అర్హత ఉన్నా అందని ప్రభుత్వ పథకాలు – పట్టించుకోని ప్రభుత్వ అధికారులు

జగ్గంపేట, జనం కోసం జనసేన 728వ రోజులో భాగంగా జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఇంటింటికీ తిరుగుతున్న సమయంలో కనిపించిన హృదయ విదారక దృశ్యం. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో లక్కోజు ఆచారి అనే వ్యక్తి గత ఎనిమిది సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్నా కానీ ఇప్పటి వరకు ఆయనకు అంగవైకల్యం పింఛను రాకపోవడం దురదృష్టకరం. ఆచారి గత ఎనిమిది సంవత్సరాల నుండి కూడా మంచం మీది నుండి లేవలేని పరిస్థితిలో ఉండగా వారి కుమారుడు కార్పెంటర్ పని చేసుకుంటూ కనీసం సొంత ఇల్లు కూడా లేక అద్దె ఇంట్లో తన తండ్రి బాగోగులు చూసుకుంటూ అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వ అధికారులు ఈయన పరిస్థితిని చూసి కూడా పట్టించుకోకుండా వ్యవహరించడం చాలా దౌర్భాగ్యం. ఈయన పరిస్థితిని నేరుగా చూసి ఒక నెల రోజులలోగా ఈయనకు పింఛను వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచిన వెంటనే నియోజకవర్గవ్యాప్తంగా ఈ విధంగా దయనీయ పరిస్థితిలో ఉండి అర్హులైన వారిని గుర్తించి వారందరికీ తప్పకుండా అండగా నిలబడతామని సూర్యచంద్ర హామీ ఇచ్చారు.