గుడ్ మార్నింగ్ సీఎం సార్… ఈ రోడ్లు చూడండి

•ఛిద్రమైన రహదారి వీడియో… ప్రత్యేక వ్యంగ్య చిత్రం ట్వీట్ చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో రహదారులు అధ్వాన్న స్థితిలో ఉన్న విషయమై ముఖ్యమంత్రిని మేల్కొలిపే #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్ లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం 8 గం.కు పవన్ కళ్యాణ్ గారు రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళే రోడ్డు దుస్థితిని తెలిపే వీడియోను ట్విటర్ లో పోస్టు చేశారు. ఈ వీడియోలో కొత్తపేట దగ్గర ఉన్న గుంతలు, అక్కడి పరిస్థితి తెలుస్తోంది. ఈ వీడియోను పోస్టు చేస్తూ #GoodMorningCMSir అని హ్యాష్ ట్యాగ్ వేశారు.
•రోడ్డు మీద ప్రయాణం సర్కస్ ఫీట్
రాష్ట్రంలో రోడ్డు ప్రయాణం ఎంత నరకప్రాయంగా మారిందో తెలియచేసేలా ఉన్న వ్యంగ్య చిత్రాన్ని పవన్ కళ్యాణ్ గారు పోస్టు చేశారు. హెలికాప్టర్ లో వెళ్తున్న సీఎం రోడ్డు మీద ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వాళ్ళను వింతగా చూస్తుంటారు. ఒక్కో గోతిలో నుంచి గాల్లో ఎగిరి అంత దూరాన మరో గోతిలో ఉన్న నీళ్ళలో పడుతుంటే వారి వాహనాలు గాల్లో ఉన్నట్లు ఆ వ్యంగ్య చిత్రం ఉంది. రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణిస్తున్నవారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఆ కార్టూన్ తెలియచేస్తుంది.