మంచి నీటిని అధిక ఉష్ణోగ్రతలో కాచి చల్లార్చి తాగాలి: ఆళ్ళ హరి

  • ప్రజలకు విజ్ఞప్తి చేసిన జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: ఇటీవల కురిసిన వర్షాలతో వచ్చిన వరదల వల్ల నగరంలోని అనేక ప్రాంతాల్లో మంచినీరు బురదమయంగా సరఫరా అవుతుందని, ఈ నీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఎక్కువ ఉష్ణోగ్రతలో కాచి చల్లార్చి పల్చటి గుడ్డతో వడబోసి తాగాలని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ప్రజల్ని కోరారు. గత నాలుగైదు రోజులుగా బురదమయంగా సరఫరా అవుతున్న మంచినీటిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై సంబంధిత అధికారులను వివరణ కోరగా ఈ మధ్య విస్తారంగా కురిసిన వర్షాల వల్ల వచ్చిన వరద నీరు సరఫరా అవుతున్న మంచినీటిలో కలవడంతో నీరు అలా వస్తుందని తెలిపారన్నారు. అయితే ఈ నీటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని, క్లోరిన్ శాతం వంటి అన్ని పరీక్షలు చేయటంతో పాటూ పలు జాగ్రత్తలు తీసుకున్నాకే మంచినీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారన్నారు. ఇలా మరో ఐదారు రోజులు మంచినీరు సరఫరా అయ్యే అవకాశం ఉందని ఆ తరువాత ఎప్పటిలాగే మంచినీరు వస్తుందని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. అయితే సాధారణ సమయంలోనూ మంచినీటిని కాచి చల్లార్చిన నీటిని తాగాలని ప్రస్తుతం సరఫరా అవుతున్న మంచినీటిని కచ్చితంగా కాచి చల్లార్చి పలుచటి గుడ్డతో వడబోసిన నీటిని మాత్రమే తాగాలని నిపుణులు తెలియచేసారని చెప్పారు. అవకాశం ఉంటే స్నానం చేయటానికి కూడా వేడి నీటిని ఉపయోగించాలన్నారు. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు మంచినీటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆళ్ళ హరి కోరారు. అలాగే నగరంలో పలు ప్రాంతాల్లో ఏర్పడ్డ మంచినీటి పైపులను కూడా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని అధికారులను కోరారు. అదే విధంగా వీలున్నంతా త్వరగా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా నగరపాలక సంస్థ కమీషనర్ కీర్తి చేకూరి ప్రత్యేక దృష్టి చారించాలని ఆళ్ళ హరి విజ్ఞప్తి చేశారు.