ప్రజాపోరాటమే జనసేన ప్రస్థానం

*ఇబ్బందులు ఎన్ని ఎదురైనా ప్రజలకు అండగా నిలబడ్డాం
*నీతి, నిజాయితీలకు నిలువుటద్దం శ్రీ పవన్ కళ్యాణ్
*ఓడిపోయినా… నిలబడ్డాం అంటే అధినేత నిజాయితీయే కారణం
*ముఖ్యమంత్రి పబ్లిసిటీ పిచ్చితో ఇంటింటికీ స్టిక్కర్లు
*సీఎంకు పాలన దక్షితలేకే ఏపీకి రాజధాని లేకుండా పోయింది
*జనసేన అధికారంలోకి వస్తే అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి
*మలిచీపట్నంలో జరిగిన 10వ ఆవిర్భావ సభలో పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే అభద్రతా భావంతో గడప గడపకు కార్యక్రమంలో స్టిక్కర్లు అంటిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. డబ్బు సంపాదనకే తప్ప… రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే తీరిక వైసీపీ నాయకులకు లేదని అన్నారు. చెడ్డవాడి చేతిలో చట్టం ఉంటే… చట్టం కూడా చెడిపోతుందని, అదే మంచివాడి చేతిలో ఉంటే ప్రజల జీవితాల్లో మార్పు తథ్యమని అన్నారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్లను మరమ్మతులు చేయలేని ఈ ముఖ్యమంత్రి… మూడు రాజధానులు గురించి మాట్లాడటం హాస్యాస్పందగా ఉందని అన్నారు. పాలన దక్షత లేని ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి.. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందని అన్నారు. మంగళవారం మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ వేదిక నుంచి ప్రసంగించారు. అంతకుముందు కృష్ణా జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “ ఈ రోజు మనందరికి ఎంతో పవిత్రమైన రోజు. తొమ్మిదేళ్ల సుదీర్ఘమైన ప్రస్థానం. ఎన్నో అవమానాలు, ఇబ్బందులకు ఎదురొడ్డి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీని 10వ ఆవిర్భావం దినోత్సవం వరకు తీసుకొచ్చారు. ఈ ప్రస్థానంలో ఆయన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేపడుతుంటే అడ్డుకోవాలని చూశారు. ఎన్ని అవమానాలు ఎదురైనా వెనుతిరగలేదు. 2014లో పార్టీ స్థాపించినప్పుడు వచ్చే 25 ఏళ్ల నా జీవితం ప్రజలకు అంకితమని చెప్పారు. ఈ రోజుకూ అదే మాటమీద నిలబడి పోరాటం చేస్తున్నారు.
*ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుదిరగలేదు
గత సార్వత్రిక ఎన్నికల ముందు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోరాటయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి మొదలు పెట్టారు. అప్పుడు ఆయన అకౌంట్లో కేవలం రూ. 7 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఎలక్షన్లలో ఓడిపోయిన ఆరు నెలలకే విశాఖలో భవన నిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ చేపట్టారు. డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల ఆకలి తీర్చడానికి ఐదు రోజుల పాటు ఆహార శిబిరాలు నిర్వహించారు. అరెస్టు చేస్తామని బెదిరించినా కంచెలు తెంచుకుంటూ అమరావతి రైతులకు అండగా నిలబడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మాట్లాడిన మొట్ట మొదటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటాలకు సంఘీభావంగా దీక్షకు కూర్చున్నారు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నా ఏనాడూ వెనుదిరిగి చూడలేదు.
