ముస్లిం మైనారిటీలపై జగన్ రెడ్డిది కపటప్రేమ

  • పేదల్ని ఆదుకోవటానికి చదువుతో ఏంపని?
  • పథకాలు ఇవ్వటం ఇష్టంలేకే కఠిన నిబంధనలు
  • ప్రాణంలా నమ్మినందుకు ముస్లింలను, దళితులను నయవంచన చేశారు.
  • పేదల కోపాగ్నిలో 2024లో వైసీపీ దహనం అవ్వటం ఖాయం.
  • జగన్ కి చిత్తశుద్ధి ఉంటే పదవ తరగతి పాస్ అవ్వని శాసనసభ్యులతో, మంత్రులతో రాజీనామా చేయించాలి.
  • ఎలాంటి ఆంక్షలు, నిబంధనలు లేని పథకాల అమలుకై జనసేన పోరాడుతుంది.
  • ప్రజలు ఇప్పటికైనా వైసీపీ మోసాల్ని గ్రహించాలి.
  • వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్, రాష్ట్ర మైనారిటీ నేత నాయబ్ కమాల్

గుంటూరు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం, మైనారిటీలోని 90% మంది వైసీపీ పార్టీని సొంతం చేసుకొని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కృషి చేశారని, కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింల అభివృద్ధిని పూర్తిగా మరచిపోయిందని, ముస్లింలపై జగన్ రెడ్డిది కపటంతో కూడిన ప్రేమ అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్, మైనారిటీ నేత షేక్ నాయబ్ కమాల్ అన్నారు. పేదల్ని ఆదుకోవటానికి జగన్ రెడ్డికి మనసురాకే సంక్షేమ పథకాల అమల్లో కఠిన నిబంధనలు విధిస్తున్నారంటూ మండిపడ్డారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల్లో పెట్టిన నిబంధనలపై జనసేన నేతలు వైసీపీ పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా బోనబోయిన మాట్లాడుతూ పేదల్ని ఆదుకోవటానికి చదువు ఎలా అడ్డు వస్తుంది? రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ దిగువ మధ్యతరగతికి చెందిన పేదలే కదా అలాంటిది మరలా సంక్షేమ పథకాల అమలులో ఈ షరతులు పెట్టడం అంటే పేదల్ని దగా చేయటమేనని అన్నారు. పేద విద్యార్థులకు స్కూల్లను దూరం చేసి, బడుల్లో ఉపాధ్యాయులని నియమించకుండా చదువును ఎలా ప్రోత్సహిస్తారని వైసీపీ నేతల్ని నిలదీశారు. మరోవైపు సంక్షేమ పథకాల కోసమంటూ చేస్తున్న అప్పు లక్షల కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని ఆయన ప్రశ్నించారు. పరిపాలన అంటే ముద్దులివ్వటం, మాయమాటలు చెప్పటం, బటన్ నొక్కటం కాదని బోనబోయిన శ్రీనివాస్ అన్నారు. ఐదవ తరగతి చదివిన వాళ్ళు శాసనసభ్యులుగా, మంత్రులుగా ఉండేందుకు అర్హత ఉన్నప్పుడు పేద ముస్లింలు సంక్షేమ పథకాలకు మాత్రం అర్హులు కారా అంటూ రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి , మైనారిటీ నాయకులు షేక్ నాయబ్ కమాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలపై జగన్ రెడ్డికి అసలు ప్రేమ లేదని, ముస్లింలు అభివృద్ది చెందటం ముఖ్యమంత్రికి ఇష్టం లేదన్నారు. హైకోర్టు తలంటింది కాబట్టి తూ తూ మంత్రంగా ఒక పథకాన్ని రూపొందించారన్నారు. నిజంగా చదువుని ప్రోత్సహించాలి అంటే పదవ తరగతి పాసై పెళ్లి చేసుకున్న జంటకి అదనంగా ఇంకో యాభైవేలో, లక్షో ఇస్తామని చెప్పాలి కానీ అసలు ఆ పథకాలే అందకుండా కఠిన నిబంధనలు పెట్టారు అంటే ముస్లింలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఎంత ప్రేమ ఉందొ అర్ధం చేసుకోవచ్చని కమాల్ అన్నారు. జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు మాట్లాడుతూ పథకాల అమలుకన్నా వాటి ప్రచారానికే ఎక్కువ ఖర్చు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కూల్చడం, రంగులు మార్చటం, పేర్లు మార్చటం మినహా గత మూడన్నరేళ్లుగా వైసీపీ సాధించిందేమి లేదని విమర్శించారు. ముస్లింలను అదుకోవటానికి మా దగ్గర డబ్బులు లేవని కోర్టుకి చెప్పిన ముస్లిం ద్రోహి జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. నిబంధనలు, కఠిన ఆంక్షలు లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందేవరకు జనసేన పార్టీ కృషి చేస్తుందని, ఇప్పటికైనా ప్రజలు వైసీపీ మాయా జాలన్ని గ్రహించాలని గాదె వెంకటేశ్వరరావు అన్నారు. ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా లాంటి వెన్నుముక లేని నేతల వల్లే ముస్లింలకు తీరని అన్యాయం జరుగుతుందని జిల్లా ఉపాధ్యక్షుడు ఇస్లాం భేగ్ అన్నారు ముస్లింల అభివృద్ధికి వైసీపీ చేసిన కృషి ఏమిటో శ్వేతపత్రం ద్వారా ముస్లింలకు తెలియచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతీ ఇంట్లో జగన్ ఫోటో ఉండేలా పరిపాలన చేస్తానన్న జగన్ రెడ్డి ఫోటోను చూస్తేనే అసహ్యం వేసేలా ఉందని ఇస్లాం బేగ్ అన్నారు. ముస్లింలకు తీరని అన్యాయం చేసిన వాడిగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని బేగ్ విమర్శించారు. విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, కొర్రపాటి నాగేశ్వరరావు, తన్నీరు గంగరాజు, కొత్తకోటి ప్రసాద్ పాల్గొన్నారు.