అవకాశం ఇస్తే సత్తా చాటుతాం: అతికారి దినేష్

రాజంపేట, రాజంపేట అసెంబ్లీ టికెట్ జనసేన పార్టీకి కేటాయించాలని, నియోజకవర్గంలో పార్టీకి బలమైన కేడర్ ఉందని, అవకాశం ఇస్తే సత్తా చాటుతామని జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ పేర్కొన్నారు. మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల ప్రణాళిక పట్ల అతికారి దినేష్ దిశా నిర్దేశం చేశారు. మన్నూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనసైనికుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రలోభాలకు ఎవరూ లొంగవద్దని సూచించారు. వైసిపి నిరంకుశ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడానికే తమ అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకోవడం జరిగిందని తెలిపారు. అధికారం, పదవుల కన్నా రాష్ట్ర భవిష్యత్తే పవన్ కళ్యాణ్ ఆకాంక్ష అని, అభిమానులు ఈ విషయం అర్థం చేసుకోవాలని కోరారు. రాజంపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు తాము నిర్వహించిన సేవా కార్యక్రమాలు, ప్రజలలో తమకున్న ఆదరణను గమనించి నియోజకవర్గ అసెంబ్లీ సీటు జనసేనకు కేటాయించి తనను అభ్యర్థిగా ప్రకటిస్తే రాజంపేట నియోజకవర్గం లో జనసేన జెండా ఎగురవేసి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. జనసేన, బిజెపి, టిడిపి పొత్తులో భాగంగా రాజకీయ సమీకరణలలో తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు ఏ పార్టీకి టికెట్ లభించినా తమ సంపూర్ణ మద్దతు తెలియజేసి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా అడుగులు వేయాలని సూచించారు. జనసేనాని ఆశయ సాధన కోసం కృషి చేస్తూ, ఆయన అడుగుజాడల్లో నడిచి ఉమ్మడి అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవడమే మన ముందున్న లక్ష్యమని, ఇందుకోసం ప్రతి జన సైనికుడు పోరాడాలని సూచించారు. కూటమి గెలుపే అంతిమ లక్ష్యంగా మూడు పార్టీల కార్యకర్తలను, అభిమానులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ వీర మహిళ వరలక్ష్మి, మరియు జనసేన నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, గుగ్గిల నాగార్జున, కొట్టే శ్రీహరి, ఓబులేష్, జయరామయ్య, శ్రీరాములు, కత్తి సుబ్బరాయుడు, ఇదాయత్, కళ్యాణ్, రాజా, కొండల గారి రవి, మస్తాన్ రాయల్, రత్నం తదితరులు పాల్గొన్నారు.