*వందలాది కౌలు రైతుల కుటుంబాలకు అండగా ఉన్నాం
భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. పార్టీ తరఫున ఇప్పటి వరకు ఏడు జిల్లాల్లో సాయం అందించాం. ఇప్పుడు ఎనిమిదో జిల్లాగా కృష్ణా జిల్లాలో సాయం అందించాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన రూ. 5 కోట్ల విరాళంతో ఇంత మహోన్నత కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం. ప్రభుత్వం ఇస్తున్న రూ. 7 లక్షల పరిహారం సొమ్ములో రూ. 2 లక్షల లంచం స్థానిక నాయకులు తీసుకుంటున్నారు. సత్తెనపల్లిలో లంచం ఇవ్వలేదని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన రూ. 5 లక్షల చెక్ ను స్థానిక నాయకుడు వెనక్కి పంపించేశాడు. ఆ కుటుంబానికి జనసేన పార్టీ రూ. 4 లక్షలు ఇచ్చి అండగా నిలబడింది. అలాగే గత ఆవిర్భావ సభకు స్థలాలు ఇచ్చారనే కక్షతో ఇప్పటం గ్రామంలో 46 ఇళ్లను కూల్చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గ్రామస్థులలో ధైర్యం నింపడానికి రూ. 50 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ రోజు సభ జరుపుకోవడానికి మచిలీపట్నంకు చెందిన రైతులు 34 ఎకరాలు ఇచ్చారు. సభను అడ్డుకోవాలని చాలా మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా రైతులు జనసేనకు అండగా నిలబడ్డారు. వాళ్లకు ఈ సభా వేదిక నుంచి పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
*క్రియాశీలక సభ్యులు రెట్టింపు అయ్యారు
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు సభ్యత్వాలు నమోదయ్యాయి. గత ఏడాది 3,19,576 సభ్యత్వాలు నమోదైతే ఈ ఏడాది 6,69,355 సభ్యత్వాలు నమోదయ్యాయి. క్షేత్రస్థాయిలో 7,144 మంది వాలంటీర్లు కష్టపడ్డారు. వాళ్లందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. 19 మంది వెయ్యికి పైగా నమోదు చేశారు. 60 మందికిపైగా 500 సభ్యత్వాలు చేయించారు. ఒక సామాన్య ట్యాక్సీ డ్రైవర్ 800 సభ్యత్వాలు చేశాడు. ఒక రైతు, కాలేజీ స్టూడెంట్, టైలర్ ఇలా ప్రతి ఒక్కరు పార్టీ కోసం అంకితభావంతో పని చేసి సభ్యత్వాలు రెట్టింపు అయ్యేలా కృషి చేశారు.
*జగనన్న కాలనీలు భారతదేశంలోనే అతి పెద్ద కుంభకోణం
అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేరుస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో 29 లక్షల మందికి ఇళ్లు నిర్మిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లల్లో నిర్మించినవి కేవలం 1.42 లక్షలు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన టిడ్కో ఇళ్లు కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోంది. దసరా, దీపావళి, ఉగాది అంటూ కాలం గడుపుతోంది తప్ప .. లబ్ధిదారులకు మాత్రం ఇళ్లు ఇవ్వడం లేదు. భారతదేశంలోనే అతి పెద్ద కుంభకోణం జగనన్న కాలనీలు. పేదలకు ఇళ్లు పేరిట భూముల కొనుగోళ్లలో స్థానిక నాయకులు కోట్లు నొక్కేశారు. ఎకరాకు రూ. 5 లక్షలు పెంచి అమ్ముకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సోషల్ అడిట్ కోసం విజయనగరం జిల్లా గుంకలం గ్రామంలో ఇళ్లను పరిశీలించడానికి వెళ్లినప్పుడు 10 శాతం ఇళ్లు కూడా పూర్తి కాలేదు. లబ్ధిదారులకు ఇస్తున్న 1.80 లక్షలు సరిపోకపోవడం, కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో చాలా మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు.
*ముఖ్యమంత్రిది పబ్లిసిటీ పిచ్చి
ముఖ్యమంత్రికి పబ్లిసిటి పిచ్చి పట్టుకుంది. మన పాస్ బుక్ లపై ఆయన ఫోటోలు వేయించుకుంటున్నాడు. మన ఇంటి గోడలు, సెల్ ఫోన్లపై స్టిక్కర్లు వేయిస్తున్నాడు. వైసీపీ నాయకులకు పబ్లిసిటి పిచ్చి ఉంటే వాళ్ల ఒంటి మీద పచ్చబొట్లు వేయించుకోవాలి కానీ.. మన ఇళ్లు, సర్వే రాళ్లకు స్టిక్కర్లు వేయడం ఏంటి? బీసీల సంక్షేమం కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటిని కార్ల స్టిక్కర్లకే పరిమితం చేశారు. మద్యపాన నిషేధం పేరిట లిక్కర్ పై వేల కోట్ల ఆదాయం సంపాదిస్తున్నారు. అది చాలదు అన్నట్లు లిక్కర్ అమ్మకాలను గ్యారెంటీగా చూపించి రూ. 11 వేల కోట్లు రుణాలు తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఏ మూలన చూసినా ఈ రోజు గంజాయి గుప్పుమంటోంది. గంజాయి మత్తులో యువత చిత్తు అవుతోంది. నివర్ తుపాన్ సమయంలో రైతులకు తక్షణ సాయంగా రూ. 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే దానిని పట్టించుకోలేదు. రైతు భరోసా పేరిట రైతుల మధ్య కులాల చిచ్చు పెట్టారు. మత్స్యకార భరోసా, చేనేత భరోసా పథకాల్లో చాలా మంది అర్హులకు కోతలు పెట్టారు. భవిష్యత్తులో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. అన్ని వర్గాల అభ్యున్నతికి పాడుతుంది” అని అన్నారు.