మండలిపురం కాలనీలో మౌళిక వసతులు కల్పించక పోతే మరోసారి దీక్షకు సిద్దం

అవనిగడ్డ మండలిపురం కాలనీలో డ్రైన్ సౌకర్యం కల్పించి మురుగు నీటిని బయటకు తరలించాలని, వీది దీపాలు ఏర్పాటు చేయాలని, రోడ్లు వేయించాలని కోరుతూ గత సంవత్సరం జులై 30 వ తేదీన జనసేన నాయకులు 36 గంటలు నిరసన దీక్ష చేయగా కదిలిన పంచాయతీ యంత్రాంగం కొంతవరకు పనులు చేయించిన విషయం విధితమే. కాలనీ ఏర్పడి 10 సంవత్సరాలు దాటినా 3 రోడ్ల వెంబడి ఇప్పటికీ వీది దీపాలు ఏర్పాటు చేయలేదని, పంచాయతీ అధికారులు స్పందించి తీర్మానం చేసి, వీది దీపాలు ఏర్పాటు చేయకపోతే మరోసారి నిరసన దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు చెప్పారు. డ్రైన్ లో ఉన్న మురుగు నీరు బయటకు వెళ్ళే మార్గం లేక నిల్వ ఉండటంతో టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయని, కనీసం బ్లీచింగ్ కూడా చల్లడం లేదని, డ్రైన్ లో ఉన్న సిల్ట్ బయటకు పంపడానికి ఒక్కో కుటుంబానికి 4,500 వరకు ఖర్చు అవుతుందని, రోజువారీ కూలీ పని చేసుకునే పేద వారు అంత ఖర్చులు భరించలేక ఇంకా పేదరికం లోకి నెట్టబడుతున్నారని, ఇంటి పన్నులు, మంచినీరు సరఫరాకు చార్జీలు వసూలు చేసే పంచాయతీ వారు ఏమి చేస్తున్నట్లు అని జనసేన నేతలు ఎద్దేవా చేశారు. దోమలు విపరీతంగా ఉండటంతో ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారని వైద్య బృందం ప్రత్యేక శిబిరం నిర్వహించాలని వారు కోరారు. కాలనీ నుండి కొత్తపేట రోడ్డు వరకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పెండింగులో ఉన్న రోడ్లు వెంటనే నిర్మాణం చేయాలని వారు కోరారు. వర్షాకాలం రాకముందే డ్రైన్ లు త్రవ్వించి, దశాబ్దాలుగా ఉన్న మురుగు నీటి సమస్య పరిష్కారానికి ప్రస్తుత పాలక వర్గం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొప్పన భాను, ఎంపీటీసీ కటికల వసంత్, అశ్వారావుపాలెం గ్రామ ఉపసర్పంచ్ యక్కటి నాగరాజు, కమ్మిలి సాయి భార్గవ, బొప్పన పృథ్వి, బచ్చు శ్రీహరి, గౌస్ కాటమ, మత్తి అజయ్, దాసినేని శివ, కోసూరి అవినాష్, పప్పుశెట్టి శ్రీను, రేపల్లె రోహిత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.