జగన్ బటన్ పని చేస్తే ప్రజలకు ఇన్ని కష్టాలెందుకు?

* కౌలు రైతుల భరోసా యాత్ర స్పందన దెబ్బకు బయటకు వస్తున్న ఆత్మహత్యల లెక్కలు
* ముఖ్యమంత్రిని నిద్రలేపి రోడ్ల పరిస్థితి చూపిద్దాం
* పవన్ కళ్యాణ్ నాయకత్వం ఎంత అవసరమో మండపేట నుంచే శంఖారావం పూరిద్దాం
* స్వచ్ఛ సంకల్పంతో చేసే సాయానికి ప్రకృతి సహకరిస్తుంది
*ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో నాదెండ్ల మనోహర్

మన రాష్ట్ర ముఖ్యమంత్రి కలలు కంటున్నాడు.. సంక్షేమం పేరు చెప్పి ప్రజలను నిలువునా మోసం చేస్తున్నాడు. ఆయన చెప్పిన లెక్క ప్రకారమే రైతులకు రూ.1.27 లక్షల కోట్లు పంచితే, ఇంతమంది కౌలు రైతుల ఆత్మహత్యలు ఎందుకు? వారి కుటుంబాల వేదన ఆవేదన ఎందుకు? అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. గురువారం మండపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “కౌలు రైతుల కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఒక మంచి చట్టాన్ని ఈ ముఖ్యమంత్రి పూర్తిగా నిర్వీర్యం చేశాడు. తన సొంత తెలివితేటలు ఉపయోగించి కౌలు రైతులను నిలువునా నాశనం చేశాడు. ఫలితంగా చట్టం ఎందుకు పనికి రాకుండా పోయింది. రాష్ట్రంలో మొత్తం మీద 30 లక్షల మంది కౌలు రైతులు ఉంటే, ప్రభుత్వం కేవలం 5 లక్షల మందికి సీసీఎల్సీ కార్డులు ఇవ్వడంలోనే ప్రభుత్వం చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుంది. దేశంలోనే కౌలు రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉండడం అత్యంత బాధాకరం. ఆంధ్రప్రదేశ్ కు అన్నపూర్ణగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 60 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం దారుణం.
* మన కార్యక్రమాలు వేదన నుంచి పుట్టినవే
కౌలు రైతుల భరోసా యాత్ర పుట్టడానికి గాని, జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం మొదలుపెట్టడానికి కానీ ప్రజల ఆవేదనే ప్రధాన కారణం. రైతు స్వరాజ్య వేదిక, జనసేన పార్టీ సంయుక్తంగా సమాచార హక్కు చట్టం ద్వారా రాష్ట్రంలో ఎంతమంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని సమాచారం కోరితే తూర్పుగోదావరి జిల్లా నుంచే మొదట సమాచారం వచ్చింది. 41 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. దీనిని పరిశీలించేందుకు అప్పట్లోనే నేను మండపేట వచ్చాను. అయితే బాధిత రైతు కుటుంబ సభ్యులు సైతం రోడ్డు ప్రమాదానికి గురై కాకినాడ ఆసుపత్రిలో ఉంటే, అక్కడికే వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నాను. తర్వాత ప్రతి జిల్లా నుంచి వచ్చిన సమాచారం మాకు ఆవేదనతో కూడిన ఆశ్చర్యాన్ని కలిగించింది. గత మూడేళ్లలో కేవలం 800 నుంచి 1000 మంది వరకు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుని ఉంటారని మేం మొదట అనుకున్నాం. ఐతే