హర్యానాలో కూలిన భారీ ఫ్లైఓవర్‌

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి సోహ్నా రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఒక ఫ్లైఓవర్ హఠాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్లైఓవర్ శిధిలాలను తొలగించే పనులు జరుగుతున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బాద్‌షాపూర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ లేని కారణంగా పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అమన్ యాదవ్ తెలిపారు. కాగా ఫ్లైఓవర్ కూలిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని వీడియోలు తీశారు. రాజీవ్ చౌక్ నుంచి గురుగ్రామ్‌లోని సోహ్నా వరకు ఈ ఫ్లైఓవర్‌ను రెండు వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఓరియంటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ చేపట్టింది. ఫ్లైఓవర్‌లోని ఎలివేటెడ్ రోడ్డులోని కొంత భాగం కూలిపోయిందని కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ శైలేష్ సింగ్ తెలిపారు. కాగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ నాణ్యతపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.