పంచాయ‌తీల‌ను చంపేస్తున్న జ‌గ‌న్ రెడ్డి

  • జ‌న‌సేన పార్టీ అర‌కు పార్ల‌మెంట్ ఇన్‌చార్జ్ డా. వంపూరు గంగుల‌య్య‌

అల్లూరి సీతారామ‌రాజు జిల్లా, పాడేరు, దేశం అభివృద్ధి చెందాలంటే ప‌ల్లెలు అభివృద్ధి చెందాలి. కానీ నేడు వైసీపీ ప్ర‌భుత్వం ప‌ల్లెల‌ను అభివృద్ధికి దూరంగా ఉంచుతోందని జ‌న‌సేన అర‌కు పార్ల‌మెంట్ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ వంపూరు గంగుల‌య్య విమ‌ర్శించారు. రేపు జాతీయ పంచాయ‌తీరాజ్ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఆయ‌న శ‌నివారం మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా స‌రే గ్రామాల అభివృద్ధికి తొలి ప్రాధాన్య‌మిస్తాయ‌ని కానీ వైసీపీ మాత్రం ప‌ల్లెల అభివృద్ధిని అడ్డుకుంటోంద‌ని ఆరోపించారు. కేంద్ర‌, రాష్ట్రాలు స‌మాన ప్రాతిప‌దిక‌న నిధుల‌తో గ్రామాల‌ను అభివృద్ధి ప‌ర‌చాల్సింది పోయి ఈ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మాత్రం కేంద్రం ఇచ్చిన నిధుల‌ను కూడా త‌మ ప్ర‌యోజ‌నాల కోసం ఉప‌యోగిస్తుండ‌డం అన్యాయ‌ని తెలిపారు. గ్రామాల‌కు 14, 15వ ఆర్థిక సంఘం నిధుల‌ను కేటాయిస్తే ఈ ప్ర‌భుత్వం వాటితో పాటు స‌మాన నిధులు కేటాయించాల్సింది పోయి వాటిని పంచాయ‌తీ ఖాతా నుంచి స‌ర్పంచ్‌ల అనుమ‌తి లేకుండా తీసేసుకుంద‌ని విమ‌ర్శించారు. గ‌తంలో స‌ర్పంచ్‌కు అన్ని అధికారాలు ఉండేవ‌ని కాని నేడు ప్రెసిడెంట్ అధికారాల‌న్నింటినీ లాగేసుకొని అస‌మ‌ర్థులుగా మిగిల్చింద‌ని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో స‌ర్పంచ్ లుగా గెలిచి ఏడాదైంద‌ని ఏ స‌ర్పంచ్ అయినా ఒక్క ప‌ని అయినా చేసేరేమో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఎందుకంటే చేయ‌డానికి వారి చేతి చిల్లిగ‌వ్వ లేద‌ని పారిశుధ్య కార్మికుల‌కు జీతాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితి పంచాయ‌తీల‌కు దాపురించిందంటే అది ఈ ప్ర‌భుత్వం నిరంకుశ నిర్ణ‌యాల వ‌ల‌నేన‌ని ఆయ‌న తెలిపారు. ఇలా ఎందుకు చేశార‌ని మీడియా వారు అడిగితే పంచాయ‌తీ రాజ్ శాఖా మంత్రి వింత స‌మాధానాలు ఇస్తున్నార‌ని, గ‌త టీడీపీ చేసిందే తాము చేసిమ‌ని అప్పుడెందుకు వారిని అడ‌గ‌లేద‌ని ఎదురు ప్ర‌శ్న‌వేశారని ఆక్షేపించారు. తెలుగుదేశం ప్ర‌భుత్వం త‌ప్పులు చేసింది కాబ‌ట్టే ప్ర‌జా కోర్టులో శిక్షించ‌బ‌డింద‌ని కానీ వైసీపీని న‌మ్మి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డితే మీరూ అలాగే చేయ‌డాన్ని ఏమ‌నుకోవాల‌ని ప్ర‌శ్నించారు. వేల మంది వైసీపీ మ‌ద్ద‌తుదారులు పంచాయ‌తీ స‌ర్పంచ్‌లుగా ఎన్నికైన వారున్నార‌ని వారెందుకు సీఎంను ఈ విష‌యంలో నిల‌దీయ‌లేక‌పోతున్నార‌న్నారు. టీడీపీ ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు మాత్ర‌మే వేరేవాటికి మ‌ళ్లించి మ‌ళ్లీ ఇచ్చింద‌ని నేడు జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మాత్రం ఆర్థిక సంఘం నిధులతో పాటు సాధార‌ణ నిధుల‌ను కూడా దోచుకున్నార‌ని ఆరోపించారు. గాంధీజీ క‌ల‌లు క‌న్న గ్రామ స్వ‌రాజ్యం సాధిస్తామ‌ని చెప్పి గెలిచిన జ‌గ‌న్ రెడ్డి స‌ర్పంచ్ అధికారులు, హ‌క్కుల‌ను లాగేసుకుంటున్నార‌న్నారు. పంచాయ‌తీల‌కు కేటాయించాల్సిన నిధులను కేటాయిస్తూ ఇప్ప‌టివ‌ర‌కూ పంచాయ‌తీ ఖాతాల నుంచి మ‌ళ్లించిన నిధుల‌ను వెంట‌నే తిరిగి చెల్లించాల‌ని జ‌న‌సేన పాడేరు, అర‌కు పార్ల‌మెంట్ ఇన్‌చార్జ్‌ వంపూరు గంగుల‌య్య డిమాండ్ చేశారు.