స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

కోట్లాదిమంది ప్రజలు, లక్షలాది జాతులు, వేలాది భాషలు, విభిన్న సంప్రదాయాలు.. ఇంతటి భిన్నత్వం ఉన్నా మనమంతా ఒక్కటే. మనకున్నది ఒకటే పతాకం. అది త్రివర్ణ పతాకం. కోట్లమంది భారతీయుల ఆశలు, ఆశయాలను మోస్తూ నింగిలో సగర్వంగా రెపరెపలాడుతోంది మన జాతీయ పతాకం. లక్షలాదిమంది దేశభక్తుల బలిదానాలు, త్యాగాల ఫలితంగా సిద్ధించిన దేశ స్వాతంత్ర్యాన్ని మధుర క్షణాలుగా మార్చుకొని మనం జరుపుకొంటున్న జెండా పండుగ ఆగస్టు 15. కులమతాలకు అతీతంగా భారతీయులంతా చేసుకొనే ఏకైక పండుగ ఇది అని చెప్పడం అతిశయోక్తి కాదు. 76 వసంతాలను పూర్తిచేసుకుని 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆనందోత్సాహాలతో చేసుకుంటున్న ఈ శుభ సందర్భాన.. గతాన్ని స్మరించుకుంటే ఎన్నో సవాళ్లు మరెన్నో ఆటుపోట్లు వాటన్నిటినీ అధిగమించుకుంటూ మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఆవిర్భవిస్తుందంటే ప్రతి భారతీయుడు గర్వించదగినదే. శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య, విద్య, అంతరిక్షం, మానవ వనరులు, వ్యవసాయ వాణిజ్య రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతి ప్రపంచ దేశాలకు మన దేశం ఆదర్శనీయంగా, తలమానికంగా నిలుపుతోంది. భారతీయుడిగా పుట్టినందుకు నా తోటి భారతీయులతో పాటు గర్విస్తున్నాను. నాడు బలిదానాలు చేసిన త్యాగమూర్తులను స్మరించుకుంటూ వారికి నా నమస్సుమాంజలి సమర్పిస్తున్నాను. ఈ ఆగస్టు 15 పుణ్యదినాన భారతీయులందరికీ నా పక్షాన జనసేన శ్రేణుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశం సౌభాగ్యవంతంగా, ప్రగతిశీలంగా, పేదరికం లేని రాజ్యంగా మరిన్ని విజయాలు సాధించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.