మా అంచనాలను మించి మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం రావడం నివ్వెరపరిచింది. దీని కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ సహాయం చేయాలని తలిచారు. దానిలో భాగమే కౌలు రైతుల భరోసా యాత్ర. అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి సొంత అమ్మమ్మ ఊరిలోనూ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుకు మనం సాయం చేశాం. అలాగే జనసేన పార్టీ ప్రజల అర్జీలు స్వీకరించే కార్యక్రమం జనవాణి మొదలు కావడానికి సైతం ప్రకాశం జిల్లాకు చెందిన ఓ దళిత మహిళ తన భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారు అని ఫిర్యాదు చేయడానికి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళితే, కనీసం ఆయన ఆ వృద్ధురాలిని కలవకుండా ముఖం చాటేశారు. ఈ ఘటన జనసేన అధ్యక్షులు వారిని అమితంగా కదిలించింది. ఈ ఆవేదన నుంచి పుట్టిందే జనవాణి కార్యక్రమం. ప్రతిరోజు ఆరు గంటలు కేటాయించి అన్నీ ఫిర్యాదులను క్షుణ్ణంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చదువుతున్నారు. వాటిని పరిష్కరించేందుకు జనసేన పార్టీ యంత్రాంగం కృషి చేస్తుంది. ప్రతి ఫిర్యాదును పరిష్కరించాల్సిందిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి శాఖ అధికారికి ఉత్తరాలు రాస్తున్నారు. ఈ ఆదివారం భీమవరంలోనూ జనవాణి కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఫిర్యాదును పూర్తిస్థాయిలో ఫాలోఅప్ చేసి పరిష్కరించే విధంగా కృషి చేస్తాం.
* సంక్షేమం పేరుతో మోసం చేస్తున్నారు
రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడితే గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతారు.. అలాగే వారికి న్యాయం చేయమని కోరితే మనం చెప్పినవి అన్నీ అబద్ధాలు అని దబాయిస్తారు. ఇది మాత్రమే వైసీపీ నాయకులకు తెలిసిన విద్య. శ్రీ పవన్ కళ్యాణ్ గారి కౌలు రైతుల భరోసా యాత్రకు వస్తున్న స్పందన చూసి… ఇటీవల ప్రభుత్వం రాష్ట్రంలో 850 ఆత్మహత్యలు జరిగినట్లు అధికారికంగా వెల్లడించింది. రైతులకు ఏమాత్రం ప్రభుత్వం ఉపయోగపడడం లేదు. సబ్సిడీలు తీసేశారు. ఎరువులు ఇవ్వడం మానేశారు. కేవలం కౌలు రైతుల్లో 19 శాతం మందికే కార్డులు అందాయి. కౌలు రైతుల భరోసా యాత్రకు అనంతపురం నుంచి వచ్చిన 26 ఏళ్ల యువ కౌలు రైతు తన వంతు సాయంగా రూ.55 వేలు అందించాడు. తన తోటి రైతులకు సాయం చేయాలని భావించడం గొప్ప విషయం. రైతుల భరోసా యాత్ర ఎంతోమందిని కదిలిస్తోంది. సాయం కోసం ఎదురుచూసే కౌలు రైతుల కుటుంబాలకు ఒక భరోసానిస్తోంది. ఏమైనా అంటే బటన్ నొక్కాను.. అద్భుతాలు జరుగుతున్నాయి.. ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని చెబుతున్న ముఖ్యమంత్రి ఎంతమంది కౌలు రైతుల కుటుంబాలకు సాయం అందిందో సమాధానం చెప్పాలి.
