సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు పరిమళించే వేడుక సంక్రాంతి పండుగ. రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, పిండి వంటలు, ఆటపాటల సమ్మేళనంతో ప్రతి ఏటా తరలి వచ్చే ఈ మూడు రోజుల వేడుక తెలుగు వారికి గొప్ప పండుగ. ప్రజల జీవితాలలో కొత్త కాంతులు తెచ్చి.. నేటి భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతున్న శుభవేళ నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. భారతీయ పండుగలలో ఏదో ఒక పరమార్ధం నిబిడీకృతమై ఉంటుంది. సంక్రాంతి పండుగను ప్రకృతి, ఖగోళము, ఆధ్యాత్మిక సంగమంగా మన పెద్దలు చెబుతుంటారు. ప్రకృతిపరంగా చూస్తే పంటలు పుష్కలంగా పండి ఫలసాయం ఇంటికొచ్చే తరుణం ఈ ధనుర్మాసం. ఖగోళ శాస్త్రం దృష్ట్యా పరిశీలిస్తే సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే శుభ ఘడియలు ఈ సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిననాటి నుంచి ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభం అవ్వడంతో భక్త జనులు ఈ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా త్రివేణి సంగమమైన ఈ పండుగ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం అంతటా వివిధ పేర్లతో ప్రజలు ఘనంగా జరుపుకోవడం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ మకర సంక్రాంతి ప్రజల జీవితాలలో కొత్త క్రాంతిని నింపాలని, భోగభాగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని జనసేనాని పేర్కొన్నారు.