పరిశ్రమలు… పీఛే ముడ్!

* మూత పడుతున్న ఫ్యాక్టరీలు
* తరలిపోతున్న పెట్టుబడులు
* వైకాపా ప్రభుత్వ వైఖరే కారణం
* వేల కోట్ల ఆదాయానికి మోకాలడ్డు
* లేఆఫ్‌ లతో అల్లాడుతున్న ఉద్యోగులు
* అణగారిపోతున్న అభివృద్ధి అవకాశాలు
* ఉద్యోగాల కల్పనకు విఘాతం
* వలసపోతున్న మానవ వనరులు
* పట్టించుకోని జగన్ సర్కారు

ప్రపంచంలో ఎక్కడైనా చూడండి…
దేశాధ్యక్షులు, ప్రధానులు విదేశీ పర్యటనల్లో తప్పనిసరిగా పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. తమ దేశాల్లో పరిశ్రమల స్థాపనకు ఆహ్వానిస్తారు.
పోనీ మన దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా చూడండి…
తమ రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి పోటీ పడతారు. అనేక రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ కేసి ఓసారి చూడండి…
రాష్ట్రంలోని వివిధ పారిశ్రామికవేత్తలు కలవడానికి ప్రయత్నిస్తున్నా ముఖ్యమంత్రి జగన్‌ మొహం చాటేసిన విచిత్ర పరిస్థితి కనిపిస్తుంది!
ఇలా ఓసారో, మరోసారో కాదు… ఏకంగా నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి అపాయింటుమెంటు ఇవ్వని దురహంకార ధోరణి ద్యోతకమవుతుంది!
విసిగి వేశారిపోయిన ఫ్యాక్టరీల యజమానులు ఆఖరికి పత్రికా ప్రకటనలు జారీ చేయాల్సి వచ్చిన దుస్థితి దర్శనమిస్తుంది!
అయినా ఫలితం లేక తమ పరిశ్రమలను మూసేయడానికి నిర్ణయించిన నిస్సహాయ స్థితి కళ్లముందు నిలుస్తుంది!
రాష్ట్రంలో ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వం నుంచి తగిన భరోసా లభించక… స్వయంగా గోడు చెప్పుకుందామనుకున్నా ముఖ్యమంత్రి సముఖం లభించక… తమ సమస్యలు తీరే దారి కనిపించక… విధిలేక ఒక నిర్ణయం తీసుకున్నారు.
అదేమిటో తెలుసా?
తమ ఫ్యాక్టరీలను మూసివేయాలని!
ఇప్పటికే కొన్ని మూత పడిపోయాయి. కొన్ని లేఆఫ్‌ లను ప్రకటించాయి. మిగతావి కూడా మూసివేయడానికి నిర్ణయించుకున్నాయి.
లక్షలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తున్న పారిశ్రామికవేత్తల సమస్యలు తెలుసుకోవడం ముఖ్యమంత్రికి ముఖ్యం కాదా?
వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం బాధ్యత కాదా?
అవి మూత పడకుండా చూసుకోవడం అత్యవసరం కాదా?
ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల, కార్మికుల బతుకులు అల్లాడిపోకుండా చూసుకోవడం కనీస కర్తవ్యం కాదా?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఆశించడం కూడా వ్యర్థమే!
ఎందుకంటే… వైకాపా ప్రభుత్వానికి వైషమ్య రాజకీయాలు, ప్రచార పటాటోపాలు తప్ప రాష్ట్ర అభివృద్ధిపై కానీ, రాష్ట్రంలో సంపదను పెంపొందించడంపై కానీ, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కానీ ఏమాత్రం శ్రద్ధాసక్తులు లేవని అనేక అవకతవక విధానాల వల్ల, నయవంచక విధానాల వల్ల ఇప్పటికే అందరికీ అర్థం అయిపోయింది.
రాష్ట్రంలో మొత్తం 39 ఫెర్రో ఎల్లాయిస్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటిలో 21 విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోనే ఉన్నాయి. వీటిలో గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 8 మూతబడిపోయాయి. మిగతా వాటిని కూడా పది, పదిహేను రోజుల్లో మూసివేయడానికి ఆయా పారిశ్రామిక వేత్తలు ప్రకటించారు. కొన్నయితే ఇప్పటికే లేఆఫ్‌ లు ప్రకటించాయి.