* ముఖ్యమంత్రిని నిద్ర లేపుదాం
రాష్ట్ర రోడ్ల పరిస్థితి పై నిద్రలో జోగుతున్న ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డిని జనసేన పార్టీ మరోసారి చేపట్టబోయే డిజిటల్ క్యాంపైన్ ద్వారా నిద్ర లేపుదాం. గత సెప్టెంబరులో జనసేన పార్టీ రోడ్ల పరిస్థితి పై నిర్వహించిన రాష్ట్రవ్యాప్త క్యాంపైన్ జాతీయ స్థాయిలో సంచలనం అయింది. 1.70 కోట్ల మంది దానిలో పాల్గొన్నారు. జాతీయ మీడియాలోనూ ఒక రాజకీయ పార్టీ వినూత్నంగా చేపట్టిన నిరసన కార్యక్రమానికి మంచి ఆదరణ వచ్చింది. అప్పుడు కళ్ళు తెరిచిన రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే రోడ్లు బాగు చేస్తామని చెప్పింది. బడ్జెట్లో ఏకంగా రూ.27 వేల కోట్లు రోడ్ల గురించి ఖర్చు పెడతామని చెప్పారు. ఇటీవల రోడ్లు వేసేందుకు రూ. 6000 కోట్ల అప్పు తెచ్చారు. జూలై 15వ తేదీ నాటికి రాష్ట్రంలోని రోడ్లను పూర్తిస్థాయిలో బాగు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గట్టిగా చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పిన తేదీ పూర్తికావచ్చిన తరుణంలో జనసేన పార్టీ రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిని మరోసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఈనెల 15, 16 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుడుతోంది. దీనిలో ప్రతి ఒక్క జన సైనికుడు పాల్గొని రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిని ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ అని మేల్కొలపాలి. ఇది మన అందరి బాధ్యత.
* జన సైనికులు జననాయకులు అయ్యారు
ఎక్కడ కార్యక్రమం నిర్వహించినా క్రమశిక్షణతో పాటు, సేవా భావం కలిగిన జనసైనికులు జనసేన పార్టీకి సొంతం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో మండపేట నుంచి ఈ రాష్ట్రం మొత్తం తెలిసేలా అద్భుతమైన కార్యక్రమాన్ని శనివారం చేపడదాం. ప్రతి బాధిత రైతు కుటుంబాన్ని గౌరవించుకుందాం. వారికి అవసరమైన సహాయాన్ని అందించి జననాయకులుగా నిరూపిద్దాం. మన కష్టం కాదు కదా అనుకోకండి రైతు కష్టం మనందరిది అనుకోండి. స్వచ్ఛమైన సంకల్పంతో, నిజాయతీతో చేస్తున్న సభకు ప్రకృతి కూడా కచ్చితంగా సహకరిస్తుంది అని ఆశిద్దాం. పోలీసు వారికి సహకరిద్దాం. వారి నుంచి సహకారం ఆశిద్దాం. అలా కాకుంటే కనుక సభను ఎవరూ అడ్డుకోలేరు. ఆపలేరు. ఆదర్శవంతంగా సభను విజయవంతం చేద్దాం” అన్నారు. మండపేట అసెంబ్లీ జనసేన ఇంచార్జి వేగుళ్ల లీలాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పి.ఎ.సి. సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, పార్టీ నేతలు మేడా గురుదత్ ప్రసాద్, శెట్టిబత్తుల రాజబాబు, పోలిశెట్టి చంద్రశేఖర్, బండారు శ్రీనివాస్, అత్తి సత్యనారాయణ, పాటంసెట్టి సూర్యచంద్ర, మర్రెడ్డి శ్రీనివాస్, వై.శ్రీనివాస్, తుమ్మల బాబు, శ్రీమతి పోలాసపల్లి సరోజ, శ్రీమతి గంటా స్వరూప, వాసిరెడ్డి శివప్రసాద్, బోగిరెడ్డి గంగాధర్, శ్రీమతి చల్లా లక్ష్మీ, శ్రీమతి ముత్యాల జయలక్ష్మీ, సంగిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
* మున్సిపల్ కార్మి కుల సమస్యలపై వినతి పత్రం
రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని గురువారం కలిసి వినతి పత్రం సమర్పించారు. నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన శ్రీ జగన్ రెడ్డి తమను పూర్తిగా ముంచేసారని, కనీసం తమ సమస్యలు చెప్పుకునేందుకు కూడా సమయం కేటాయించడం లేదని నాదెండ్ల మనోహర్ గారి ముందు పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందని, కాంట్రాక్టు కార్మికులకు సమయానికి వేతనాలు కూడా రావడంలేదని వారు తమ సమస్యలను మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.