పెనుకొండలో 63 ఎకరాలు నిజంగా కియాకే కేటాయించారా?

•కియా సైంటిఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ పేరిట ఇచ్చిన భూమిపై గోప్యత ఎందుకు?
•పారదర్శకత లేని పాలనవల్లే రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు
•రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఎక్కడ ఉంది?
•వైసీపీ అధికారంలోకి వచ్చాక యువతకు ఉన్న ఉపాధి కాస్తా దూరమైంది
•జులై 15 నుంచి మరోసారి జనసేన ఫర్ ఏపీ రోడ్స్ క్యాంపెయిన్
•సామాన్యుడి సమస్యలు చెప్పుకునేందుకే జనవాణి – జనసేన భరోసా
•రాష్ట్ర ప్రజానీకానికి నిర్భయంగా సమస్యలు చెప్పుకొనే అవకాశం
•శ్రీ పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు
•విజయవాడలో మీడియా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

రాష్ట్రంలో అద్భుత పాలన ఉంటే పరిశ్రమలు క్యూకట్టి ఉండేవని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరవాత యువతకు ఉన్న ఉపాధి వనరులు కూడా దూరమయ్యాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో పారదర్శకత లేకపోవడం వల్లే రాష్ట్రంలో ఎవరూ పెట్టుబడులు పెట్టడం లేదన్నారు. ఇటీవలి కేబినెట్ సమావేశంలో కియా పేరిట ఏపీఐఐసీ నుంచి కేటాయించిన 63 ఎకరాల స్థలం ఎవరికిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కియా సైంటిఫిక్ ప్రాసెస్ యూనిట్ కోసం ఇచ్చినట్లు రాసి ఆ తీర్మానాన్ని ఆమోదించిన అంశాన్ని గోప్యంగా ఎందుకు ఉంచారన్నారు. ఈ సైంటిఫిక్ ప్రాసెస్ యూనిట్… కియా మోటర్స్ రెండూ ఒక్కటేనా అని నిలదీశారు. ఆటోమోటివ్ అయిన కియాకీ సైంటిఫిక్ ప్రాసెస్ యూనిట్ కీ ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలన్నారు. ఆ యూనిట్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్ధం కావడం లేదని తెలిపారు. నాదెండ్ల మనోహర్ శుక్రవారం సాయంత్రం విజయవాడలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకుని వారిలో భరోసా నింపేందుకు ఆదివారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జనవాణి – జనసేన భరోసా కార్యక్రమ వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ఈజ్ ఆఫ్ డూయింగ్ లో భారత దేశంలో ఉన్నత స్థాయికి చేరామని చేసిన ప్రకటనలు పేపర్లలో చూశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ అవార్డు ఎలా వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఎవరికైనా కొత్తగా ఉపాధి కల్పించారా? మీ పాలనలో ఉన్న ఉపాధి అవకాశాలే పోయాయి. మీరు అద్భుతమైన పాలన అందిస్తుంటే పారిశ్రామికవేత్తలు క్యూ కట్టేవారు. లక్షలాది మందికి ఉపాధి దక్కేది. గత ప్రభుత్వం 2017-18 సంవత్సరంలో 300కు పైగా సంస్కరణలు తీసుకురావడం ద్వారా దేశంలో మొదటి స్థాయికి రాష్ట్రం వెళ్లింది. ఈ ప్రభుత్వం వచ్చాక 187 సంస్కరణలు తెచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క పారిశ్రామికవేత్తా ముందడుగు వేసే పరిస్థితి లేదు. మొన్నటి కేబినెట్ భేటీలో కియా మోటర్స్ పేరిట ఏపీఐఐసీ నుంచి 63 ఎకరాల స్థలం ఇచ్చారు. మీ పాలనలో పారదర్శకత లేకపోవడం వల్ల ఇలాంటి కేటాయింపులను అనుమానించాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఎవ్వరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు.
•రోడ్ల బాగు కోసం వచ్చిన ఎన్.డి.బి. నిధులు ఎటుపోయాయి?
ముఖ్యమంత్రి జులై 15వ తేదీ లోపు రహదారులు పూర్తి చేయమని అధికారులను ఆదేశించారు. ఆ రోడ్లు ఫోటోలు చూపించమని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి గారి ఛాలెంజ్ ని మేము స్వీకరిస్తున్నాం. కచ్చితంగా రోడ్ల దుస్థితిని చూపిస్తాం. జనసేన పార్టీ గతంలో రహదారుల మీద అద్భుతమైన క్యాంపెయినింగ్ నిర్వహించింది. అదే విధంగా మరోసారి – ముఖ్యమంత్రి గారు చెప్పిన తేదీ నుంచి జనసేన ఫర్ ఏపీ రోడ్స్ క్యాంపెయినింగ్ చేపట్టబోతున్నాం. సామాజిక మాధ్యామాల ద్వారా రోడ్ల పరిస్థితిని వివరిస్తాం. ముఖ్యమంత్రికి ట్యాగ్ చేస్తాం. రాష్ట్రంలో రోడ్ల బాగు కోసం వచ్చిన ఎన్.డి.బి. నిధులను ఎటు మళ్లించారో సమాధానం చెప్పాలి. అమరావతి నిర్మాణం చేపట్టలేనప్పుడు ఆ భూములను అమ్ముకునే హక్కు శ్రీ జగన్ రెడ్డికి ఎక్కడిది? అమరావతి రైతులకు జగన్ రెడ్డి చేసిన మోసం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. కౌలు రైతు భరోసా యాత్ర చేపడితే కౌలు రైతులు ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోలేదని ముఖ్యమంత్రి చెబుతున్నారు. శ్రీ జగన్ రెడ్డి సొంత అమ్మమ్మ గారి ఊరిలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే రూ. లక్ష ఆర్ధిక సాయం చేశాం. తర్వాత ప్రభుత్వం కూడా రూ. లక్ష ఇచ్చింది. అలాంటిది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోలేదు అని ఎలా చెబుతారు. ఈ ముఖ్యమంత్రికి పాలనాదక్షత లేదు. ప్రభుత్వానికి నిజాయితీ లేదు.