ఈ పరిశ్రమల్లో ప్రత్యక్షంగా 30 వేల మంది ఉద్యోగులు, పరోక్షంగా 3 లక్షల మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఈ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్న వీళ్లంతా ఇప్పుడు తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు. తమ భవితవ్యం పట్ల అనిశ్చితితో కుములిపోతున్నారు.
ఈ అస్తవ్యస్త పరిస్థితికి కారణమేంటని ప్రశ్నిస్తే… అందరి వేళ్లూ ముఖ్యమంత్రి జగన్‌ వైపే చూపిస్తున్నాయి. ఎందుకంటే ఈ పరిశ్రమల యజమానులు తమ సమస్యలను చెప్పుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. సంబంధిత అధికారులను, మంత్రులను కలుసుకుని ఎన్నోసార్లు చెప్పుకున్నారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ను కలుసుకోడానికి సమకట్టారు. అయితే ముఖ్యమంత్రి వీరికి అపాయింట్‌ మెంట్‌ ఇవ్వనే లేదు. ఇలా నాలుగేళ్లుగా ఎదురు చూసిన పారిశ్రామిక వేత్తలు ఆఖరికి పత్రికల్లో ప్రకటనల ద్వారా తమ సమస్యలు ఎలుగెత్తి చాటారు. ముఖ్యమంత్రికి చిట్టచివరి విన్నపం చేశారు. అయినా ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. దాంతో వాళ్లు విసుగెత్తిపోయి, తప్పనిసరై మూసివేత నిర్ణయానికి వచ్చేశారు.
* సమస్యలతో సతమతం
ఫెర్రో ఎల్లాయిస్‌ ఫ్యాక్టరీల ఉత్పత్తి ఖర్చులో 30 శాతానికి పైగా విద్యుత్‌ వ్యయమే ఉంటుంది. ఒక టన్ను ఉత్పత్తి చేయాలంటే దాదాపు 4500 యూనిట్ల కరెంటు అవసరమవుతుంది. ఇక వీటిలో ఫెర్రో సిలికాన్‌ లాంటి ప్రత్యేక ఉత్పత్తులకైతే టన్నుకి 9 వేల యూనిట్లు కూడా అవుతుంది. అంటే ఉత్పత్తి వ్యయంలో 70 శాతం విద్యుత్‌ వ్యయమేనన్నమాట. ఈ నేపథ్యంలో వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విద్యుత్‌ ఛార్జీలను ఎడాపెడా పెంచేయడం, సర్దుబాటు అనో, ట్రూఅప్‌ ఛార్జీలనో వేర్వేరు రూపాల్లో కరెంటు బిల్లులు వసూలు చేయడం ఈ ఫ్యాక్టరీలకు తలకు మించిన భారంగా మారింది.
ఉదాహరణకు గత ప్రభుత్వ హయాంలో కరెంటు ఛార్జీ యూనిట్‌కి రూ.4.95 ఉండేది. అదే వైకాపా ఆధ్వర్యంలో ఇప్పుడు యూనిట్‌కి రూ. 7.89కి పెరిగింది. ఇందువల్ల ఉత్పత్తి వ్యయంలో టన్నుకు దాదాపు 16 వేల వరకు అదనంగా ఖర్చవుతోంది. దీనికి సాయం అంతర్జాతీయంగా ఈ ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గిన నేపథ్యం కూడా తోడయింది. ఇలాంటి పరిస్థితుల్లో వారి సమస్యలను అర్థం చేసుకుని, వేర్వేరు పద్ధతుల ద్వారా రాయితీలు, అదనపు సౌకర్యాలు కల్పించి ఈ పరిశ్రమలకు ఊతంగా నిలవకపోగా, వైకాపా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు మిన్నకుండిపోయింది. అదే గత ప్రభుత్వ హయాంలో ఈ ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమలకు 2016లో యూనిట్ కు రూ.1.50లు, 2017లో రూ.0.75లు వంతున విద్యుత్‌ బిల్లుల్లో రాయితీలు కల్పించారు. ఇప్పుడు రాయితీల మాట అటుంచి మరింతగా విద్యుత్‌ ఛార్జీలు పెంచే పరిస్థితి కనిపిస్తోంది. 2023-24లో ఇంధన ఛార్జీల సర్దబాటు కింద యూనిట్‌కు రూ. 1-10 వంతున చెల్లించాలని డిస్కంలు నిర్ణయించాయి. అంటే భవిష్యత్తులో ఈ పరిశ్రమలు ట్రూఅప్‌ ఛార్జీల రూపంలో దీన్ని భరించాల్సి వస్తుంది. అంటే విద్యుత్‌ ఛార్జీలు యూనిట్ కి రూ.8.59 అవుతుంది. ఇది ఈ పరిశ్రమల విషయంలో మూలిగే నక్కపై తాటిపండు పడినట్టే. ఇవే పరిశ్రమలు నెలకొని ఉన్న చత్తీస్‌ ఘడ్‌, పశ్చిమ బెంగాల్‌, ఝార్ఖండ్‌ లాంటి రాష్ట్రాల కేసి ఓసారి దృష్టి సారిస్తే అక్కడ కరెంటు ఛార్జీలు యూనిట్‌కి రూ. 4.75కి మించకుండా ఆయా రాష్ట్రాల అధినేతలు నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఆ మాత్రం ఇంగితం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కు లేకపోయింది.
