వరదొస్తే… వార్నాయనో!

* వణికిపోతున్న పోలవరం నిర్వాసితులు
* ఏటా వర్షాకాలంలో పడరాని పాట్లు
* నాలుగేళ్లుగా దయనీయ స్థితిగతులు
* పునరావాసం పట్టని ప్ర‌భుత్వం
* మొక్కుబడి చర్యలతో కాలక్షేపం

వాళ్లు…
వర్షాకాలం వచ్చిందంటే చాలు ఉలిక్కి పడతారు!
వానలు పెరిగేకొద్దీ బితుకుబితుకుమంటూ బతుకుతారు!
ఇక వరదలంటూ వస్తే దయనీయస్థితిలో పడిపోతారు!
ఒకరు కారు, ఇద్దరు కారు వేలాది మంది కుటుంబాల దయనీయ స్థితి ఇది…
నాలుగేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న అభాగ్యుల ఆవేదన ఇది…
ఎవరు వాళ్లు?
పోలవరం ప్రాజెక్టు కోసం నిర్వాసితులుగా మారిన వాళ్లు…
ప్రభుత్వ హామీలు నమ్మి దగా పడిన వాళ్లు…
తర‌త‌రాలుగా సంక్ర‌మించిన పొలాల్ని వ‌దులుకున్న‌వాళ్లు…
ఉన్న ఊరిని, ఇంటిని విడిచి వ‌ల‌స‌పోయిన వాళ్లు…
ఆదాయం లేక‌ అల‌మ‌టిస్తున్న‌వాళ్లు…
నిజానికి వాళ్లు చేసింది అపూర్వ‌మైన త్యాగం!
ల‌క్ష‌లాది ఎక‌రాల‌ను స‌స్య‌శ్యామ‌లం చేయ‌డానికి ఉన్న ఆస్తుల్ని వ‌దులుకోడానికి సిద్ధ‌ప‌డిన ఆద‌ర్శం!
అలాంటి వాళ్ల త్యాగానికి, ఆదర్శానికి ఓ అర్థం లేకుండా చేస్తోంది వైకాపా ప్ర‌భుత్వం!
ఒకరు కాదు… ఇద్దరు కాదు… 373 ఆవాస గ్రామాల్లోని 99,655 కుటుంబాలకు చెందన లక్షలాది మంది దుర్భర పరిస్థితులను పట్టించుకోకుండా కబుర్లతో కాలక్షేపం చేస్తోంది జగన్‌ ప్రభుత్వం!
ఏటా వర్షాలు పడుతున్నాయి… ఆ తర్వాత వరదలూ వస్తున్నాయి…
వరదల కంటే ముందుగానే వారికి పునరావాసం చూపిస్తామంటూ వైకాపా ప్రభుత్వం ఏటా హామీలు గుప్పిస్తూనే ఉంది…
తీరా ఆచరణ దగ్గరకి వచ్చేసరికి నిర్లక్ష్యం చూపిస్తూనే ఉంది…
* నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి!
గత ఏడాది వరదల్లో 300 పైగా ఆవాస ప్రాంతాలు ముంపునకు గురయ్యయి. కొన్ని ఊళ్లు నీట మునగ్గా, మరి కొన్ని వరద వల్ల బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి నానా పాట్లూ పడ్డారు. వేలాది మంది బాధితులు ఏ గుట్ట కనిపడితే దాని పైకి ఎక్కి గుడారాలు వేసుకుని రోజుల తరబడి నరకయాతనలు పడ్డారు. ఆఖరికి కాలకృత్యాలు తీర్చుకోడానికి సైతం వీలు లేని దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయినా జగన్‌ ప్రభుత్వంలో చలనం లేదు. వర్షాకాలం రాకుండానే వీరి సురక్షిత జీవనం గురించి ఏర్పాట్లు చేయాల్సి ఉండగా, చేష్టలుడిగి కాలక్షేపం చేయడం వల్ల ఇప్పుడు మళ్లీ వరదల సమయం వచ్చేసింది. ఇప్పటికిప్పుడు వీరి పరిస్థితులు మారే అవకాశం లేదు. ఈసారి కూడా వరదల బారిన పడకతప్పని దారుణ పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లోని లక్షలాది మంది ఉలిక్కిపడుతున్నారు.
వీళ్లందరి దయనీయ స్థితిని తెలుసుకునే ముందు, దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన పోలవరం ప్రాజెక్టు గురించి తరచి చూడాలి.
ఆ సామాన్యులు చేసిన త్యాగం ఏమిటో, వాళ్లంద‌రూ ఇప్పుడు నానా క‌ష్టాలు ప‌డ‌డానికి కార‌ణం ఏమిటో తెలుసుకోవాలి.
* వివ‌రాలు ఘ‌నం…వాస్త‌వాలు హీనం!
