మేమేం చేశాం నేరం…?

*జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ దృష్టికి దివ్యాంగుల వెతలు
*వారి వద్దకే నేరుగా వెళ్లి సమస్యలు తెలుసుకున్న జనసేనాని
*ప్రభుత్వం నుంచి తమకు సాయం అందడం లేదని ఆవేదన

దివ్యాంగుల వెతలు.. దీనగాథలు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కదిలించాయి. ఎంతోదూరం నుంచి.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చిన వారు తమ సమస్యలను జనసేనాని దృష్టికి తెచ్చి, వాటికి ఓ పరిష్కార మార్గం చూపాలని దీనంగా వేడుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ప్రోత్సాహం లేదని, సమస్యలు చెప్పుకున్నా స్పందన లేదని, తమను మనుషులుగా కూడా గుర్తించడం లేదంటూ దివ్యాంగులు వాపోతున్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం భీమవరంలో నిర్వహించిన జనవాణి – జనసేన భరోసా కార్యక్రమానికి దివ్యాంగులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తమ సమస్యలను చెప్పుకున్నారు. వేదికపైకి రాలేని పరిస్థితుల్లో ఉన్న దివ్యాంగుల వద్దకు నేరుగా పవన్ కళ్యాణ్ గారే వెళ్లి వారి సమస్యలను విన్నారు.
*సర్కారుకు వినిపించని జగదీశ్వరి దీనగాధ
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరుకు చెందిన కుమ్మర జగదీశ్వరికి 1999వ సంవత్సరంలో సొంత మేనమామతో వివాహం జరిపించారు. మేనరికం కావడంతో ముగ్గురు పిల్లలూ దివ్యాంగులుగా పుట్టారు. దీంతో జగదీశ్వరిని భర్త వదిలేసి వెళ్లిపోయాడు. న్యాయపరంగానూ వీరికి తెగదెంపులు అయ్యాయి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగదీశ్వరి పిల్లలకు రావాల్సిన పింఛన్లు, అందాల్సిన సంక్షేమ పథకాలు ఆపేశారు. ఇదేమిటని అడిగితే నీ భర్త ఆదాయపుపన్ను కడుతున్నాడు కాబట్టి నీకు ఏవీ రావు అని చెబుతున్నారని బాధితురాలు జగదీశ్వరి తన ముగ్గురు పిల్లలతో కలిసి జనవాణిలో పవన్ కళ్యాణ్ గారి ముందు బోరున విలపించారు. ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులను కలిసినా, కనీస స్పందన లేదని వాపోయారు.
*నడిరోడ్డుపై నానా తంటాలు
ఏలూరు నుంచి వచ్చిన మరో దివ్యాంగుడు భాస్కర్ ప్రభుత్వం ఇస్తున్న ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్ల తీరును పవన్ కళ్యాణ్ ముందు ఉంచారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకు వికలాంగుల సంక్షేమ శాఖ నుంచి అందించే ట్రై సైకిళ్లు మోటారువి ఇవ్వడం నిలిపేశారు. కేవలం ఎలక్ట్రికల్ వాహనాలు మాత్రమే ఇస్తున్నారు. ఖర్చు తక్కువ కావడంతో వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవి బరువు ఎక్కువ ఉన్నా, ఎత్తు ప్రదేశాల్లోనూ ముందుకు నడవని పరిస్థితి ఉంది. దీంతో నడిరోడ్డుపైన దివ్యాంగులు నరకయాతన పడుతున్నారు. అలాగే దివ్యాంగులకు ఎంత మేర వైకల్యం ఉందనే దానిపై పింఛను విధానం ఆధారపడి ఉండాలని, 100 శాతం ఉన్న వారికి ఒకలా, కొద్దిగా వైకల్యం ఉన్న వారికి మరోలా పింఛను విధానం అమలు చేయాలని శ్రీ భాస్కర్ కోరారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వేడుకున్నారు.
*పెళ్లికానుక క్లోజ్ అంటున్నారు…
అత్తిలి నుంచి వచ్చిన దివ్యాంగ జంట ఈ ప్రభుత్వం పెళ్లికానుకను ఎలా నిర్వీర్యం చేసిందో, తమకు ఎలా అన్యాయం చేసిందో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకున్నారు. అత్తిలికి చెందిన శ్రీ పంతాడి జనార్థనరావు, శ్రీమతి లక్ష్మి దుర్గ వివాహ ఇన్ఫో సొసైటీ ద్వారా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు. వివాహ సమయంలో అధికారులు మీకు పెళ్లికానుక కింద ప్రభుత్వం నుంచి రూ.1.50 లక్షలు వస్తాయని చెప్పారని, ఇప్పటి వరకు ఆ సొమ్ములు అందలేదని శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. చాలాసార్లు ప్రభుత్వ కార్యాలయాల వెంట తిరిగినా ఫలితం లేదని వాపోయారు. ఇటీవల వెళ్లి గట్టిగా అడిగితే… పెళ్లికానుక సైట్ క్లోజ్ అయిందని, తాము ఏమీ చేయలేమని చావుకబురు చల్లగా చెప్పారని దివ్యాంగ జంట ఆవేదన వ్యక్తం చేసింది. డబ్బులు వస్తాయని ఆశగా ఎదురుచూస్తే చివరకు ఇలా చెప్పారంటూ కన్నీరుమున్నీరయ్యారు. తమకు న్యాయం చేయాలని, పథకం ఉన్నప్పుడు దరఖాస్తు చేసుకున్న వారికి అయినా సొమ్ములు అందేలా చూడాలంటూ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అర్జీ సమర్పించారు.