* అన్ని పరిశ్రమలూ అష్టదిగ్బంధనంలోనే…
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల కాలాన్ని చూస్తే ఒక్క ఫెర్రో ఎల్లాయిస్‌ ఫ్యాక్టరీలే కాదు… ఏ పరిశ్రమను తీసుకున్నా ఇంచుమించు ఇదే దుస్థితి కనిపిస్తోంది. వైకాపా హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కన్నా తరలిపోయిన పరిశ్రమలే అధికమని తెలుస్తుంది.
అమరరాజా… లులూ…కియా… జాకీ… రిలయన్స్… అదానీ… ఫ్రాంక్లిన్టెంపుల్టన్… సింగపూర్‌ కన్సార్టియం… ట్రైటాన్… ఏషియన్ పల్ప్‌… స్టార్ బ్యాటరీస్, స్టార్టప్ ఏరియా డెవలప్‌ మెంట్స్‌…
ఇవన్నీ ఏంటో తెలుసా? ఏపీలో భారీ పరిశ్రమలు స్థాపించడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చి కూడా, జగన్‌ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోగా, వేధింపు చర్యలకు విసిగిపోయి… చేసేది లేక వెనక్కి వెళ్లిపోయిన దేశ, విదేశీ కంపెనీలు, సంస్థలే!
ఇవన్నీ బ్యాటరీలు, కాగితాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, డేటా సెంటర్స్, మాల్స్, కన్వెన్షన్ సెంటర్స్, స్టార్ హోటల్స్‌, మెగా స్పీడ్‌ పార్కులు, దుస్తులు, సోలార్‌ పవర్‌, కార్లు సహా… వేర్వేరు ఉత్పత్తుల తయారీ పరిశ్రమలను స్థాపించడానికి ముందుకు వచ్చినవే!
కానీ ఇవన్నీ వైకాపా తీరుతో విసుగెత్తి తరలి పోవడం వల్ల ఎంత మేరకు పెట్టుబడుల నష్టం జరిగిందో తెలుసా?
ఓ అంచనా ప్రకారం… దాదాపు 1.70 లక్షల కోట్ల రూపాయలు!
ఈ సంస్థలన్నీ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిపోవడం వల్ల ఎంత మంది విద్యావంతులు, యువకులు, కార్మికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చేజారిపోయాయో తెలుసా?
తక్కువలో తక్కువగా అంచనా వేసినా దాదాపు లక్ష మందికి!
ఇక వీరి వల్ల ప్రయోజనం పొందే వారి కుటుంబాలు, ఆయా పరిశ్రమల పరిధిలో ఏర్పడే అనుబంధ వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు… వీటన్నిటినీ కలుపుకుంటే… కొన్ని లక్షల మంది ప్రజలకు ప్రయోజనం కలిగి ఉండేది!
నిజానికి ఇన్ని వైవిధ్యమైన పరిశ్రమలు నెలకొని ఉంటే అటు అభివృద్ధి, ఇటు ఉద్యోగాల కల్పన, మరో వైపు ఆదాయం, ఇంకోవైపు పన్నులు… ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలతో రాష్ట్రం పరుగులు పెట్టేది. జగన్ ప్రభుత్వానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరేది.