పోల‌వ‌రం ప్రాజెక్టు ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కే కాదు, మొత్తం దేశానికే ప్ర‌తిష్టాప‌క‌మైన‌ది. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ల‌క్ష‌లాది ఎక‌రాల‌కు సాగునీరు, ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల‌కు తాగునీరు అందించ‌డంతో పాటు విద్యుదుత్ప‌త్తికి కూడా దోహ‌ద ప‌డే బ‌హుళ ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన ప్రాజెక్టు ఇది. ద‌క్షిణ గంగ‌గా పేరొందిన గోదావ‌రి న‌దిపై నిర్మించే ఈ ప్రాజెక్టు వివ‌రాల‌న్నీ ఘ‌నంగానే ఉంటాయి. అయితే ఈ ప్రాజెక్టు కింద క‌ట్టే భారీ ఆన‌క‌ట్ట‌, దానికి ఇరు ప‌క్క‌లా నిర్మించే కాలువ‌ల వ‌ల్ల అనేక ప‌ల్ల‌పు ప్రాంతాలు నీటితో నిండిపోతాయి. అలా మునిగిపోయే ప్రాంతాల్లో వంద‌లాది గ్రామాలు కూడా ఉన్నాయి. వాటిలో అనేక గిరిజ‌న గ్రామాలు, సామాన్య గ్రామాలు కూడా ఉన్నాయి. అలా మొత్తం 222 రెవెన్యూ గ్రామాల‌కు చెందిన 373 గ్రామాలు ముంపున‌కు గుర‌వుతాయ‌ని అంచ‌నా వేశారు. ఆయా గ్రామాల్లో ఉండే దాదాపు ల‌క్ష‌ కుటుంబాల వారిని వేరే చోట్లకు త‌ర‌లించాల‌ని ప్ర‌తిపాదించారు. ఇలా నిర్వాసితులుగా మారే వారి కోసం వేరే ప్రాంతాల్లో కాల‌నీలు క‌ట్టించాల‌ని, వారికి ప‌రిహారాలు అందించి వాటిలోకి త‌ర‌లించాల‌ని ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. ఆ మేర‌కు అధికారులు ఆయా ప్రాంతాల‌ వారంద‌రినీ క‌లిసి గ్రామాలు ఖాళీ చేస్తే ల‌క్ష‌లాది రూపాయ‌ల ప‌రిహారంతో పాటు, స‌క‌ల సౌక‌ర్యాల‌తో కూడిన ప‌క్కా కాల‌నీల‌లో నివాసం అందిస్తామ‌ని హామీలు ఇచ్చారు. ఫ‌లితంగా ఆయా గ్రామాల్లో ఉన్న గిరిజ‌నులు, సామాన్యులు త‌మ పొలాల‌ని, ఇళ్ల‌ని కూడా ప్రభుత్వానికి అప్ప‌గించారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. కానీ ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు వారికి కాల‌నీలు నిర్మించ‌డంలోను, ప‌రిహారం అందించ‌డంలోను జ‌రుగుతున్న తీవ్ర‌మైన ఆల‌స్యం, వాళ్ల త్యాగాన్ని ప‌రిహాసం చేస్తోంది. పొలాల్ని అప్ప‌గించ‌డం వ‌ల్ల వీరిలో చాలా మందికి ఉపాధి లేకుండా పోయింది. ఊళ్ల‌కి ఊళ్ల‌లో ఇదే ప‌రిస్థితి కాబ‌ట్టి వాళ్లకి కూలి ప‌ని కూడా దొర‌క‌ని దుస్థితి చాలా చోట్ల క‌నిపిస్తోంది. అయితే ఏళ్లు గ‌డిచిపోతున్నా వాళ్ల‌కి క‌ట్టి ఇస్తామ‌న్న కాల‌నీల ప‌ని పూర్తికాక‌పోవ‌డంతో ఈ ప్రాజెక్టు నిర్వాసితుల్లో అత్య‌ధికుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవ‌డిలా త‌యారైంది.
* హామీలిచ్చి ఆచరణ మరిచిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం
ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం వైకాపా అధినేత హోదాలో జగన్‌ అనేక హామీలు గుప్పించారు. నిర్వాసితుల్లో ఆశలు రేకెత్తించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ చేసిందేమీ లేదు. నిర్వాసితుల స్థితిగతులు మారింది లేదు.
