కొత్త ప్రభుత్వంలో జగన్ కోర్టుల చుట్టూ తిరగాల్సిందే

* జగన్ అక్రమాలకు ఏ మతం భూములైనా ఒక్కటే
* జాగా కనిపిస్తే జగన్ అండ్ కో వాలిపోతుంది
* గెలిపించిన జనాన్ని వదిలేసి పారిపోతాను అనడానికి ఎంపీకి సిగ్గుండాలి
* వైసీపీ అక్రమాలకు ఏ వాస్తూ సహకరించదు
* ఉత్తరాంధ్ర దోపిడీలపై విద్యార్థి లోకం తిరగబడాలి
* సుప్రీం కోర్టులో కేసులు ఉన్నా వైసీపీకి పట్టదు
* సిరిపురంలో వివాదాస్పద సీబీసీఎన్సీ భూములను పరిశీలించిన పవన్ కళ్యాణ్

‘జగన్ చేస్తున్న అక్రమాలు, భూ కబ్జాలు ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకుంటాం. ప్రతి దానిపైనా కొత్త ప్రభుత్వంలో విచారణ ఉంటుంది. రోజూ జగన్ కోర్టులు చుట్టూ తిరగడం ఖాయం. అన్ని అక్రమాలు జగన్ చేస్తున్నాడు’ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. విశాఖపట్నం సిరిపురం జంక్షన్లో అత్యంత వివాదాస్పదమైన సీబీసీఎన్సీ భూములను శనివారం సాయంత్రం శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పరిశీలించారు. వందల కోట్ల రూపాయల విలువైన భూముల్లో జరుగుతున్న పనులను, ఆ స్థలాన్ని పరిశీలించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. ఈ సందర్భంగా సిరిపురం జంక్షన్లో నడి రోడ్డుపైనే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “జగన్ అక్రమాలకు, కబ్జాలకు మతం, కులంతో సంబంధం లేదు. సింహాచలం భూముల దగ్గర నుంచి మసీదుల భూములు, క్రిస్టియన్ మిషనరీ భూములు ఏదైనా మింగేయడమే. అత్యంత విలువైన భూముల అక్రమం గురించి జనవాణి కార్యక్రమంలో రాష్ట్రీయ క్రిస్టియన్ పోరాట సమితి ప్రతినిధులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఎంతో విలువైన మిషనరీ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయని దాని గురించి మాట్లాడాలని చెప్పారు. దీనిపై నేను పూర్తి స్థాయి విషయాలు తెలుసుకొని పరిశోధన చేసిన తర్వాత ఇక్కడ జరుగుతున్న అక్రమాలను స్వయంగా పరిశీలించాలని వచ్చాను. ఈ భూములపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పనులు జరుగుతున్నాయి. చట్టంపట్ల ఎలాంటి బెరుకు, భయం, గౌరవం లేకుండా అత్యంత విలువైన స్థలాన్ని ఆక్రమిస్తున్నారు. సుమారు 1800 గజాల పైగా మిషనరీలకు చెందిన ఈ స్థలం ఇప్పుడు బహిరంగంగా అన్యాక్రాంతం అవుతోంది. దీనికి అధికారమే అసలు పెట్టుబడి.
* ఎంపీ కుటుంబానికే రక్షణ లేదు
సుందరమైన, ప్రశాంతమైన విశాఖ నగరాన్ని నేరగాళ్లకు అడ్డాగా మార్చారు. విశాఖ పార్లమెంట్ సభ్యుడి కుటుంబానికి సైతం రక్షణ లేదు. ఈ స్థలం వివాదం గురించి కొందరు రౌడీ షీటర్లు ఎంపీ కుటుంబ సభ్యులను బంధించి అనేక రకాలుగా హింసించారు. సొంత కుటుంబాన్ని కాపాడుకోలేని ఎంపీ.. అది మా పార్టీకి సంబంధించిన విషయం అని చెప్పడం సిగ్గుచేటు. సొంత కుటుంబాన్నే కాపాడుకోలేని ప్రజాప్రతినిధి ప్రజలను ఎలా కాపాడుతాడు? తన వ్యాపారాలను హైదరాబాద్ కు మారుస్తానని, ఇక్కడ నుంచి పారిపోతానని చెప్పడానికి సిగ్గుండాలి. నువ్వు అంత భయపడితే రాజీనామా చేయ్… ఎన్నికలకు వెళ్దాం. నీకు ఓట్లు వేసిన ప్రజలను వదిలేసి వారి గురించి పట్టించుకోకుండా పక్క రాష్ట్రం పారిపోతానని ఎలా చెప్తావ్? ప్రజలు కూడా ఇలాంటి వారికి ఓట్లు వేసినందుకు ఆలోచించాలి. విశాఖలో దొరికిన భూమిని దొరికినట్లు కాచేస్తున్న వైసీపీ నేతలను ఇక్కడ నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. గతంలో తెలంగాణ ప్రాంతంలో ఈ వర్గం చేసిన దోపిడీలను భరించలేక అక్కడ ప్రజలు చైతన్యవంతులై తన్ని