కానీ అలా జరగలేదు!
మరి అందుకు కారణం ఏమిటో తెలుసా?
సంకుచిత రాజకీయ ధోరణి!
విశాలతరమైన ప్రజా సంక్షేమ దృక్కోణాన్ని విస్మరించిన వైఖరి!
ఇతర పార్టీలకు మద్దతుదారులనో, గత ప్రభుత్వం హయాంలో ముందుకు వచ్చిన వారనో, తమ రాజకీయ ప్రయోజనానికి ఉపయోగపడరనో, తమ ఆధిపత్యానికి తలొగ్గలేదనో, వీటిని స్థాపించిన ఘనత తమకు దక్కదనో… ఇలా కారణాలేమైనా… ఏవేవో నిబంధనలతో, అర్థంలేని ఆంక్షలతో వేధించి, విసిగించడంతో పాటు ప్రోత్సాహ సహకారాలను అందించకపోవడం వల్ల ఇంత పెద్ద సంస్థలన్నీ ఏపీని వదిలి వెళ్లిపోయాయనేది నిజం!
* చేజారిన ప్రయోజనాలివిగో…
లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో వేర్వేరు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన సంస్థలను, అవి నెలకొల్పడానికి సిద్ధపడిన ఉత్పత్తుల విలువను పరిశీలిస్తే కానీ… జగన్ ప్రభుత్వ ఉదాసీన, నిర్లక్ష్య, సంకుచిత, వేధింపు రాజకీయాల వల్ల రాష్ట్ర ప్రజలు ఎంత మేరకు నష్టపోయారో అర్థం కాదు.
* అమర రాజా: బ్యాటరీల తయారీ రంగంలో దేశంలోనే ప్రముఖమైన సంస్థ. చిత్తూరులో ఇప్పటికే ఉన్న పరిశ్రమను ఇక్కడే మరింతగా విస్తరించాలనుకుంది. ఈ విస్తరణ విలువ దాదాపు రూ. 9500 కోట్ల రూపాయలు. ఇందుకు జగన్ సర్కారు సహకరించకపోగా వేధింపులకు దిగింది. కారణం… ఇది ప్రత్యర్థి పార్టీ ఎంపీకి చెందినది కావడం. దాంతో ఇది తెలంగాణకు తరలిపోయింది. మహబూబ్ నగర్‌ లో లిథియం బ్యాటరీల పరిశోధన, తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరిపోయింది. మరో విస్తరణ యూనిట్ ను తమిళనాడులో సైతం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోందీ సంస్థ. ఈ విస్తరణ ఏపీలోనే జరిగి ఉంటే వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగేవి. ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీ ఆదాయం సమకూరేది.
* లులూ: యూఏఈకి చెందిన లులూ సంస్థ విశాఖలో రూ.2200 కోట్ల పెట్టుబడితో 7 వేల మందికి ఉపాధి కలిగేలా అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌, మెగా షాపింగ్‌ మాల్‌, స్టార్ హోటళ్ల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. కానీ వైకాపా ప్రభుత్వం భూమి కేటాయింపులను ఆపుచేయడంతో విధిలేక తమిళనాడులో రూ. 3,500 కోట్ల పెట్టుబడులకు ఆ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని తరలిపోయింది. గత ప్రభుత్వం హయాంలో ఈ కంపెనీకి భూముల కేటాయింపు జరగడమే ఇందుకు కారణం.
* ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ : విశాఖలో టెక్నాలజీ డెవలెప్మెంటు క్యాంపస్‌ ఏర్పాటుకు గత ప్రభుత్వం హయాంలో ముందుకు వచ్చింది. దీని పెట్టుబడుల విలువ 70 మిలియన్‌ డాలర్లు. ఇది వచ్చి ఉంటే 2500 మందికి అత్యున్నత స్థాయి ఐటీ ఉద్యోగాలు వచ్చి ఉండేవి. కానీ జగన్‌ ప్రభుత్వం సరైన సహకారం అందించకుండా అందుకు మోకాలడ్డింది.
