జగన్ రెడ్డి పాలనలో ప్రతి కుటుంబం నష్టపోతోంది

•మూడేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగింది లేదు
•జనసేన రైతులకు అండగా నిలబడితే చూసి ఓర్వలేకపోతున్నారు
•ప్రతి ఇంటా మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైంది
•ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన సమయం వచ్చింది
•పెదకూరపాడు నియోజకవర్గం బయ్యవరంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

జగన్ రెడ్డి పాలనలో ప్రతి ప్రాంతం అభివృద్ధికి దూరం అవుతోందని, ప్రతి కుటుంబం నష్టపోతోందనీ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం పెట్టిన పథకాలు మినహా మూడేళ్ల పాలనలో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ప్రతి ఇంటా మార్పు రావాల్సిన సమయం ఆసన్నమయ్యిందని తెలిపారు. సోమవారం, గుంటూరు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించారు. లింగాపురం, కాశిపాడు, బయ్యవరం గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన జెండా స్థూపాలను ఆవిష్కరించారు. లింగాపురంలో డా. అంబేడ్కర్, శ్రీ వంగవీటి రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. తదుపరి కాశిపాడులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరించారు. గ్రామస్తులను, రైతులను కలుసుకున్నారు. బయ్యవరంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. రెండు ప్రదేశాల్లో జెండా ఆవిష్కరించారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “గత ఏడాది కాలం నుంచి రాష్ట్రంలో రహదారుల దుస్థితి గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి రూ. 2 వేల కోట్లతో రోడ్లు మరమ్మతులు చేయించామని చెప్పారు. ఎక్కడా ఒక్క గంప మట్టి కూడా రోడ్డు మీద వేసింది లేదు. గుంతలు పూడ్చింది లేదు. ముఖ్యమంత్రి ప్రకటనను ఛాలెంజ్ గా తీసుకుని మరోసారి జనసేన పార్టీ తరఫున కార్యక్రమం చేయబోతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే గ్రామంలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి బాధ కలిగింది. రైతుల ఆత్మహత్యలు చూసి తట్టుకోలేక శ్రీ పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులు రూ. 5 కోట్లు కేటాయించి బాధిత రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున సాయం చేస్తున్నారు. జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమాలు చూసి తట్టుకోలేక మన నాయకుడి మీద పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు.
* ఆ పార్టీ ఓ సర్కస్ కంపెనీ
మొన్న ప్లీనరీ ఒక సర్కస్ కంపెనీ వ్యవహారం మాదిరి నిర్వహించారు. రాజకీయ లబ్ధి మినహా ఈ ప్రభుత్వం పథకాల వల్ల ఏ ఒక్కరికీ ఒరిగిందేమీ లేదు. ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించింది లేదు. మహిళల అకౌంట్ల నుంచి రూ. 2 వేల కోట్లు కాజేశారు. రైతు భరోసా కేంద్రాలు సొంత పార్టీ కార్యకర్తల అభివృద్ధికి తప్ప రైతులకు ఉపయోగపడింది లేదు. వరి నుంచి జొన్న వరకు ఏ రైతుకీ కనీసం విత్తనాలు కూడా పంపిణీ చేసింది లేదు. ఈ ప్రభుత్వం ఎక్కడా నిజాయితీగా పని చేసింది లేదు. మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి కార్యకర్త నిజాయితీగా ఉత్సాహంతో పని చేయండి. రాబోయే ఏడాది ఎంతో కీలకం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చేద్దాం. ఈసారి భారీ మెజారిటీతో జనసేన విజయం సాధించడం ఖాయమ”న్నారు.
•అమరావతిలో ట్రాక్టర్ల స్వాగతం
అంతకు ముందు పెదకూరపాడు నియోజకవర్గ పర్యటనకు వచ్చిన నాదెండ్ల మనోహర్ గారికి అమరావతిలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ట్రాక్టర్లతో అన్నదాతలు జనసేన తోరణాలు కట్టుకుని మరీ ఎదురురాగా, బాణాసంచా పేలుళ్లు, పూల వర్షంతో జనసైనికులు నియోజకవర్గంలోకి ఆహ్వానించారు. గ్రామ గ్రామాన ఆడపడుచులు జోరు వానలోనూ ఎదురొచ్చి హారతులు పట్టారు.
•రహదారిపై గోతుల పరిశీలన
పర్యటనలో భాగంగా అమరావతి-లింగాపురం గ్రామాల మధ్య రహదారి గోతుల మయంగా మారి ఉండడాన్ని శ్రీ మనోహర్ గారు గమనించారు. వాహనం నుంచి దిగి రహదారిపై ఉన్న భారీ గోతులు పరిశీలించారు. రహదారిపై ఎప్పటి నుంచి గోతులు ఉన్నాయని స్థానికులను ఆరా తీశారు. వాహనాల రాకపోకలకు గోతుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు సయ్యద్ జిలానీ, నయూబ్ కమాల్, వడ్రాణం మార్కండేయ బాబు, జిల్లా కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.