కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఇండియా కెప్టెన్ కోహ్లీ

ఐపీఎల్ వాయిదా పడటంతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. జూన్‌లో ఇంగ్లండ్ గడ్డపై జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ షేర్ చేశాడు. అందరూ జాగ్రత్తగా ఉండాలని, సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించాడు.

అటు సీనియర్ పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా తన భార్య ప్రతిమా సింగ్‌తో కలిసి వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఇప్పటికే శిఖర్ ధావన్‌, రహానే, ఉమేష్ యాదవ్‌లాంటి వాళ్లు కరోనా వ్యాక్సిన్‌లు తీసుకున్నారు. ఐపీఎల్ వాయిదా పడగానే ఇంటికెళ్లిపోయిన కోహ్లి.. ఆ వెంటనే కరోనా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు తన వంతుగా రూ.2 కోట్లు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.