జనసేన కేంద్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, ప్రశాసన్ నగర్లో గల జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికుల సమక్షంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ పతాకం తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్ ఎగురవేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నేడు అభివృద్ధిలో అగ్రరాజ్యాల సరసన నిలవడానికి కారణం మన ఉన్నతమైన రాజ్యాంగం. రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుంటూ, వారి స్పూర్తితో రాజ్యాంగ రక్షణకు కృషి చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో సమస్యలపై పోరాడుతామని తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగాలతోనే మనకు స్వాతంత్రం వచ్చిందని అన్నారు. ప్రస్తుత రాజకీయాలన్నీ కూడా డబ్బుతో ముడిపడి కొనసాగడం దురదృష్టకరమని, క్రిమినల్స్ కు, ఈడి కేసులు ఎదుర్కొంటున్న వాళ్లకు రాజ్యాధికారం దక్కడం ఏ మాత్రం సబబు కాదని ఆయన వెల్లడించారు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ జనసేన అని, నిరుపేదలకు అవకాశం కల్పించడమే తమ పార్టీ లక్ష్యమని శంకర్ గౌడ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే జనవరి 26, ఆగస్టు 15, గాంధీ జయంతిలనే మూడు పండుగలుగా జరుపుతామని శంకర్ గౌడ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాధారం రాజలింగం, మేకల సతీష్ రెడ్డి, దామోదర్ రెడ్డి, చిరాగ్ ప్రజిత్ గౌడ్, వంగా లక్ష్మణ్ గౌడ్, గోకుల రవీందర్ రెడ్డి, రామకృష్ణ మిరియాల, నందగిరి సతీష్, యడమ రాజేష్, వీర మహిళ విభాగం నాయకులు కావ్య, లిఖిత, సునీత, దాక్ష్యాయని, ముంతాజ్ మరియు ఇతర జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.