పోల‌వరం ప్రాజెక్టు నిర్వాసితుల‌కు ఇచ్చే ప‌రిహారాన్ని ప‌ది ల‌క్ష‌ల వంతున పెంచుతాన‌ని జగన్‌ నమ్మబలికారు. తర్వాత జీవో అయితే విడుదలైంది కానీ బాధితులకు ఆ మేరకు పరిహారం ముట్టింది లేదు. నిర్వాసితులకు స‌క‌ల సౌక‌ర్యాల‌తో కూడిన కాల‌నీల నిర్మాణాన్ని త్వ‌రితంగా అంద‌జేస్తాన‌ని కూడా జగన్‌ వ్రాక్కుచ్చారు. అదీ జరిగింది లేదు. తమ పరిస్థితులకు విసిగిపోయిన పోల‌వ‌రం నిర్వాసితులు నిర‌స‌న‌లు, నిరాహార దీక్ష‌లకు సైతం దిగినా వైకాపా ప్రభుత్వం పట్టించుకున్నది లేదు. ఇప్పటికీ వీరి కోసం నిర్మిస్తామ‌న్న కాల‌నీల‌లో ప‌నులు న‌త్తన‌డ‌కన సాగుతున్నాయి. చాలా మంది అసంపూర్తిగా నిర్మించిన కాల‌నీల‌కే వెళ్లి అర‌కొర వ‌స‌తుల మ‌ధ్య అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. చాలా కాల‌నీల‌లో ఇళ్ల‌కు త‌లుపులు లేవు. స్నానాల గ‌దుల‌కు సైతం గుమ్మాలు పెట్ట‌డ‌పోవ‌డంతో త‌డిక‌లో, చీర‌లో అడ్డం పెట్టుకుని అవస్థ‌లు ప‌డుతున్న కుటుంబాలు వేల‌ల్లో ఉన్నాయి. పోనీ ప‌రిహార‌మైనా అందిందా అంటే, అదీ అంతంత మాత్ర‌మే. నిర్వాసితుల‌కు మొత్తం 8,112 కోట్ల రూపాయ‌లను అందించాల్సి ఉండ‌గా ఇంత‌వ‌ర‌కు కేవలం 580 కోట్ల రూపాయ‌ల‌నే ఇచ్చారు. ఇది జాతీయ ప్రాజెక్టు కాబ‌ట్టి ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం, అటు కేంద్ర ప్ర‌భుత్వం కూడా నిధుల‌ను స‌మ‌కూర్చాల్సి ఉంది. కానీ కాల‌నీల నిర్మాణంలో, ప‌రిహారం అంద‌జేత‌లో ప్ర‌గ‌తిని చూపించి పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీకి నివేదిస్తేనే, కేంద్రం ఆ మేర‌కు నిధుల‌ను విడుద‌ల చేస్తుంది. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేయాల్సిన పనుల‌లోనే తీవ్ర‌మైన జాప్యం, నిర్ల‌క్ష్యం, బాధ్య‌తారాహిత్యం ఎదురవుతుండ‌డంతో నిర్వాసితుల బాధ‌లు తీర‌డం లేదు. ఇక పూర్త‌యిన కాల‌నీల్లో కూడా అనేక స‌మ‌స్య‌లు తాండ‌విస్తున్న య‌దార్థం క‌నిపిస్తోంది. ప్రాజెక్టు నిర్వాసితుల కోసం పోల‌వ‌రం, గోపాల‌పురం, కొయ్య‌ల‌గూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, దేవీప‌ట్నం త‌దిత‌ర ప్రాంతాల్లో కాల‌నీల నిర్మాణాన్ని చేప‌ట్టినా ఒక్క కాల‌నీలో కూడా స‌దుపాయాలు స‌రిగా లేక‌పోవ‌డం జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిష్క్రియాప‌ర‌త్వానికి, ఉదాసీన‌త‌కి నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తోంది.
భూసేకరణలో రైతులకు అన్యాయం జరిగిందంటూ గుండెలు బాదుకున్న జగన్‌ తాము అధికారంలోకి రాగానే ఎకరాకు రూ. 5 లక్షలు అదనంగా ఇస్తానంటూ ఆశ పెట్టారు. అది కూడా నాలుగేళ్లుగా అమలు కానే లేదనేది కఠోర వాస్తవం. కిందటేడాది వరదల సందర్భంగా జగన్‌ ఇచ్చిన హామీలకు కూడా అతీగతీ లేకుండా పోయింది. ”రెండునెలల్లో 107 గ్రామాలను ఖాళీ చేయించి, ఆ కుటుంబాలకు అన్ని రకాల పరిహారం చెల్లించి, ఇళ్లు కేటాయిస్తాం” అంటూ ప్రచారం చేశారు. జగన్‌ చెప్పిన గడువు ముగిసి పది నెలలు దాటినా ఇంత వరకు ఒక్క కుటుంబానికి కూడా ప్రయోజనం జరగలేదు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ వరదల కాలం వచ్చేసింది. అందుకనే వర్షాలు పడుతుంటే నిర్వాసిత కుటుంబాలకు చెందిన లక్షలాది మంది గుండెలు గుభేలుమంటున్నాయి. గతంలో భద్రాచలం వద్ద వరద స్థాయి 60 అడుగులు దాటితే నిర్వాసిత గ్రామాలు ముంపునకు గురయ్యేవి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలైన తరువాత ఇప్పుడు 40 అడుగులు దాటితే చాలు నీటి ముంపునకు గురవుతున్నాయి. అటు పునరావాస ప్రాంతాల్లో సౌకర్యాల విషయంలో కానీ, ఇటు పరిహారంలో కానీ, ఇటు కాలనీల నిర్మాణంలో కానీ… ఇలా ఏ అంశం తీసుకున్నా అది వైకాపా ప్రభుత్వం నిష్క్రియాపరత్వానికి నిదర్శనంగానే కనిపిస్తోంది.