చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యం

* జనసేన పి.ఎ.సి. సభ్యులు కొణిదెల నాగబాబు
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం ‘జనసేన క్రియాశీలక వీరమహిళల రాజకీయ అవగాహన, పునశ్చరణ తరగతులు’ నాగబాబు ప్రారంభించారు. వీర మహిళలు జ్యోతి ప్రజ్వలన చేశారు. తొలి విడతగా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో 5 నియోజక వర్గాలు, విజయవాడ నగర పరిధిలోని మహిళ క్రియాశీలక సభ్యులకు ఈ తరగతులు చేపట్టారు. ఈ సందర్భంగా నాగబాబు గారు మాట్లాడుతూ “మహిళలకు రాజకీయ వ్యవహారాల్లో గౌరవప్రదమైన స్థానం అందించాలని ఆకాంక్షించే పవన్ కల్యాణ్ గారు మహిళల కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీర మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో అన్ని రాజకీయ పార్టీలు మహిళా సాధికారత గురించి ఎక్కువగా మాట్లాడుతున్నానయి కానీ దానిని ఆచరణలో చేసి చూపే వారు చాలా తక్కువ. సంప్రదాయ రాజకీయ పార్టీల్లో మహిళలను ప్రచారాల కోసం ఉపయోగించుకునే వారు ఎక్కువయ్యారు. జనసేన పార్టీలో ప్రతీ మహిళను వీరమహిళ అనే పేరుతో గౌరవించుకునే సంస్కృతి ఉంది. మనకు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అమ్మ మొహం చూడగానే అన్నీ మరచిపోతాం, మనకు తోబుట్టువులు లాంటి మహిళలు ఓదార్పు ఇస్తారు. అమరావతి ఉద్యమంలో కీలక భుమిక పోషించిన గౌరవం మహిళలకు దక్కుతుంది. మహిళల వస్త్రధారణ మీద కామెంట్ చేయడం చాలా మందికి ఫ్యాషన్ అయింది. చూసే కళ్ళను బట్టి ఆలోచన ఉంటుంది. మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉన్నద”ని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్ ఈ కార్యక్రమానికి స్వాగతం పలికారు. పార్టీ కోశాధికారి ఎ.వి. రత్నం పాల్గొన్నారు. పార్టీ అధికార ప్రతినిధి త్రినాథ్, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్, సీనియర్ జర్నలిస్ట్ శ్యాం సుందర్, విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్, పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్, పార్టీ అధికార ప్రతినిధి కోటంరాజు శరత్ కుమార్ వివిధ అంశాలపై వీర మహిళలకు అవగాహన కల్పించారు.