రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది: వేగుళ్ళ లీలాకృష్ణ

*చనిపోయిన రైతు కుటుంబాలకు అండగా జనసేన..

మండపేట:- రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు నెలలు గడిచినా ధాన్యం సొమ్ములు రావటం లేదని మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో వారి స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థిక సాయాన్ని నేరుగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందించనున్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, జరుగుతున్న మరణాలపై ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళుతుందని తెలిపారు. చనిపోయిన రైతు కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఏడురోజులలోగా అందించాలని జీవో చెబుతున్నా ఇప్పటికీ అందించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. మండపేట నియోజకవర్గంలో 11 మంది కౌలు రైతులు మరణించగా అందులో ఒకరికి మాత్రమే ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందిందని మిగిలిన వారి కుటుంబానికి జీవో నెంబర్ 43 ప్రకారం రావలసిన ఆర్థిక సాయం ఇప్పటికీ అందలేదని దీంతో చనిపోని రైతు కుటుంబ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని లీలాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పార్టీ అని చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇప్పనపాడు సర్పంచ్ మరియు మండపేట మండల అధ్యక్షులు కుంచె ప్రసాద్, ఐరోతి శేఖర్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.