•ప్రభుత్వంలో చలనం రప్పించేందుకే…
ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని వారిలో భరోసా నింపేందుకే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనవాణి – జనసేన భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సమస్యలు తీసుకువెళ్తే పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది. ప్రజల తరఫున ఆయన గళం విప్పితే ప్రభుత్వంలో చలనం వస్తుందన్న ఆశతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యమంత్రి ఎప్పుడూ ప్రజలను కలుసుకొని వారి సమస్యలు వినరు. గడప గడపకు అని వెళ్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు పోలీసు బందోబస్తుతో తిరుగుతూ ప్రజలు చెప్పే సమస్యలు వినరు… చెబితే బెదిరిస్తారు. రాష్ట్రంలో స్పందన కార్యక్రమం తూతూమంత్రంగా నడుస్తోంది. ప్రజలు సమస్యలు చెప్పుకొనేందుకు సరైన వేదిక లేదు. అందుకే జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం మొదలు పెట్టింది. పార్టీ దృష్టికి వచ్చి ప్రతి సమస్యను సంబంధిత శాఖకు, ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యపై బాధితుల పక్షాన జనసేన మాట్లాడుతుంది. ఈ ప్రక్రియను చేపట్టేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ వరప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాం. పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 3, 10 తేదీల్లో విజయవాడలోని శ్రీ మాకినేని బసబపున్నయ్య భవన్ లో జనవాణి జనసేన భరోసా కార్యక్రమాన్ని చేపడతారు. ఈ కార్యక్రమం ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుంచి, వివిధ సంఘాల నుంచి సమస్యల మీద అర్జీలు స్వీకరిస్తారు. రాష్ట్ర ప్రజానీకం నిర్భయంగా సమస్యలు తెలుపుకొనే అవకాశం జనసేన పార్టీ కల్పిస్తోంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పిస్తున్నాం.
•రాజధానిలో ఉంటూ అమరావతి ప్రజలకే సమయం ఇవ్వలేదు
రాష్ట్ర ప్రజానీకం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనవాణి – జనసేన భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో అడుగడుగునా సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి సమస్యల పరిష్కారంపై స్పందన కరువయ్యింది. గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన వారు కనీసం ఉదయం గంట పాటు ప్రజల్ని కలసి ప్రజా సమస్యలు వినేవారు. జగన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితమవుతున్నారు. ఎవర్నీ కలసింది లేదు. కనీసం జిల్లాల పర్యటనలో సైతం ప్రజల గోడు పట్టడం లేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేక ప్రాంతాలలో పర్యటించినప్పుడు వివిధ వర్గాల ప్రజలు ఆయన్ని కలసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు, రైతులు, రైతు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు ఇలా ఎంతో మంది తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. ఏ ఒక్కరికీ శ్రీ జగన్ రెడ్డి ఏనాడు సమయం కేటాయించలేదు. కనీసం తాను ఉంటున్న అమరావతి ప్రాంతంలో రైతుల బాధలు కూడా ముఖ్యమంత్రికి పట్టలేదు. వారికి పట్టుమని పది నిమిషాల సమయం కేటాయించింది లేదు. విజయవాడలో జనవాణి కార్యక్రమం కోసం మూడు పెద్ద ఆడిటోరియంలు చూశాం. వాటిని జనసేన పార్టీకి ఇవ్వడానికి వారు నిరాకరించారు. ప్రభుత్వం నుంచి, అధికార పార్టీ నుంచి ఒత్తిళ్ళని వెనక్కి తగ్గారు” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు పోతిన వెంకట మహేష్, బండ్రెడ్డి రామకృష్ణ, శ్రీ షేక్ రియాజ్, అమ్మిశెట్టి వాసు, సయ్యద్ జిలానీ, శ్రీమతి రావి సౌజన్య, శ్రీమతి పోతిరెడ్డి అనిత, శ్రీ బొలిశెట్టి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
* ఏర్పాట్ల పరిశీలన
ఆదివారం పవన్ కళ్యాణ్ గారి జనవాణి కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణ అంశంపై పార్టీ నేతలకు సూచనలు ఇచ్చారు. విజయవాడ నగర, కృష్ణా జిల్లా నాయకులతోపాటు పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, విశ్రాంత ఐఏఎస్ అధికారి డి.వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.