైన్ వసూలు చేస్తామంటున్నారు. ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభ సాక్షిగా మాస్క్ లు ధరించరు. సామాన్యుడికి మాత్రం ఫైన్ వేస్తామని బెదిరిస్తున్నారు. రాజకీయ నినాదాలు, ఇతర పార్టీలను రెచ్చగొట్టే ప్రసంగాలు లేకుండా సభ నిర్వహించుకోవాలని చెబుతున్నారు. రాజకీయ నినాదాలు, ప్రసంగాలు లేకుండా సభ నిర్వహించడం సాధ్యమా? రెచ్చగొట్టే ప్రసంగాలు ఎప్పటికీ జనసేన పార్టీ చేయదు. అయితే ఈ రెండున్నరేళ్లలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మాత్రం మాట్లాడుతుంది. దీనికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉండండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దశ దిశను మార్చే సభగా ఆవిర్భావ సభ చిరస్థాయిగా నిలిచిపోతుందని” అన్నారు.
*కంటిమీద కునుకు లేకుండా కష్టపడ్డారు: పీఏసీ సభ్యులు నాగబాబు
పీఏసీ సభ్యులు నాగబాబు మాట్లాడుతూ.. ఆవిర్భావ సభ కోసం పార్టీ నాయకులు గత 10 రోజులుగా కంటిమీద కునుకు లేకుండా కష్టపడుతున్నారన్నారు. సభ నిర్వహణపై రెండు నెలల ముందు నుంచే మనోహర్ కు మంచి ప్లాన్ ఉంది.. రేపు జరగబోవు సభకు జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్, కార్యక్రమాల నిర్వహణ విభాగం ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ నాయకులు మేడా గురుదత్ ప్రసాద్, శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్, మరెడ్డి శ్రీనివాస్, వంపూరు గంగులయ్య తదితరులు పాల్గొన్నారు.