విశాఖలో జనసేనానికి జనహారతి

• శనివారం పెందుర్తి నియోజకవర్గం వెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్
• బీచ్ రోడ్డు నుంచి సుజాత నగర్ వరకు అడుగడుగునా జనసేన శ్రేణుల స్వాగతం
• సమస్యలు చెప్పుకొన్న జన సామాన్యం
• సమస్యలు వింటూ సాగిన శ్రీ పవన్ కళ్యాణ్
• ప్రతి సమస్యపై గళం విప్పుతానని హామీ

వారాహి విజయ యాత్రలో భాగంగా విశాఖలో పర్యటిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రతి అడుగులో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు బయటికి వస్తున్నారంటే ఆ ఆంక్షల కంచెలు దాటుకుని వేలాదిగా రోడ్ల మీదకు వస్తున్నారు. శనివారం పెందుర్తి నియోజకవర్గం, సుజాత నగర్ లో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు శ్రీమతి కోటగిరి వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన జనసేనానికి జనం ప్రతి అడుగులో ఘన స్వాగతం పలికారు. బీచ్ రోడ్డు నుంచి పోలీసులు తీవ్ర ఆంక్షలు అమలు చేసినప్పటికీ పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. కైలాసగిరి, సింహాచలం, వేపగుంట, సుజాత నగర్ ప్రాంతాల్లో జనసేన శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జేజేలు పలికారు.
• బారులు తీరిన జనం
సింహాచలం, వేపగుంట, సుజాతనగర్ కూడళ్లలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. హల్లో ఏపీ.. బైబై వైసీపీ నినాదాలతో హోరెత్తించారు. సింహాచలం – అడవివరం వద్ద ఆడపడుచులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కోసం ఆప్యాయంగా జామ పండ్లు తీసుకురాగా వాటిని స్వీకరించారు. తనకోసం పండ్లు తెచ్చిన ఆడపడుచులను ఆప్వాయంగా పలుకరించారు. సుజాతా నగర్ ప్రధాన రహదారి నుంచి శ్రీమతి వరలక్ష్మి ఇంటి వరకు అపార్ట్ మెంట్ల వాసులంతా శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాక సందర్భంగా రోడ్ల మీదకు వచ్చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తమ సెల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోల్లో బంధించేందుకు పోటీ పడ్డారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు కదిలారు.
• సమస్యలపై వినతుల వెల్లువ
సుజాతనగర్ కు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్న విషయం తెలుసుకున్న విశాఖ వాసులు ఆయనకు తమ సమస్యలు చెప్పుకునేందుకు ముందుకు వచ్చారు. ప్ల కార్డుల ద్వారా సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. సింహాచలం వద్ద సింహాచలం పంచ గ్రామాల సమస్య పరిష్కరించాలంటూ బాధిత ప్రజలు ప్లకార్డులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి వాహన శ్రేణి వద్దకు వచ్చారు. తమ సమస్యపై వినతిపత్రం అందచేశారు. పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి హామీ ఇచ్చారు. వేపగుంట వద్ద ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులు తమకు న్యాయం చేయాలంటూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. గ్యాస్ లీక్ బాధితులకు పరిహారం ఇవ్వలేదని, మా గ్రామ యువతపై పెడుతున్న అక్రమ కేసులు ఎత్తివేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బ్యానర్లు ప్రదర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరారు. గ్రీన్ టాక్స్ పేరిట జరుగుతున్న దోపిడిని శ్రీ అప్పలరాజు అనే ట్రక్కు డ్రైవర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. పక్క రాష్ట్రం తమిళనాడులో కేవలం రూ. 200, తెలంగాణలో రూ.500 కట్టించుకుంటుంటే, మన రాష్ట్రంలో రూ. 6660 ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ టాక్స్ వసూళ్లపై మాట్లాడుతానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధిత ట్రక్కు డ్రైవర్లకు భరోసా ఇచ్చారు.
• జనసంద్రం మధ్యనే తిరుగు ప్రయాణం
సుజాతనగర్ నుంచి తిరుగు ప్రయాణంలోనూ జనం పెద్ద ఎత్తున రోడ్ల మీదే ఉన్నారు. పెందుర్తి వెళ్లేప్పటికంటే తిరుగు ప్రయాణంలో రెట్టింపు ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. పవన్ కళ్యాణ్ పర్యటన ఆద్యంతం జన సంద్రం మధ్య సాగింది.