జల ప్రళయంతో దెబ్బ తిని కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడాలి

• రాష్ట్రంలో దురదృష్టకర పరిస్థితులు ఉన్నాయి
• ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరవైంది
• ప్రజల కడగండ్లకు స్పందించే తత్వం లేదు
• నాడు తిత్లీ తుపానుతో శ్రీకాకుళం ప్రజలు అల్లాడితే… విజయనగరంలో పాదయాత్ర చేశారు
• వారి ఆలోచనా విధానం ఏమిటో అప్పుడే తెలిసింది
• వరద ప్రభావిత ప్రాంతాల్లో జనసేన పక్షాన రెండు విడతల పర్యటన
• వరద బాధితులకు భరోసా ఇద్దాం
• వరద నష్టంపై టెలీ కాన్ఫరెన్స్ లో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో వరదలు, భారీ వర్షాలతో సంభవించిన విపత్తు మూలంగా ప్రజా జీవితం ఎంతగా కడగండ్ల పాలైందో తెలుసుకొంటుంటే హృదయం కలచి వేస్తోందని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు. ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా నిలిచి సాయం అందించాల్సిన తరుణమిది అన్నారు. కష్టకాలంలో ప్రభుత్వం మన కోసం నిలబడింది అన్న భావన కూడా ప్రజల్లో కల్పించలేక పోతోందని
స్పష్టం చేశారు. పార్టీ తరఫున రెండు విడతలుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మొదటి విడత పార్టీరాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పర్యటించి జరిగిన నష్టంపై అంచనాలు రూపొందిస్తారని, రెండో విడత తాను క్షేత్ర స్థాయిలో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలిపారు. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ప్రజల పక్షాన నిలుస్తామని చెప్పారు. ఆదివారం భారీ వరదలు, వర్షాలతో తీవ్రంగా ప్రభావిత జిల్లాలైన కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లా నాయకులు, పార్టీ పి.ఎ.సి. సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, నష్టం తీవ్రతపై సమీక్షించారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. “ప్రకృతి విపత్తులు చాలా ఇబ్బందికరమైనవి.. విపత్తులను ఆపలేం కానీ స్పందించే తీరు మాత్రం ప్రభావవంతంగా ఉండాలి. దురదృష్టం ఏమిటంటే ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరవయ్యింది. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. తిత్లీతుపాన్ సంభవించి శ్రీకాకుళం జిల్లాలో 10 లక్షల మంది ప్రజలు రోడ్డున పడితే, నాడు పక్క జిల్లా విజయనగరంలో పాదయాత్ర చేస్తున్న నేటి ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నాయకుడు బాధిత ప్రాంతాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇది వారి ఆలోచనా విధానాన్ని తెలియచేస్తోంది.

• వాలంటీర్లను ఎన్నికల కోసమే పని చేయించుకొంటున్నారు

ఒక్కసారిగా విరుచుకుపడిన వరదల్లో గల్లంతైన వారు ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉండాలని అందరం ఆశిద్దాం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాయలసీమ ప్రాంతంలో 100 సంవత్సరాల్లో రికార్డు కానంత వరద ప్రవాహం వచ్చిందని నీటిపారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు. పాదాలు కూడా తడవని పాయలు 20 అడుగులకు పైగా ఉదృతితో ప్రవహించాయి. ఆస్తి నష్టం, పశు నష్టం, విలువైన వస్తువులు, వాహనాలు, వ్యవసాయ సామాగ్రి నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించలేకపోతున్నాం. నివర్ తుపాను వాటిల్లినప్పుడు కేవలం పంట నష్టం మాత్రమే వాటిల్లింది. ఇప్పటి నష్టం అంచనాలకు అందడం లేదు. వరద
ప్రభావిత ప్రాంతాల ప్రజల పక్షాన నిలబడేందుకు జనసేన పార్టీ తరఫున దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్దాం. ఏదో తూతు మంత్రంగా వచ్చి వెళ్లే చందంగా కాకుండా రెండు విడతలుగా పార్టీ తరఫున పర్యటించి పూర్తి స్థాయిలో పోరాటం చేద్దాం. మొదటి విడత పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పర్యటిస్తారు. ఆయన పర్యటన తర్వాత ఏ జిల్లాలో ఎంత నష్టం వాటిల్లిందో ఒక అంచనాకు వచ్చిన తర్వాత బాధితులకు న్యాయం జరిగే వరకు వారి తరఫున నిలబడదాం. ప్రభుత్వ సహాయక కార్యక్రమాలు ఎలా ఉన్నాయి. ఎంత పరిహారం ప్రకటించారు అనే అంశాల మీద ఒక అంచనాకు వచ్చిన తర్వాత బాధితుల పక్షాన నిలబడదాం. ప్రజల డబ్బుతో వాలంటరీ వ్యవస్థను స్థాపించారు. ఇప్పుడు ఆ వ్యవస్థ కేవలం ఎన్నికల కోసం మాత్రమే పని
చేస్తోంది. వాలంటీర్ వ్యవస్థ తోపాటు వ్యవస్థలన్నింటినీ ఎలక్షనీరింగ్ కోసం పని చేయించుకుంటున్నారు. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న వాలంటీర్లే సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఏ అధికారం లేకపోయినా జనసైనికులు ముందుకు వచ్చి సాయం చేయగలిగే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు తీసుకుని పని చేసే వాలంటీర్ వ్యవస్థ ఎందుకు పని చేయడం లేదు? జనసేన పార్టీ తరఫున ఎవరి స్థాయిలో వారు సాయాన్ని కొనసాగించండి.

