ముత్తా శశిధర్ నాయకత్వంలో జగనన్న ఇళ్ళ మోసం

కాకినాడ సిటి, జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో జగనన్న ఇళ్ళ మోసం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా వై.సి.పి ప్రభుత్వం అట్టహాసంగా శంఖుస్థాపన చేసిన జగనన్న ఇళ్ళు అని పంపిణీ చేసిన కొమరిగిరి ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని చూసి విస్తుపోయారు. అసలు కాకినాడ నగర ప్రజలకు ఇళ్ళు ఇస్తామని ప్రగల్భాలు పలికి తీరా నగరానికి దూరంగా మరో గ్రామంలో ఇళ్ళ స్థలాలు కేటాయించడం చూస్తుంటే ఒకరకంగా ఈ వై.సి.పి ముఖ్యమంత్రి లబ్దిదారులకు నగర బహిష్కార శిక్ష విధించారా అని ప్రశ్నించారు. ఇదొక పెద్ద దగా అయితే, ఆ కేటాయించిన ప్రాంతాన్ని చూస్తే అసలు అక్కడ ప్రజలు జీవించగలరా అని భయబ్రాంతులయ్యేలా పరిస్థితులు ఉన్నాయన్నారు. మిచౌంగ్ తుఫాను ధాటికి మొత్తం ఈప్రాంతం అంతా మునిగిపోయిందనీ, రోడ్లు కొట్టుకుపోయాయా అనేలా రోడ్డెక్కడ ఉందో, గొతులెక్కడ ఉన్నాయో అర్ధం కాని విధంగా ఉందనీ ముంపుకు గురయ్యే ప్రాంతాన్ని ప్రజల నివాస గృహాలకు ఎంపికచేయడంలో ఏమేమి లాలూచీలు ఉన్నాయో దేవుడికే ఎరుక అన్నారు. ఇలాంటి పరిస్తితులలోకి ప్రజలను నెట్టి ప్రజల జీవితాలతో వై.సి.పి ప్రభుత్వం చెలగాటమాడటాన్ని జనసేన పార్టీ ఊరుకోదనీ, తెలుగుదేశం పార్టీతో కలిసి ఉమ్మడిగా ప్రజలను చైతన్యపరచి ప్రతిఘటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, మాజీ కౌన్సిలర్ నందిపాటి బాలగంగాధర్ తిలక్, నాయకులు మండపాక దుర్గాప్రసాద్, చీకట్ల శ్రీనివాస్, మిరియాల హైమవతి, ముత్యాల దుర్గాప్రసాద్, చిరంజీవి, ఉదయ్, రావిపాటి వెంకటేశ్వర రావు, పెద్దిరెడ్డి ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.