జగన్నాథుని రథం కోసం హిందూ పరిరక్షణ సమితి నిరసన దీక్ష..!

  • హిందూ పరిరక్షణ సమితి నిరసన దీక్షకు జనసేన సంఘీభావం
  • హిందూ మనోభావాలు దెబ్బతీసేలా గత మూడేళ్ళుగా ప్రవర్తిస్తున్న దేవాదాయ శాఖ
  • ఆదాయం ఉన్నా ఆదరణ సున్నా
  • ఆస్తులు, ఆదాయాన్ని బహిర్గతం చేయాలి
  • ప్రతి దేవాలయానికి కమిటీలు వేయాలి
  • దేవాలయాల ఆచార సంప్రదాయాలు గాలికొదిలేశారని
  • హిందూ పరిరక్షణ సమితి నాయకుల ఆవేదన

పార్వతీపురం: జగన్నాధుని రథం కోసం హిందూ పరిరక్షణ సమితి పార్వతీపురం పట్టణంలోని జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం నిరసన దీక్షలు చేపట్టింది. ఈ సందర్భంగా ఆ సమితి సభ్యులు గొర్లి చంటి, అల్లూరి ఆనంద్, తాళ్లపూడి సంతోష్, గొర్లి అంజి, కోరాడ హేమంత్, మండల శరత్ కుమార్, పాటి శ్రీనివాసరావు, నెయ్యగాపుల సురేష్, రాజాన రాంబాబు, సిరిపురపు గౌరీ శంకర్ తదితరులు మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా పార్వతీపురం పట్టణంలో ఏటా జరిగే జగన్నాథ స్వామి రథయాత్రకు రథం లేకుండా నిర్వహిస్తూ హిందూ మనోభావాలు దెబ్బతీసేలా దేవాదాయ శాఖ అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశా తర్వాత ఘనంగా నిర్వహించే పార్వతీపురం జగన్నాధుని రథయాత్రకు రథం లేకపోవడం పార్వతీపురం పట్టణానికి వినాశనం దాపురిస్తుందని భయాందోళనలు వ్యక్తం చేశారు. గత ఏడాది రథం కోసం నిరసన చేపడితే వచ్చే ఏడాదికి సిద్ధం చేస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇచ్చి తప్పించుకున్నారన్నారు. ఏడాది గడిచినా ఇప్పుడు మళ్లీ సమయం చాలదంటూ దాటవేత మాటలు ఆడుతున్నారన్నారు. హిందూ పండగల ఆచార సాంప్రదాయాలను మంట గొలిపేలా అధికారులు ప్రవర్తించడం బాధాకరమన్నారు. ఆలయానికి ఆస్తులు ఉన్నప్పటికీ ఆదరణ లేదన్నారు. ఆలయానికి ఉన్న షాప్స్ ఓపెన్ ఆక్షన్ పెట్టాలన్నారు. ఆలయానికి కరెంటు లేకపోవడంతో పాటు పరిసరాలు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయన్నారు. కనీస ఆదరణ లేక జగన్నాథ స్వామి దేవాలయం కూనరిల్లుతొందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న అన్ని దేవాలయాలకు కమిటీలు వేయాలని డిమాండ్ చేశారు. ఆలయాలకు ఉన్న ఆస్తులు బహిర్గతం చేయాలన్నారు. ఓపెన్ ఆక్షన్ లో వచ్చే ఆదాయం, ఆస్తుల వివరాలు ఏటా ప్రజలకు చెప్పాలన్నారు. జగన్నాథ స్వామి ఆలయానికి రథం తయారీ గురించి పూర్తి రాతపూర్వక ప్రభుత్వ చర్యలకు సంబంధించి హామీలు వచ్చినంత వరకు నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన దీక్షలకు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు తాళాబత్తుల శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు చందక అనిల్ కుమార్, వంగల నాయుడు తదితరులు సంఘీభావం తెలిపారు.