తరిమేశారు. ఇప్పుడు వీరి కన్ను ఉత్తరాంధ్ర ప్రాంతంపై పడింది. అత్యంత విలువైన విశాఖపట్నం భూములను అడ్డగోలుగా దోచేస్తున్నారు. రాజకీయ చైతన్యం, పోరాట చైతన్యం కలిగిన ఉత్తరాంధ్ర ప్రజలు ఈ దాష్టీకాల మీద పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ సాధనలో ఉస్మానియా విద్యార్థులు ఎంతగా తెగించి కొట్లాడారో… ఉత్తరాంధ్రలో జరుగుతున్న పాలకుల దోపిడీ మీద ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు చైతన్యవంతులై పోరాడాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధంగా రావాల్సిన టీడీఆర్ బాండ్లను అధికారం అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. 2047 లో రావాల్సిన బాండ్లను అప్పుడే తెచ్చుకొని వాటిని వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని చోట్ల టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలు జరిగాయి. తణుకులో బయటపడిన టీడీఆర్ బాండ్ల తరహా అక్రమాలు అన్ని చోట్ల ఉన్నాయి.
* కబ్జా చేసిన స్థలానికి వీధిపోటు అని వీఐపీ రోడ్డుని మూసేశారు
సిరిపురం జంక్షన్ లో వివాదాస్పద సీబీసీఎన్సీ భూములను అన్యాయంగా అక్రమించడమే కాకుండా ఆ భూములు వీధి పోటు పేరుతో కీలకమైన వీఐపీ రహదారిని సైతం మూసేశారు. చేసేదే తప్పు అయితే మళ్లీ దానికి వీధి పోటు అని ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు కల్పించారు. మీరు చేస్తున్న తప్పులకు ఏ పోటు, ఏ వాస్తు మిమ్మల్ని ఆపలేదు. మీ అక్రమాలకు ఏ వాస్తూ సహకరించదు. ప్రజల ఆస్తులను రక్షించడానికి జనసేన ప్రజల తరఫున నిత్యం పోరాడుతుంది.
* విశాఖపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది
దేశానికి రక్షణపరంగా విశాఖ అత్యంత కీలకమైన ప్రాంతం. ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం మీద కేంద్ర పెద్దలకు ప్రత్యేక సమాచారం ఉంది. నేరాలు, భూకబ్జాలు, దోపిడీ అన్ని విషయాల మీద కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారి వద్ద పూర్తి సమాచారం ఉంది. కచ్చితంగా విశాఖను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి స్థానిక ప్రజల్లో చైతన్యంతో పాటు యువత పాలకుల దాష్టీకాలకు ఎదురు తిరగాలి. తుపాన్ల నుంచి రక్షణ ఇచ్చే రుషికొండను పూర్తిగా కొల్లగొట్టిన తీరు మనకు కనిపిస్తూనే ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖలో రోజుకో కబ్జా బయటపడుతూనే ఉంది. ఇక్కడ జరుగుతున్న విషయాలను జనసేన పార్టీ సైతం బాధ్యతగా కేంద్రానికి తెలియజేస్తుంది” అన్నారు.
* పరిశీలనపై ఆంక్షలు
క్రైస్తవ ఆస్తుల కబ్జా, రోడ్డు మూసివేత పరిశీలన సందర్భంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. స్థలాన్ని లోపలికి వెళ్ళి చూడరాదని చెప్పడంతో – సాంఘిక సంక్షేమ శాఖకి చెందిన స్థలం వైపు నుంచి పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. ఈ స్థలాన్ని సైతం కబ్జా చేస్తే జనసేన పోరాటంతో వెనక్కి తగ్గారు. ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందుకు సంబంధించిన అక్రమాలను, చర్చి ఆస్తులపై టీడీఆర్ తీసుకున్న తీరునీ జీవీఎంసీ కార్పొరేటర్ మూర్తి యాదవ్, ఇతర నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు టి. శివశంకర్, సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల సందీప్, కళ్యాణం శివ శ్రీనివాస్, శ్రీమతి భీసెట్టి వసంత లక్ష్మి, పంచకర్ల రమేష్ బాబు, మూగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.