స్థానిక సమస్యలను వెల్లడిస్తే దాడి చేస్తారా

* తిరుపతిలో జనసేన వీర మహిళ శ్రీమతి లక్ష్మీనరసమ్మ ఇంటిపై దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి
ప్రజాస్వామ్య దేశంలో నచ్చిన రాజకీయ పార్టీ పక్షాన నిలవడం ప్రజల హక్కు. ఇదేమీ నియంత దేశం కాదు… రాచరికం అంతకంటే కాదు. మా ఊళ్ళో, మా వీధిలో తమ పార్టీ మాత్రమే ఉండాలంటూ వైసీపీ చేస్తున్న దాడులు వారి నిరంకుశ ధోరణిని వెల్లడిస్తున్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. తిరుపతి నగరం వెంకటరెడ్డి కాలనీలో మంగళవారం జనసేన వీర మహిళ, జనసేన పార్టీ నగర కార్యదర్శి శ్రీమతి పూతలపట్టు లక్ష్మీ నరసమ్మ ఇంటి మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం అత్యంత హేయం. జనసేన పార్టీ చేపట్టిన నా సేన కోసం.. నా వంతు కార్యక్రమాన్ని కాలనీలో ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని అడగడానికి వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఏ హక్కు ఉంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ మహిళ ఇంటిపై దాడి చేసి.. ఇంట్లోని వస్తువులు విసిరికొట్టడం వైసీపీ వాళ్ళ దౌర్జన్యాన్ని తెలియచేస్తోంది. స్థానిక మహిళలు డ్రైనేజీ సమస్యతో ఇక్కట్ల పాలవుతుంటే ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణిని సైతం స్థానిక వైసీపీ కార్పొరేటర్ అనుచరులు ఫోన్లో బెదిరించి అసభ్యంగా మాట్లాడటం, ఇంట్లోని వారిపై కేసులు పెట్టిస్తామనడం చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నమా అనే సందేహం కలుగుతోంది. శ్రీమతి లక్ష్మీ నరసమ్మ ఇంటిపై దాడి చేసినవారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వారిపై ఉంది. వైసీపీ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇలా బెదిరిస్తే.. భయపెడితే జనసైనికులు, వీర మహిళలు వెనక్కు తగ్గుతారు అనుకుంటే మీ పొరపాటే. కచ్ఛితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెబుతామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *