అంగన్వాడీలపై ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికం

నలభై రెండు రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రజాస్వామ్యయుతంగా లేదని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో విమర్శించారు. నామమాత్రపు వేతనాలతో సేవలందిస్తున్న మహిళలతో సామరస్యపూర్వకంగా చర్చలు చేయకుండా.. విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, పోలీసు చర్యలకు దిగటం పాలకుల ధోరణిని తెలియచేస్తోంది. ముఖ్యమంత్రికి కోటి సంతకాలతో కూడిన వినతి పత్రం ఇచ్చేందుకు ఛలో విజయవాడ కార్యక్రమం చేపడితే – అర్థరాత్రి వేళ పోలీసులు అంగన్వాడీ మహిళలను ఈడ్చి వేయడాన్ని ఖండిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బందిని అరెస్టులు చేయడం వారి కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో అంగన్వాడీ సిబ్బందిని అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి, పోలీసు వాహనాల్లోకి ఎక్కించడాన్ని ఖండిస్తున్నాం. ఇప్పటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేస్తూ పొరుగు రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయల జీతం ఎక్కువ ఇస్తాను అని ఇచ్చిన హామీని గుర్తు చేసి అమలు చేయమని అంగన్వాడీ సిబ్బంది కోరుతున్నారు. అలాగే సుప్రీం కోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ విధానాన్ని వర్తింప చేయమంటున్నారు. చిన్నపాటి జీతాలతో పని చేస్తున్న వారిపట్ల సానుకూల దృక్పథంతో ఆలోచన చేయాలని కోరుతున్నాం. అంగన్వాడీ మహిళలపై పాలక పక్షానికి సంబంధించిన సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రతి ఒక్కరూ గర్హించాలని జనసేనాని కోరారు.