రోడ్లే వేయలేని ముఖ్యమంత్రి… మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారంట

* అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అయినా పులివెందులలో బస్ షెల్టర్ కట్టలేదు
* వైసీపీ నాయకులు జేబు దొంగల్లా తయారయ్యారు
* పరిశ్రమలను రానివ్వరు… ఉపాధి కల్పించరు
* పాతపట్నం నియోజకవర్గ సమీక్ష సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

మరమ్మతులకు గురైన రోడ్లకు గుంతలు పూడ్చలేని ముఖ్యమంత్రి… మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పడం హాస్తాస్పదంగా ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గం పులివెందులలో కనీసం బస్ షెల్టర్ ఏర్పాటు చేయలేకపోయారని, అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 46 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. నిజంగా ముఖ్యమంత్రి బలమైన నాయకుడే అయితే ఆ ప్రాంత ప్రజలు ఎందుకు ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటారని ప్రశ్నించారు. శనివారం పాతపట్నం నియోజకవర్గం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “పాతపట్నం నియోజకవర్గం అంటే గుర్తొచ్చేది వంశధార నిర్వాసితులు. వంశధార రిజర్వాయర్ కోసం దాదాపు 23 గ్రామాలకు చెందిన 10 వేల కుటుంబాలు నిర్వాసితులుగా మారారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇస్తామని పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి దానికి బదులుగా రూ. లక్ష చొప్పున అదనపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. గిరిజన గ్రామాల్లో కనీస వసతులు లేవు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లాలంటే ఇప్పటికీ డోలీల సహాయంతో వస్తున్నారు. పి.హెచ్.సి.ల్లో సరిపడ వైద్యులు, వైద్య సిబ్బంది లేకపోవడంతో విశాఖపట్నం వెళ్లాల్సిన దుస్థితి ఈ ప్రాంతంలో నెలకొంది.
* ఐఏఎస్ అధికారి ఉండాలి అని ఆనాడే డిక్లరేషన్ ఇచ్చాం
ఉమ్మడి రాష్ట్రానికి సభాపతిగా ఉనప్పుడు గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో నాలుగు మండలాలు ఐటీడీఏ పరిధిలో ఉండాల్సిన మండలాలు. అయితే దురదృష్టవశాత్తు కొత్త జిల్లాల ఏర్పాటుతో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఐటీడీఏ మన్యం జిల్లాకు వెళ్లిపోయింది. ప్రస్తుతం జిల్లాకు ఐటీడీఏ లేని పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో గిరిజనుల స్థితిగతులు, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి ఎమ్మెల్యేలతో కలిసి అరకులో మూడు రోజుల పాటు పర్యటించాం. గిరిజనుల కోసం ప్రత్యేక అరకు డిక్లరేషన్ కూడా ఇచ్చాం. ఐటీడీఏ పీవోగా యంగ్ ఐఏఎస్ ను నియమించాలని డిక్లరేషన్ లో చెప్పాం. యువకుడు అయితే గిరిజన గ్రామాల్లో తిరిగి వాళ్ల సమస్యలు తెలుసుకొని న్యాయం చేస్తారని చెప్పాం. అందుకు తగ్గట్టే యువకులను ఐటీడీఏ పీవోలుగా నియమించారు. ఇప్పుడు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు.
* సొంత సొమ్ము ఇచ్చినట్లు ఫీలవుతున్నారు
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పర్యటించినప్పుడు ఎవరో ఒకరు సాయం కోసం వచ్చినట్లు… ఈయన గారు వెంటనే కారు దిగి సాయం చేసి ఏదో సొంత డబ్బు ఇచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఆయన సహాయం చేస్తున్నది ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అనే విషయం గుర్తించుకోవాలి. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకున్నాం. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున అందించాం. ఇలా కొన్ని కోట్లు వందల కుటుంబాలకు సహాయం అందించాం. ఈయనోమో లక్ష ఇచ్చి సొంత డబ్బులు ఇచ్చినట్లు ఫీలవుతున్నారు. ప్రతిపక్షాలను తిట్టడానికి వారానికో, 15 రోజులకో ఒక మీటింగ్ పెట్టిన ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈయన కూడా జనసేన గురించి మాట్లాడేవారే. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ఐదు నెలల్లోనే భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖపట్నంలో ర్యాలీ చేశారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇందుకోసం పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బు రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చారు. వైసీపీ నాయకులు సొంత పార్టీ పనుల కోసం ఏపీఎస్ ఆర్టీసీని వైఎస్ఆర్ ఆర్టీసీగా మార్చేశారు. జేబు దొంగల్లా తయారై రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాకుండా చేస్తున్నారు. యువతకు ఒక్క ఉద్యోగం కల్పించలేకపోయారు. ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ అంటూ ఊదరగొట్టి … మూడున్నరేళ్లు గప్ చుప్ గా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ హడావుడి చేస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ముఖ్యమంత్రి మూడు రాజధానుల నాటకానికి తెరతీశారు. విశాఖపట్నం రాజధాని కావాలని ఇక్కడ ప్రజలు కోరుకున్నారా? కావాలని మనలో మనకు చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనానికి ఇలాంటి నాయకత్వమే కారణం. కుటుంబ ఆస్తులు పెంచుకోవడం కోసం ఈ ప్రాంతాన్ని వెనుకబాటు తనానికి గురి చేశారు. ఉత్తరాంధ్ర యువతలో భరోసా నింపడానికే జనవరి 12వ తేదీన యువశక్తి అనే కార్యక్రమానికి జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ ప్రాంతంలో వలసలు నిరోధానికి, ఉపాధి కల్పనపై శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కచ్చితమైన ప్రణాళిక ఉంది. ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెరిగేలా, యువతకు ఉపాధి కలిగేలా మన వంతు సాయం అందించాలని ఆయన దృఢ నిశ్చయం తీసుకున్నారు. పార్టీ కోసం నిస్వార్ధంగా కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పార్టీ తరుఫున న్యాయవాది ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నాం” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముత్తా శశిధర్, శ్రీమతి పాలవలస యశస్వి, పెదపూడి విజయ్ కుమార్, కళ్యాణం శివ శ్రీనివాస్, గేదెల చైతన్య తదితరులు పాల్గొన్నారు.