కరోనా రికవరీలో భారత్‌ ఉత్తమ స్థానం: ప్రధాని నరేంద్ర మోదీ

భారత్‌ కరోనా రికవరీ లో ఉత్తమ స్థానంలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. క్షేత్రస్థాయి వైద్య ఆరోగ్య వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడుతూ.. దేశ ప్రజలు ఉద్యమంగా కరోనాపై పోరాడుతున్నాo అన్నారు. శుక్రవారం ఆయన ఐక్యరాజ్య సమితి వార్షిక సర్వసభ్య సమావేశంలో భాగంగా ఆర్థిక, సామాజిక మండలి సమావేశాన్ని ఉద్దేశించి ‘కొవిడ్‌-19 తర్వాత ఐక్యరాజ్యసమితి పాత్ర’పై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలను దాటగా.. శుక్రవారానికి కోలుకున్న వారి సంఖ్య 6.36కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన రికవరీ రేటును ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘కరోనా మహమ్మారి అనేక దేశాల సా మర్థ్యానికి తీవ్రమైన పరీక్ష పెట్టింది. భారత్‌లో కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు రూ. 2,248 కోట్లను వెచ్చించాం. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటూ ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు నాంది పలికాం. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే చర్యలను ప్రారంభించాం. ఇతర అభివృద్ధి చెందుతు న్న దేశాలకు కూడా సహాయం చేశాం. మా నినాదం ‘సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌ కా విశ్వాస్‌’. కరోనా కల్లోలం నేపథ్యంలో 150 దేశాలకు ఔషధ సాయం చేశాం’’ అని పెర్కొన్నారు. ‘‘2030 ఆర్థిక లక్ష్యాలను చేరేందుకు ఒక పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. ఇందులో భాగంగా పౌష్ఠికాహారం, ఆరోగ్య విద్య, విద్యుత్తు, గృహనిర్మాణ రంగాలపై దృష్టి సారించాం. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా 6 లక్షల గ్రామాల్లో పారిశుధ్యం పూర్తయింది.

గడిచిన ఐదేళ్లలో 11 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. దీనీతో గ్రామీణ పారిశుధ్యం 38% నుంచి 100శాతానికి చేరింది. మహిళా సాధికారత వేగంగా ముందుకు సాగుతోంది. 40 కోట్ల మందికి కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిపించాం. ప్రతిఒక్కరికీ మొబైల్‌ ఫోన్‌ కనెక్షన్లు ఉన్నాయి. 70 కోట్ల మంది నగదు బదిలీతో లబ్ధి పొందుతున్నారు. 81.3 కోట్ల మందికి ఆహార భద్రత ఉంది. 2022కల్లా భారత స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి భారతీయుడికి సొంత ఇంటికలను సాకారం చేసే దిశలో అడుగులు వేస్తున్నాం. ఆయుష్మాన్‌ భారత్‌ కింద ప్రపంచంలోనే అత్యధికంగా 50 కోట్ల మందికి బీమా సదుపాయం కల్పించాం. 2025లోగా దేశంలో క్షయవ్యాధిని రూపుమాపుతాం’’ అని వివరించారు.