శత దళం.. సమర గళం!

* రణస్థలంలో జరిగే యువశక్తిలో మాట్లాడేందుకు భారీ స్పందన
* రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఫోన్ కాల్స్, ఈ – మెయిల్స్
* ఎంపిక తీరును పర్యవేక్షించిన జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

పదులు కాదు… వందలు కాదు… ఏకంగా వేలాది యువ గళాలు గొంతు విప్పేందుకు సిద్ధమవుతున్నాయి… ఆ గళాలు మండే నిప్పు కణికల్లాంటి ప్రశ్నలను సంధించనున్నాయి. ఆవేదన అశ్రుధారలతో గుండెను కదిలించనున్నాయి.. పాలకుల చేతగానితనాన్ని కళ్ళ ముందు ఉంచనున్నాయి. ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరగబోయే జనసేన యువశక్తి వేదిక నుంచి మాట్లాడేందుకు 100 మంది యువతకు అవకాశం ఇవ్వాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా విభిన్నమైన అంశాలను మాట్లాడేందుకు యువతకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ కేటాయించడం జరిగింది. ముందుగా ఏ సమస్య మీద మాట్లాడాలనుకుంటున్నది యువత వాయిస్ రికార్డర్, మెయిల్ రూపంలో తెలియజేయాలనీ పార్టీ పిలుపునిచ్చింది. దీనికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి యువతరం భారీగా స్పందించింది. వేలాది వాయిస్ రికార్డులు, మెయిల్స్ వచ్చాయి. వచ్చిన ఫోన్ కాల్స్, ఈ-మెయిల్ నుంచి 100 మంది యువతను వేదిక నుంచి మాట్లాడేందుకు ఎంపిక చేసే ప్రక్రియ పార్టీ సిబ్బంది ఆధ్వర్యంలో పారదర్శకంగా సాగుతోంది. వచ్చిన ప్రతి కాల్ విని, ఈ-మెయిల్ ను పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి ఈ ఎంపిక ప్రక్రియ సాగుతోంది. జనవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,458 ఫోన్ కాల్స్, 1235 ఈ – మెయిల్స్ అందాయి. వీటిని పూర్తిస్థాయిలో పరిశీలించి ఎంపిక చేసే ప్రక్రియను ఆదివారం శ్రీకాకుళంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యవేక్షించారు. ఎంపిక తీరును, పార్టీ కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన స్వయంగా కొన్ని ఫోన్ కాల్స్ విని, ఈ – మెయిల్స్ చూసి తగు సూచనలు అందించారు. భారీగా ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్ వచ్చినప్పటికీ ప్రతి ఒక్కటీ కచ్చితంగా పరిశీలించాలని ఆయన సూచించారు. ఎంపిక చేసిన వారికి త్వరలోనే కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం వస్తుందని తెలియజేయాలని చెప్పారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ “యువత గళాలను వేదనను, వారి మనోభావాలను జనసేన పార్టీ పరిగణనలోకి తీసుకుంటుంది. యువత గళం మొత్తం రాష్ట్రం వినిపించేలా చేస్తాం. వచ్చిన ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్ నుంచి పారదర్శకంగా పరిశీలన చేస్తున్నాం” అన్నారు.