ముఖ్యమంత్రి రాకతో జిల్లాకు ఏమి ఒరిగింది..??

  • నాలుగైదు కోట్లు ప్రజాధనం ఖర్చు తప్ప
  • బటన్ నొక్కడానికి, పవన్ ని తిట్టడానికి కురుపాం రావాలా ?
  • ఆ డబ్బుతో కొత్తగా ఏర్పడిన జిల్లా కార్యాలయాలకు వసతులు సమకూరేవి
  • బలవంతంగా బస్సుల్లో జనాల్ని తరలించడం
  • వారం రోజులు అధికారులు సిబ్బంది సమయం వృధా చేయటం
  • జిల్లా సమస్యలు జిల్లా పాలకులకు, అధికారులకు గుర్తు రాకపోవడం విడ్డూరం

పార్వతీపురం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కురుపాం రావటం వల్ల పార్వతీపురం మన్యం జిల్లాకు ఏమి ఒరిగిందని జనసేన పార్టీ నాయకులు ప్రశ్నించారు. గురువారం ఆ పార్టీ జిల్లా నాయకులు వంగల దాలినాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, రౌతు బాలాజీ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాకు రావటం వల్ల ఏమైనా వరాలు ఇస్తారేమోనని ప్రజలు ఆశించారన్నారు. అయితే ఆయన ప్రజలను నిరాశ పరుస్తూ బటన్ నొక్కుతూ… జనసేనాని పవన్ కళ్యాణ్ ని తిట్టడం. ఈ రెండే చేసి ప్రజలను నిరాశ పరిచారన్నారు. ఆ మాత్రం దానికి ముఖ్యమంత్రి కురుపాం రావాలా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రోగ్రాంకు దాదాపు నాలుగు, ఐదు కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. ఆ ఖర్చుకు పెట్టే డబ్బుతో కొత్తగా ఏర్పడిన మన్యం జిల్లా కార్యాలయాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు వినియోగిస్తే ఆయా కార్యాలయాలకు వసతులు సమకూరేవి అన్నారు. ఇప్పటికి కొన్ని కార్యాలయాల్లో కూర్చోవడానికి కుర్చీలు లేని దుస్థితి ఉందన్నారు. అటువంటి పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధికి ఏమైనా వరాలు ఇవ్వాల్సింది పోయి, ముఖ్యమంత్రి కార్యక్రమం వల్ల దాదాపు వారం రోజుల అధికారుల, సిబ్బంది పని దినాలను వృధా చేయడమే కాకుండా, బలవంతంగా ప్రజలను బస్సుల్లో తరలించి వారి సమయాన్ని కూడా వృధా చేశారన్నారు. ఇక జిల్లా పాలకులు, అధికారులు జిల్లా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లకపోవడం ప్రజలు దౌర్భాగ్యం అన్నారు. ప్రధానంగా జిల్లాని వేదిస్తున్న ఏనుగులు సమస్య, జంఝావతి ప్రాజెక్ట్, గుమ్మిడి గెడ్డ, వనకాబడిగెడ్డ, అడారుగెడ్డ తదితర సమస్యలు, గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయం లేక డోలీలు మోతలు, విద్య , ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత అవస్థలు, గోతులు పడిన రోడ్లు, విద్య, వైద్యం, తాగునీరు, చెత్త డంపింగ్ యార్డు, ప్రభుత్వ స్థలాలు, చెరువుల కబ్జాలు తదితర సమస్యలు గుర్తుకు రాకపోవడం విడ్డురమన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కొత్తగా సమస్యలతో సతమతమవుతున్న జిల్లాకు వస్తే సాధారణంగా వరాల జల్లు కురుస్తుందన్నారు. కానీ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కురుపాం రావటం వలన ఒక బటన్ నొక్కుడు, పవన్ కి నాలుగు తిట్లు, నాలుగైదు కోట్లు ప్రజాధనం వృధా తప్ప మరేమీ జిల్లాకు ఒరగలేదని ఎద్దేవా చేశారు.