రాష్ట్రం నుంచి వైసీపీని నిషేధిస్తేనే మంచిరోజులు: గాదె

జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు

అధికారంలోకి రాగానే మద్యనిషేదం చేస్తానని.. అధికారంలోకి వచ్చాక దశలవారీ నిషేధమని మాటమార్చి.. ఇప్పుడు మద్యంతోనే సంక్షేమ పథకాలకు నిధులు వస్తున్నాయని.. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు రాష్ట్రం నుంచి నిషేదించినప్పుడే రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయని.. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యనిషేదం అంటే ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తుందన్న విషయాన్ని ప్రజలు ఇన్నాళ్టికి గ్రహించారన్నారు. ఏ చిన్న వ్యాపారినికైనా డిజిటల్ చెల్లింపులు ఉంటే నగదుతో మాత్రమే జరిగే అతిపెద్ద వ్యాపారం మద్యం వ్యాపారమేనన్నారు. వీటికి తోడు ప్రభుత్వ పెద్దలు కొందరు ఈ మద్యాన్ని సొంతంగా తయారుచేస్తున్నారని.. అందులో ప్రేగులకు హాని చేసే విషం ఉంటుందని విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్లే రేపల్లెలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారని విమర్శించారు. మరోవైపు మేనమామలా ఉంటానంటూనే ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనం చేస్తూ పిల్లలకు విద్యను దూరం చేయటం దుర్మార్గం అన్నారు. జగన్ మేనమామ కాదని పిల్లల పాలిట కంసమామ అని దుయ్యబట్టారు. మహిళా కో ఆర్డినేటర్ పార్వతి నాయుడు, జిల్లా ఉపాడక్ష్యులు బిట్రగుంట మల్లిక మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని, జగన్ రెడ్డిని అన్నలా భావించి గెలిపించిన చెల్లెమ్మెల, అక్కల తాళిబొట్లు తెంచి, పసుపు కుంకుకుమలను చెరిపేసే పనిలో ఉన్నాడని ధ్వజమెత్తారు. వైకాపా అధికారంలోకి వచ్చాక 5 వేల మంది కల్తీ మద్యం తాగి మరణించారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా అర్ధం చేసుకోవచ్చన్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున తమ సమస్యలు చెప్పుకోవటానికి బారులు తీరారని, రాష్ట్రాన్ని తమ అసమర్ధ పాలనతో సమస్యల సుడిగుండంగా మార్చారని తూర్పారబట్టారు. పేద పిల్లల చదువుల కోసం దాతలిచ్చిన విద్యాసంస్థల స్థలాలను కూడా వదలని పరమ రాక్షసుడిలా జగన్ రెడ్డి తయ్యారయ్యాడని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు, అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, నగర కార్యదర్శి తన్నీరు నాగరాజు, శిఖా బాలు, సతీష్, పటేళ్ల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.