* జాకీ: దుస్తుల తయారీలో పేరెన్నిక గల సంస్థ. అనంతపురం సమీపంలోని రాప్తాడు వద్ద కర్మాగారం ఏర్పాటు చేయడానికి గతంలో భూముల కేటాయింపు జరిగింది. రూ. 129 కోట్ల పెట్టుబడితో, ఏటా 32 మిలియన్ల దుస్తుల తయారీ కోసం పరిశ్రమను స్థాపించడానికి సిద్ధం అయింది. అందువల్ల 6,400 మందికి నేరుగా ఉపాధి కలిగి ఉండేది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక నేత ముడుపుల కోసం, సబ్ కాంట్రాక్టుల కోసం, తాము చెప్పిన వారికే ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఆంక్షలు పెట్టడంతో ఆ సంస్థ వెనక్కి పోయింది. ఇప్పుడు తెలంగాణలో రెండు యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.
* ట్రైటాన్: అమెరికాకు చెందిన సోలార్ బ్యాటరీల తయారీ సంస్థ. రూ. 727 కోట్ల పెట్టుబడితో విశాఖ, చిత్తూరుల్లో ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధం అయింది. వైకాపా ప్రభుత్వం ఉదాసీన వైఖరితో ఆ ప్రయత్నాలు విరమించుకుంది. తెలంగాణతో ఒప్పందం చేసుకుంది.
* రిలయన్స్: తిరుపతి సమీపంలో రూ. 15 వేల కోట్లతో ఎలక్ట్రానిక్సు మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ కు గత ప్రభుత్వం 136 ఎకరాలు కేటాయించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక భూవివాదాలు తలెత్తడంతో ఇచ్చిన భూముల్ని కూడా వెనక్కి ఇచ్చేసి మరీ వెళ్లిపోయింది.
* ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ మిల్స్: ప్రకాశం జిల్లాలో రూ. 24 వేల కోట్లతో కాగితపు పరిశ్రమ ఏర్పాటుకు ముందకు వచ్చి కూడా వైకాపా సర్కారు వైఖరికి విసిగిపోయి తప్పుకుంది.
* బెస్ట్ బ్యాటరీస్: చిత్తూరు జిల్లాలో రూ. 300 కోట్లతో యూనిట్టు స్థాపనకు వచ్చిన ఈ సంస్థ ఇక్కడి పరిస్థితుల వల్ల విసిగిపోయి తెలంగాణకు తరలిపోయింది.
* కియా: రూ. 10 వేల కోట్ల పెట్టుబడి ప్రణాళికలతో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో కార్ల తయారీ పరిశ్రమ స్థాపించిన కియా సంస్థ, వైకాపా ఎంపీ బెదిరింపులు, వేధింపులకు నిలబడి తట్టుకుంది. అయితే అనుబంధ పరిశ్రమల ఏర్పాటు విషయంలో తటపటాయిస్తోంది.
* అదానీ గ్రూప్: గుజరాత్‌ కి చెందిన ఈ వ్యాపార సంస్థ విశాఖలో 20 ఏళ్లలో రూ. 70 వేల కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చి కూడా, ప్రభుత్వం ఆంక్షలతో ప్రతిపాదనలు విరమించుకుంది.
* సింగపూర్: అమరావతిలో 1691 ఎకరాల్లో స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చిన సింగపూర్ సంస్థ కూడా ప్రభుత్వ వైఖరి వల్ల చేజారిపోయింది.
ఇలా చెప్పుకుంటూ పోతే… ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో భారీ పరిశ్రమలు యూనిట్ల స్థాపనకు ముందుకు వచ్చి కూడా విరమించుకున్నాయి.
ఇన్నేసి పరిశ్రమలు వస్తే ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది కదా? మరెందుకు వీటికి సహకరించలేదు? అనే అనుమానం ఎవరికైనా వస్తుంది.
దానికి కారణాలు అన్వేషిస్తే స్ఫురించే అంశాలు ఆశ్చర్యపరుస్తాయి…
అవేంటంటే…
జగన్ ప్రభుత్వానికి ప్రజా ప్రయోజనాల కంటే… సొంత ప్రయోజనాలే ముఖ్యం!
రాష్ట్ర అభివృద్ధి కంటే… రాజకీయ కారణాలే కీలకం!