భారత క్రికెటర్ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమా?

భారత క్రికెట్ జట్టుకి 16 టెస్టు మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించి, 5 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించి, ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టులో శ్రీ హనుమ విహారి కనబరిచిన క్రీడా పటిమ మరువలేనిదంటూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్‌గా గత ఏడేళ్లలో ఆంధ్ర జట్టు అయిదు సార్లు నాకౌట్‌కు అర్హత సాధించడంలో శ్రీ హనుమ విహారి ఎంతో సాయపడ్డారు. విరిగిన చేతితో పాటు మోకాలి గాయంతో ఆడిన శ్రీ హనుమ విహారి.. భారత్‌ జట్టు కోసం, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ జట్టు కోసం తన క్రీడా శక్తినంతటినీ ధారపోశారు.
ఈ రోజు ఒక వైసీపీ కార్పొరేటర్ కారణంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు, తన కెప్టెన్సీకి శ్రీ విహారి రాజీనామా సమర్పించాల్సి వచ్చింది. మన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కి భారత క్రికెటర్, ఆంధ్రప్రదేశ్ రంజీ టీమ్ కెప్టెన్ కంటే ఎటువంటి క్రికెట్ బ్యాక్‌ గ్రౌండ్ లేని స్థానిక వైసీపీ నాయకుడు చాలా విలువైన వ్యక్తిగా మారటం ఎంత అవమానం!
జగన్‌మోహన్‌ రెడ్డి గారూ! మన ఆంధ్రా క్రికెట్ టీమ్ కెప్టెన్‌ని రాష్ట్ర క్రికెట్ సంఘం దారుణంగా అవమానించినప్పుడు.. ‘అడుదాం ఆంధ్రా’ లాంటి కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయల సొమ్ములు ఖర్చు చేసి లాభమేంటి?
ప్రియమైన హనుమ విహారి గారూ…. మీరు రాష్ట్రానికి, దేశానికి ఛాంపియన్ ప్లేయర్. మీ విశిష్ట సేవలతో ఆంధ్రలోని చిన్న పిల్లల్లో స్ఫూర్తిని నింపి, క్రీడాకారులను ఉత్తేజపరిచినందుకు మీకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. తెలుగువారిగా, క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే వ్యక్తులుగా మీకు జరిగిన అన్యాయానికి…. మన రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్ మీ పట్ల చూపిన వివక్షతకు మేము చింతిస్తున్నాము.
మీకు భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్నాను. అలాగే ఆటగాళ్లను గౌరవించడం తెలిసిన స్టేట్ క్రికెట్‌ అసోసియేషన్‌తో మీరు వచ్చే ఏడాది మళ్లీ ఆంధ్రా తరపున ఆడతారని నేను విశ్వసిస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ తన ట్వీట్ లో స్పష్టం చేశారు.