• ఫించ ప్రాజెక్ట్ పరిస్థితిని జనసేన ముందే చెప్పింది
తిరుపతిలో ఇంత స్థాయి నష్టం కలగడానికిగల కారణాల్లో చెరువులను కబ్జా చేయడమే. విషయాన్ని తిరుపతి జనసేన నాయకులు స్పష్టంగా చెప్పారు. ఆ అంశం దగ్గర నుంచి ఫించ డ్యామ్ ముంపు గ్రామాల వరకు ప్రజలకు ఎంత నష్టం వచ్చింది అనే అంశాల మీద కూడా పర్యటనల్లో అధ్యయనం చేద్దాం. ఫించ ప్రాజెక్ట్ ప్రమాదకరంగా ఉందని జనసేన ముందుగానే చెప్పింది. పార్టీనాయకులు ఈ విషయాన్ని అధికారులకు కూడా చెప్పారు. ఇంతటి విపత్తుకు కారణాలను కూడా సమగ్ర అధ్యయనంతో ప్రజలకు చెబుదాం. శ్రీ మనోహర్ గారు పర్యటించి నివేదిక అందచేసిన తరవాత ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తాను. చేతికి వచ్చిన పంట నీటి పాలై… పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడం బాధాకరం. అలాగే ఈ వరదల్లో బాధిత ప్రజలు తమ ఆస్తులను, ఎన్నో విలువైన డాక్యుమెంట్లను కోల్పోయారు. ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా ఉందాం. నష్టపోయిన వారికి బాసటగా నిలబడదాం” అన్నారు.

•ప్రజలను అప్రమత్తం చేయడంలో.. ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం – శ్రీ నాదెండ్ల మనోహర్
ప్రకృతి విపత్తు మూలంగా రాయలసీమలో 1600 గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి… 6.52 లక్షల ఎకరాల మేర పంటలు కోల్పోయారని పార్టీ పి.ఎ.సి.ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ కష్టం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “ప్రాజెక్టుల పరిస్థితి బాగోలేదు… వరద ముంపు ఉందని ఆందోళనలో ఉన్న వారిని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. విపత్తు సమయంలో అప్రమత్తం చేసి, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు
చేసి నిరంతరం సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో ప్రభుత్వం తన బాధ్యత చేపట్టలేదు. బాధిత ప్రజలను ఆదుకోవడంలో వైఫల్యం కనిపిస్తోంది. కడప జిల్లాలో రైతాంగం సర్వం కోల్పోయింది. పంటలు, పశు సంపద దెబ్బ తింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కల కంటే ఎక్కువగానే నష్టం ఉంది. జనసేన నాయకులు, శ్రేణులు నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు భరోసాగా నిలుస్తాం” అన్నారు. జనసేన పార్టీ నేతలు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, డా.పి.హరిప్రసాద్, శ్రీ కిరణ్ రాయల్, శ్రీ తాతంశెట్టినాగేంద్ర, డా.బోనాసి వెంకటసుబ్బయ్య, శ్రీ ముకరం చాంద్, శ్రీ సుంకర శ్రీనివాస్, శ్రీ టి.సి.వరుణ్ తమ ప్రాంతాల్లో చోటు చేసుకున్న జల ప్రళయం, నష్టం, ప్రజల బాధలను తెలియచేశారు.