వైసీపీ పిచ్చి ప్రేలాపనలు పట్టించుకోం

•నిత్యం ప్రజా క్షేమం కాంక్షించే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్
•పాలకులకు చిత్తశుద్ది ఉంటే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి
•పల్నాడు ప్రాంతంలోనే కౌలు రైతు భరోసా యాత్ర
•క్రోసూరులో మీడియాతో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

వైసీపీ పిచ్చి ప్రేలాపనలు పట్టించుకునే తీరిక జనసేన పార్టీకి లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. కుటుంబాన్ని, సినిమాలను వదిలి 365 రోజులు ప్రజా క్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారని అన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి సొంత డబ్బు వెచ్చించి సేవ చేస్తున్న నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షుడేనని తెలిపారు. రాబోయే రోజుల్లో పల్నాడు ప్రాంతంలోనే జనసేన కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రికి, ఆ పార్టీ నాయకులకు ప్రజా సంక్షేమం పట్ల ఏ మాత్రం నిజాయతీ, చిత్తశుద్ది ఉన్నా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలవాలని, పవన్ కళ్యాణ్ గారి మాదిరి వారి కుటుంబాల్లో పిల్లల చదువులకు అండగా నిలబడాలని కోరారు. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్రంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయతీపరుడైన నాయకుడు మరొకరు లేరు. మా నిజాయతీయే మాకు ధైర్యం. వైసీపీ నాయకుల చౌకబారు విమర్శలు పట్టించుకోం. గతంలో మంత్రి పదవులు కాపాడుకోవడానికి విమర్శలు చేశారు. వారు చేసే విమర్శల్లో వీసమెత్తు నిజాయతీ లేదు. వైసీపీ నాయకుల కల్లబొల్లి కబుర్లు ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. రాబోయే ఆరు నెలల కాలం జనసేన పార్టీ నిత్యం ప్రజల్లో ఉండి, ప్రజల పక్షాన పోరాటం చేసేలాగా కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ఇప్పటికే జనవాణి పేరిట అద్భుతమైన కార్యక్రమాన్ని గడచిన రెండు వారాలు నిర్వహించాం. నిన్నటి కార్యక్రమంలో 539 అర్జీలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చాయి. ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ఆయన మీద విమర్శలు చేసే ముఖ్యమంత్రికి, వైసీపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే పవన్ కళ్యాణ్ గారిలా జిల్లాల్లో తిరిగి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు మీరు హామీ ఇచ్చిన రూ. 7 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి మాదిరి ఆ రైతుల బిడ్డల చదువులకు అండగా నిలబడాలి. స్థానికంగా పార్టీ బలోపేతం దిశగా జనసైనికులు అద్భుతంగా పని చేస్తున్నారు. పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు వినే విధంగా పని చేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో పార్టీ రోజు రోజుకీ బలపడుతోంది. రాబోయే రోజుల్లో ఇదే ప్రాంతంలో రైతు భరోసా యాత్ర చేపడతాం” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు శ్రీ సయ్యద్ జిలానీ, శ్రీ నయూబ్ కమాల్, వడ్రాణం మార్కండేయబాబు, బేతపూడి విజయ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.