అధికార పక్షం అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?

•జనసేన పార్టీ ఎస్సీ నాయకుడు వర్లకొండ సురేష్ పై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలి
జనసేన పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి, ఎస్సీ నేత వర్లకొండ సురేష్ గోరంట్ల ప్రాంతంలోని అధికార వైసీపీ నాయకుల అక్రమాలు, భూ దందాలపై నిలదీసినందుకు దాడులకు తెగబడటం పాలకుల దుర్మార్గాన్ని తెలియచేస్తోందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. పెనుకొండ నియోజకవర్గం గోరంట్లలో అదికారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ చేస్తున్న భూ ఆక్రమణల గురించి ప్రశ్నించినందుకు శ్రీ సురేష్, ఇతర జన సైనికులపై పోలీసులు కేసులు బనాయించారు. దీనిపై పార్టీ నాయకులు నిరసన తెలియచేస్తే విడిచిపెట్టారు. ఈ రోజు ఉదయం సురేష్, ఆయన కుమారుడిపై అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా దాడి చేసి గాయపరచడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన పాలకులు రాక్షస రాజ్యాన్ని తలపించేలా ఎస్సీలపైనా, బడుగు బలహీన వర్గాలపైనా, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే వారిపైనా దాడులకు తెగబడుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై నిష్పక్షపాతంగా వ్యవహరించి సురేష్, ఆయన కుమారుడిపై దాడి చేసినవారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటన గురించి తెలియగానే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు టి.సి.వరుణ్ లతో మాట్లాడి బాధితులకు అండగా నిలవాలనీ, న్యాయ సహాయం అందించాలని తెలియచేశాం అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.