ప్రపంచ నెంబర్‌వన్‌ క్రీడాకారిణి హో యిఫాన్‌ (చైనా)ను చిత్తుచేసి…ఫైనల్‌కు చేరిన హంపి

మహిళల స్పీడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ 4వ గ్రాండ్‌ ప్రీలో తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి, ప్రపంచ నెంబర్‌వన్‌ క్రీడాకారిణి హో యిఫాన్‌ (చైనా)ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకె ళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్‌ పోరులో హంపి 6-5తో యిఫాన్‌పై సంచలన విజయం సాధించింది. ఆట ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన హంపి తొలి గేమ్‌ను సునాయాసంగానే దక్కించుకొంది. ఆ తర్వాత యిఫాన్‌ కూడా పుంజుకోవడంతో తర్వాతి గేమ్‌లు నువ్వా నేనా అన్నట్టు సాగాయి. ఆదివారం జరిగే 4వ గ్రాండ్‌ ప్రీ ఫైనల్లో రష్యా స్టార్‌ క్రీడాకారిణి అలెక్సాండ్రా కోస్తానిక్‌తో హంపి పోటీపడనుంది. స్పీడ్‌ చెస్‌లో ఇప్పటివరకు జరిగిన మొత్తం మూడు గ్రాండ్‌ ప్రీ టోర్నీల్లో హంపి మొదటిదాంట్లో తొలి రౌండ్లోనే ఓడింది. రొటేషన్‌ పద్ధతిలో భాగంగా రెండో గ్రాండ్‌ ప్రీలో ఆమె ఆడలేదు. మూడో గ్రాండ్‌ ప్రీలో క్వార్టర్స్‌లో ఓడిన హంపి.. ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టోర్నీలో ఫైనల్‌ చేరుకుంది. మొత్తం నాలుగు గ్రాండ్‌ ప్రీ టోర్నీల్లో పాయింట్ల ఆధారంగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణుల మధ్య ఈనెల 20న సూపర్‌ ఫైనల్‌ జరగనుంది.