చారిత్రాత్మక నిర్ణయం తీసుకొనే సమయంలో అండగా నిలవాలి

* తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావడం దశాబ్దాల కల
* శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం దూసుకుపోతోంది
* కుత్బుల్లాపూర్ ఎన్నికల ప్రచార సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

‘దశాబ్ద కాలం తరవాత తెలంగాణలో బలమైన రాజకీయ పక్షంగా జనసేన – బీజేపీ కలిసి వస్తున్నాయి. తెలంగాణ అంటే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి ఒక్కటే కాదు.. మారుమూల ప్రాంతాలు సైతం తెలంగాణలో అభివృద్ధి దిశగా పయనించాలి. ఇలా పయనించాలి అంటే తెలంగాణలో బలమైన డబుల్ ఇంజన్ సర్కారు రావాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శ్రీ కూన శ్రీశైలం గౌడ్ తో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ లో యువతీయువకులు, పెద్దలు జనసేనానికి నీరాజనాలు పలికారు. గజమాలలతో స్వాగతించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “2014 ముందు దేశ వాణిజ్య రాజధాని ముంబైలో చొరబడి మూడు రోజులపాటు తీవ్రవాదులు సాగించిన మారణ హోమం దేశ ప్రజలందరినీ కదిలించింది. ఎన్నో తీవ్రవాదుల దాడులు దేశంలో అశాంతిని, అభద్రతను పెచ్చుమీరేలా చేశాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చాక శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో శత్రు దుర్భేద్యమైన దేశంగా తయారయింది. శత్రు దేశాలు భయపడేలా దేశ అంతర్గత భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో విదేశీ పెట్టుబడులు భారతదేశంలోకి వెల్లువలా వచ్చాయి. ప్రపంచంలోనే భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. ఇది కచ్చితంగా ఓ బలమైన నాయకుడు సాధించిన విజయం. తెలంగాణలో సైతం శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బలమైన నాయకత్వం రావాలి. డబుల్ ఇంజన్ సర్కారుతో తెలంగాణ మొత్తం అభివృద్ధి దిశగా పయనిస్తుంది. జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. దానికి జన సైనికులు, వీర మహిళలు దన్నుగా నిలబడతారని ఆశిస్తున్నాను.
* సామాజిక న్యాయం అన్ని వర్గాలకు అందాలి
దశాబ్దాలుగా రాజ్యాధికారం కోసం బీసీలు వేచి చూస్తున్నారు. రాజ్యాధికారం అందని ద్రాక్షగా మారిన వెనకబడిన వర్గాలకు తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ ప్రకటించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎన్నో రాష్ట్రాలకు వెనకబడిన వర్గాల నుంచి ముఖ్యమంత్రులు చేసిన భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సైతం బీసీలకు రాజ్యాధికారం ఇచ్చేందుకు ముందుకు రావడం శుభ పరిణామం. ఇలాంటి చారిత్రాత్మక సమయంలో కచ్చితంగా బీజేపీకి అండగా నిలిచి అధికారంలోకి తీసుకురావాలి. సామాజిక న్యాయం అన్ని వర్గాలకు సమానంగా దక్కినప్పుడే రాజ్యాధికార ఫలాలు సమానంగా అందరికీ అందుతాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు మంచి నాయకుడు. సమస్య వస్తే బలంగా పోరాడగలిగే సత్తా ఉన్న నాయకుడు. ఆయన గెలుపు కోసం జన సైనికులు, వీర మహిళలు కష్టపడి పని చేసిన తీరు అభినందనీయం. జనసేన నాయకుడు శ్రీ సతీష్ మనస్ఫూర్తిగా శ్రీశైలం గౌడ్ గారి గెలుపు కోసం కృషి చేయడం రెండు పార్టీల ఐక్యతను తెలియజేస్తుంది. ఇదే స్ఫూర్తితో బీజేపీతో భవిష్యత్తులోనూ ప్రయాణం ఉంటుంది. రెండు పార్టీల కార్యకర్తలు ఐకమత్యంతో సమష్టి కృషితో ఎన్నికల్లో విజయం దిశగా పోరాడాలి” అన్నారు.
* ఎల్.బి. నగర్ నియోజకవర్గం సభలో..
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ఎల్.బి. నగర్ నియోజకవర్గం వనస్థలిపురం ప్రచార సభలోను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ

 “తెలంగాణ ఎన్నికల్లో జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు పూర్తి స్థాయిలో అండగా నిలబడండి. తెలంగాణలో మార్పు మొదలు కావాలి. సామాజిక న్యాయం పూర్తిగా జరిగేలా బాధ్యత తీసుకుంటాం. శ్రీ సామ రంగారెడ్డి గారికి జన సైనికులు, వీర మహిళలు అండగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మీ ముందు ఉంటాను. జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థిని గెలిపించినట్లే తెలంగాణ నుంచి సమగ్ర అభివృద్ధిని కలిసి సాధిద్దామ”న్నారు.
* జయహో జనసేనాని
కుత్బుల్లాపూర్, వనస్థలిపురం ఎన్నికల సభలకు వెళుతున్న సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అశేష జనావళి అపూర్వ స్వాగతం పలికారు. యువత పెద్ద ఎత్తున తరలి రావడంతో మొత్తం రోడ్లు బ్లాక్ అయ్యాయి. ఇసుకేస్తే రాలనంత జన సందోహం వివిధ ప్రాంతాల నుంచి రావడంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన కారు పైకి ఎక్కి అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు. దారంతా జన సందోహంతో భాగ్యనగరం కొత్త కళ సంతరించుకుంది.