జగన్​కు అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదు

  • జనసేన నేత గురాన అయ్యలు

విజయనగరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగాన్ని చెత్తబుట్టలో పడేసిన నిరంకుశ పాలకుడు జగన్‌ కు అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని జగన్ తుంగలో తొక్కారని, వేలాది మందిపై అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చినది మొదలు గత నాలుగేళ్ల ఎని మిది నెలల్లో దళితుల పట్ల నేరా లు, ఘోరాలకు లెక్కే లేదని ఆరోపించారు. విజయవాడలో భారీ అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసినంత మాత్రాన ఆ పాపాలు పోవన్నారు. చేసిన పాపాలకు జగన్‌రెడ్డి మూల్యం చెల్లించుకోవడం ఖాయమన్నారు. అమరావతిలో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం, స్మృతివనం ఏర్పాటు పనుల్ని ఆపివేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విజయవాడ విగ్రహం గురించి గొప్పలకు పోతున్నారని ఎద్దేవా చేశారు. భారీ అంబేడ్కర్ విగ్రహాలు పెట్టడం ద్వారా దళితులను మభ్యపెట్టి వారి ఓట్లను దండుకోడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మాస్క్ కోసం గట్టిగా అడిగాడన్న నెపంతో దళిత డాక్టర్ సుధాకర్‌ పట్ల అధికార పక్షం దారుణంగా వ్యవహరించదని ఆరోపించారు. ఇక దళిత స్త్రీలపై అత్యాచారాలు, దళిత యువకుల నోళ్లలో మూత్రం పోయడాలు, దళిత అధికారుల హత్యలు కొనసాగుతూనే వున్నాయన్నారు. ఏకంగా అధికార పక్ష ఎమ్మెల్సీ సైతం దళితుడైన తన డ్రైవర్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసేంత నిర్లజ్జగా దళితులపై మారణకాండ కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారని, వారి కోసం ఉద్దేశించిన దళిత సాధికారతా పథకాలను సైతం రద్దు చేసి వారి వెన్ను విరిచిన ఈ సమయంలో అంబేడ్కర్ నూట పాతిక అడుగుల విగ్రహ స్థాపన పేరుతో మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను నమ్మే స్థితిలో లేరన్నారు. దళితుల హక్కుల కోసం, చట్టాల కోసం, నిధుల కోసం దళితులంతా కలిసికట్టుగా పోరాడి జగన్‌ రెడ్డికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.