రాష్ట్ర ఉమ్మడి అభివృద్ధి ప్రణాళిక ఆవిష్కారం

* రాష్ట్రం నలువైపుల నుంచి భారీగా కార్యకర్తలు
* రాష్ట్ర రాజకీయ శకంలో చిరస్థాయిగా సభ నిలుస్తుంది
* ఉమ్మడి సభా ప్రాంగణం వద్ద మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

న భూతో అనేలా జనసేన – తెలుగుదేశం పార్టీల ఉమ్మడి సభకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. బుధవారం తాడేపల్లిగూడెం సమీపంలోని పత్తిపాడు వద్ద జరగబోయే తెలుగు జన విజయ కేతనం ” జెండా ” సభ ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పరిశీలించిన అనంతరం సభా ప్రాంగణం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన – తెలుగుదేశం పార్టీల చారిత్రాత్మక పొత్తు ఎంత అవసరం అనేది రెండు పార్టీల అధినేతలు ప్రజలకు వివరించి చెబుతారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను ప్రజలకు తెలియజేస్తారు. గత ఐదేళ్లలో జరిగిన పాలనలోని లోపాలను తెలియజేయడంతో పాటు వాటిని అధిగమించేందుకు తగిన మార్గాన్ని ఇరు పార్టీల అధినేతలు స్పష్టంగా ప్రకటిస్తారు. సభకు రాష్ట్రం నలువైపుల నుంచి లక్షలాదిగా కార్యకర్తలు తరలి రానున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశాం. ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా, రెండు పార్టీల ఆధ్వర్యంలో సభ విజయవంతానికి కమిటీలు, పార్టీల వాలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇది గుర్తుండిపోయే సభగా మిగిలిపోనుంది.
* జగన్ నియంత పాలనకు చరమగీతం పాడాలి: శ్రీ అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ “ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకైనా సభలు, సమావేశాలు నిర్వహించుకునే హక్కు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సభలు సమావేశాలు నిర్వహించుకునే హక్కు అధికార పార్టీ వైసీపీకి మాత్రమే ఉంది అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. విపక్షాలకు చెందిన సభలకు కనీసం ఆర్టీసీ బస్సులను కూడా కేటాయించడం లేదు. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా నిర్వహించబోయే సభకు కూడా బస్సులను కేటాయించకపోవడం దురదృష్టకరం. రెండు పార్టీల ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు దొరికిన రవాణా మార్గంలో సభకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి సభ కనివినీ ఎరుగని రీతిలో జరగనుంది” అన్నారు. సభా ఏర్పాట్లను పరిశీలించిన వారిలో రెండు పార్టీల ముఖ్య నాయకులు ఉన్నారు.